లక్ష కేసులొచ్చినా..

ABN , First Publish Date - 2020-03-31T09:04:53+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసులు ప్రస్తుతానికి వందలోపే ఉన్నాయి. కానీ.. లక్ష కేసులు వచ్చినా వైద్యానికి ఇబ్బంది లేకుండా రాష్ట్ర సర్కారు సన్నద్ధమవుతోంది.

లక్ష కేసులొచ్చినా..

త్వరలో లక్ష పీపీఈ కిట్లు అందుబాటులోకి

డీఆర్‌డీఏ నుంచి 500 వెంటిలేటర్లు

ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ నుంచి 1000 వెంటిలేటర్లు

చర్చలు జరిపిన మంత్రులు కేటీఆర్‌, ఈటల

50 వేల మందికి పరీక్షలు జరిపే టెస్టింగ్‌ కిట్స్‌

50 లక్షల హైడ్రాక్సీ క్లోరోక్విన్‌మాత్రలు

రూ.20 కోట్లతో ఐవీ ఫ్లూయిడ్స్‌ కొనుగోలు


హైదరాబాద్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కేసులు ప్రస్తుతానికి వందలోపే ఉన్నాయి. కానీ.. లక్ష కేసులు వచ్చినా వైద్యానికి ఇబ్బంది లేకుండా రాష్ట్ర సర్కారు సన్నద్ధమవుతోంది. మందులు, వైద్య పరికరాలు, వైద్య సిబ్బంది ధరించే రక్షణాత్మక దుస్తులు, రోగులకు అవసరమైన వెంటిలేటర్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోంది. ముందుగా ఐసోలేషన్‌, వెంటిలేటర్స్‌, పడకల లభ్యతపై దృష్టిపెట్టింది.


లక్ష డిస్పోజబుల్‌ పీపీఈ కిట్స్‌..

కరోనాను ఎదుర్కొవడానికి వైద్య సిబ్బందికి ప్రధానంగా కావాల్సింది  పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్వి్‌పమెంట్‌ కిట్లు. ఇప్పటికే టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ ద్వారా రూ.12 కోట్ల విలువైన కిట్ల కొనుగోలుకు ఇండెంట్స్‌ పెట్టారు. అవి సరిపోయే పరిస్థితి లేకపోవడంతో స్థానికంగానే లక్ష డిస్పోజబుల్‌ పీపీఈలను తయారు చేయించేందుకు సర్కారు సిద్ధమైంది. అందుకు అవసరమైన ముడిపదార్థాలు రిలయన్స్‌ వద్ద ఉన్నాయని తెలుసుకున్న సర్కారు.. ఆ సంస్థతో చర్చలు జరిపి ఒప్పించింది. అదేవిధంగా  రెండున్నర గంటల్లో కరోనా ఫలితాలు వచ్చే 500 కిట్ల కొనుగోలుకు సర్కారు సిద్ధమైంది. ఒక్క కిట్‌తో 100 మందికి పరీక్షలు చేయవచ్చు. ఈ లెక్కన 500 కిట్లతో 50 వేల మందికి పరీక్షలు చేయొచ్చు.


డీఆర్‌డీఏతో కూడా..

కరోనా చికిత్సలో వెంటిలేటర్లు అత్యంత కీలకం. అందుకే ఇప్పటికే 500 వెంటిలేటర్లకు ఆర్డర్‌ ఇచ్చిన సర్కారు.. అవి సరిపోవనే భావనతో డీఆర్‌డీఏతో కూడా చర్చలు జరిపింది. ఆ సంస్థ నుంచి మరో 500 వెంటిలేటర్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే మెదక్‌లోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ కూడా 20 వేల వెంటిలేటర్స్‌ను తయారు చేస్తోంది. వాటిలో తమకు 1000 వెంటిలెటర్స్‌ కావాలని సర్కారు కోరింది. అటు డీఆర్‌డీఏ, ఇటు ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలతో మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌ చర్చలు జరిపి ఒప్పించారు. ఇవి కూడా వస్తే.. సర్కారీ ఆస్పత్రుల్లోనే 2200 వరకు వెంటిలేటర్స్‌ అందుబాటులోకి వస్తాయి.


అలాగే రోగులకు అవసరమైన ఐవీ ఫ్లూయిడ్స్‌కు కూడా భారీగా ఇండెంట్‌ పెట్టారు. రూ.20 కోట్ల విలువైన ఐవీ ఫ్లూయిడ్స్‌ను తెప్పిస్తున్నారు. బాధితులకు సాధారణ చికిత్సలో అవసరమైన  యాంటీ రిట్రోవైరల్‌ డ్రగ్స్‌, యాంటీ బయాటిక్స్‌ను కూడా పెద్దయెత్తున కొనుగోలు చేస్తున్నారు. 50 లక్షల హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలకు కూడా సర్కారు ఇండెంట్‌ పెట్టింది. కొద్ది రోజుల్లో ఇవి కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు 50 లక్షల గ్లౌజులు, శానిటైజర్స్‌, మాస్కులు, ఎన్‌ 95  మాస్కులు, రెస్పిరేటరీ మెడిసిన్స్‌, మానిటర్స్‌ను కొనుగోలు చేస్తున్నారు.

Updated Date - 2020-03-31T09:04:53+05:30 IST