మానవత్వం చాటుకుంటున్న కుబేరులు.. పన్నులు పెంచమంటూ..

ABN , First Publish Date - 2020-07-14T04:21:38+05:30 IST

కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం ఎవరూ ఊహించని విధంగా మారిపోయింది.

మానవత్వం చాటుకుంటున్న కుబేరులు.. పన్నులు పెంచమంటూ..

వాషింగ్టన్: కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం మొత్తం ఎవరూ ఊహించని విధంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో వస్తాయని ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా ఊహించలేదు. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మందిపై కరోనా ప్రభావం పడింది. ఆర్థికంగా కోట్లాది ప్రజలు నష్టపోయారు. ఉద్యోగాలు కోల్పోయి తినడానికి తిండి కూడా లేకుండా కోట్లాది మంది అల్లాడుతున్నారు. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది కుబేరులు మానవత్వం చాటుకుంటున్నారు. ఎలా అంటే.. తమ నుంచి ప్రభుత్వాలు అధిక పన్ను వసూలు చేయమంటూ ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది కుబేరులు ప్రభుత్వాలకు లేఖ రాశారు. పన్ను పెంపుకు మద్దతు తెలుపుతూ ఈ లేఖలో వందలాది మంది కుబేరులు సంతకం చేశారు. ‘కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కోటీశ్వరులుగా ప్రపంచానికి మేమ సహాయం చేయడంలో, ప్రజలను కాపాడటంలో కీలకపాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. 


అయితే మేము డాక్టర్లలా ఆసుపత్రుల్లో ప్రజల ప్రాణాలను కాపడలేము. కానీ.. మా దగ్గర చాలా డబ్బు ఉంది. ఇప్పుడు, రానున్న కాలంలో ఆ డబ్బు ప్రపంచానికి ఎంతో అవసరం. మాకు విధిస్తున్న పన్నును ప్రభుత్వం వెంటనే పెంచి దాన్నే శాశ్వతం చేయాలని మేము ప్రభుత్వాలను కోరుతూ సంతకం చేస్తున్నాము. చారిటీల ద్వారా వచ్చే సహాయం ప్రస్తుత పరిస్థితుల్లో సరిపోదు. ప్రపంచంలో మాలాగే ధనవంతులుగా ఉన్న వారిపై ఎక్కువ పన్నులు వసూలు చేసి వాటిని విద్య, వైద్య తదితర రంగాల్లో ఉపయోగపడేలా ప్రభుత్వాలు పనిచేయాలి’ అని లేఖలో కుబేరులు రాసుకొచ్చారు.  కాగా.. ఈ లేఖలో సంతకాలు చేసిన వారిలో అమెరికాలోని వాల్ట్ డిస్నీ సంస్థకు వారసురాలిగా ఉన్న అబిగెయిల్ డిస్నీ, యూకే స్క్రీన్ రైటర్ రిచార్డ్ కర్టిస్, బెన్ అండ్ జెర్నీస్ ఐస్‌క్రీమ్ సహవ్యవస్థాపకులు జెర్రీ గ్రీన్‌ఫీల్డ్ కూడా ఉన్నారు. 

Updated Date - 2020-07-14T04:21:38+05:30 IST