ఒక్క సందేశం విలువ... మిలియన్‌ మీల్స్‌

ABN , First Publish Date - 2021-04-12T05:30:00+05:30 IST

ఒక ఆలోచన జీవితాన్ని మార్చేస్తుందో లేదో తెలియదు కానీ... ఒకే ఒక్క వాట్సప్‌ సందేశం మాత్రం లాక్‌డౌన్‌లో వేల మందికి అన్నం పెట్టింది. అభాగ్యుల కడుపు నింపే మహత్తర కార్యక్రమం ‘1 మిలియన్‌ మీల్స్‌’కు నాంది పలికింది...

ఒక్క సందేశం విలువ... మిలియన్‌ మీల్స్‌

ఒక ఆలోచన జీవితాన్ని మార్చేస్తుందో లేదో తెలియదు కానీ... ఒకే ఒక్క వాట్సప్‌ సందేశం మాత్రం లాక్‌డౌన్‌లో వేల మందికి అన్నం పెట్టింది. అభాగ్యుల కడుపు నింపే మహత్తర కార్యక్రమం ‘1 మిలియన్‌ మీల్స్‌’కు నాంది పలికింది. దీని వెనకాల ఉన్నది...  రుచిరా గుప్తా. ఆమె నిస్వార్థ సేవా ‘సందేశం’ ఇది... 


గత ఏడాది మార్చి మాసం... కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి కేంద్రం లాక్‌డౌన్‌ ప్రకటించింది. సరిగ్గా ఆ తరువాత మూడు రోజులకు ఢిల్లీలోని రుచిరా గుప్తాకు అదే నగరానికి చెందిన పన్నెండేళ్ల పాప నుంచి వాట్స్‌పలో ఓ సందేశం వచ్చింది... ‘అక్కా... తిండి లేక పస్తులుంటున్నాం. ఆకలికి తట్టుకోలేకపోతున్నాం. దయచేసి ఏదో ఒకటి చేయండి’ అని! ఆ బాలిక ఢిల్లీలోని రెడ్‌లైట్‌ ప్రాంతంలో నివసించే ఓ సెక్స్‌వర్కర్‌ కుమార్తె. లాక్‌డౌన్‌ వల్ల బోర్డింగ్‌ స్కూల్‌లో చదువుకొనే ఆ పాపను ఇంటికి పంపించేశారు. దాంతో ఆమెకు ఆకలి కష్టాలు మొదలయ్యాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సెక్స్‌వర్కర్ల పిల్లలను ఆ కూపం నుంచి బయటకు తెచ్చి, వారికి మెరుగైన జీవితం అందించాలని కృషి చేస్తోంది ‘అప్‌నే ఆప్‌’. దాని ఆధ్వర్యంలోనే ఈ చిన్నారి చదువుకుంటోంది. ఆ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు ఎవరో కాదు... రుచిరా గుప్తానే! అమితమైన బాధతో చిన్నారి పంపిన ఆ ఒక్క సందేశం ఆమె హృదయాన్ని తాకింది. అంతులేని ఆవేదన మిగిల్చింది. అందులో నుంచి పుట్టిందే ‘1 మిలియన్‌ మీల్స్‌’ క్యాంపెయిన్‌. 


ఆపన్నులకు అన్నం... 

పన్నెండేళ్ల బాలిక సందేశంతో పురుడు పోసుకున్న ‘1 మిలియన్‌ మీల్స్‌’ లక్ష్యం... కనీసం పది లక్షల మంది ఆపన్నులకు అన్నం పెట్టడం. చేతిలో పని పోయి... సంపాదన లేక... పస్తులుండే కుటుంబాల కడుపు నింపడమే ఈ క్యాంపెయిన్‌ ఉద్దేశం. ‘‘చిన్నారి నుంచి సందేశం వచ్చిన వెంటనే నా స్నేహితురాలిని కలిశాను. తన ద్వారా అత్యవసరంగా ఆ ప్రాంతంలోని ఐదు వందల మందికి భోజనం అందించాం. ఆ తరువాత నుంచి బిహార్‌, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాలకు చెందిన మహిళల నుంచి కూడా ‘మా ఆకలి తీర్చండి’ అంటూ సందేశాలు రావడం మొదలయ్యాయి’’ అంటూ చెప్పుకొచ్చారు రుచిరా గుప్తా. 


అతిపెద్ద ఫుడ్‌ డ్రైవ్‌... 

అప్పటికైతే రెడ్‌లైట్‌ ప్రాంతంలోని వారి ఆకలి తీర్చగలిగారు కానీ... ఎప్పుడు ముగుస్తుందో తెలియని లాక్‌డౌన్‌లో ఇలాంటి అభాగ్యుల కడుపు నిండేదెలా? ‘‘ఈ ఆలోచన నాకు నిద్రపట్టనివ్వలేదు. ఏం చేయాలనుకొంటుండగా మదిలో ‘1 మిలియన్‌ మీల్స్‌’ ఆలోచన తట్టింది. అయితే ముందుకు ఎలా వెళ్లాలి? వాట్సప్‌ గుర్తుకు వచ్చింది. వెంటనే దాని ద్వారా ఈ క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టాను. తాము ఎంతమంది ఉన్నామో... ఎంత ఆహారం అవసరమో వివిధ ప్రాంతాల నుంచి వాట్స్‌పలో సందేశాలు పంపించేవారు. వారందరికీ సమయానికి భోజనం అందించేలా ఆయా ప్రాంతాల్లోని ఫ్యాక్టరీ యజమానులు, ఇతర దాతలతో ఒక మానవహారం ఏర్పాటు చేశాను. ఇవన్నీ అంతరాయం లేకుండా జరగడానికి కంట్రోల్‌రూమ్‌లు పెట్టాను. ఆహారం అందిందో లేదో తెలియడానికి ప్యాకెట్లు తీసుకున్నవాళ్లను ఫొటోలు పెట్టమన్నాను’’ అంటున్న రుచిరా గుప్తా ఈ క్రమంలో ఎన్నో ఇబ్బందులు, సవాళ్లు ఎదుర్కొన్నారు. అయితే ఆమె సంకల్పం ముందు ఇవేవీ అవరోధంగా నిలవలేదు.  


నిత్యావసరాలు కూడా...  

రుచిరా ఒకపక్క ఈ క్యాంపెయిన్‌ కొనసాగిస్తూనే బియ్యం, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, మసాలా దినుసులు, వంటనూనె వంటి నిత్యావసరాల పంపిణీకి కూడా శ్రీకారం చుట్టారు. చిరువ్యాపారుల నుంచి బడా కంపెనీల వారి దాకా... ఎవర్ని అడిగినా కాదనకుండా ఒక్క ఫోన్‌కాల్‌తో సరుకులు తీసుకువచ్చి గుట్టలుగా పోశారు. 


యాభై లక్షలు దాటింది... 

పది లక్షల భోజనాలు అందించాలన్న లక్ష్యంతో ఆరంభమైన ‘1 మిలియన్‌ మీల్స్‌’ క్యాంపెయిన్‌... 100 రోజుల్లో యాభై లక్షలు దాటేసింది. పస్తులుంటున్న యాభై వేల మందికి పైగా మహిళలు, పిల్లలకు ఇది అండగా నిలిచింది. ఆకలికి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవాలనుకున్న ఎందరికో ఊపిరి పోసింది. అంతమందిని ఆదుకున్న ఈ క్యాంపెయిన్‌ నేటికీ కొనసాగుతూనే ఉంది.




డాక్యుమెంటరీతో కొత్త జీవితం... 

రుచిరా గతంలో పాత్రికేయురాలిగా పనిచేశారు. 1996లో ‘ద సెల్లింగ్‌ ఆఫ్‌ ఇన్నోసెంట్స్‌’ అనే డాక్యుమెంటరీ తీశారు. భారత్‌లోని రెడ్‌లైట్‌ ప్రాంతాల్లోని మహిళల దుర్భర జీవితాలను ఇందులో చూపించారు. ఇందుకు గాను రుచిరకు ప్రతిష్టాత్మక ‘ఎమ్మి అవార్డు’ దక్కింది. 



ఆలోచనలు మార్చింది

‘‘జీవితం చాలించాలనుకున్న చాలామంది ఆలోచనలను మా కార్యక్రమం మార్చింది. ఆ కుటుంబాల ఆకలి బాధలను తీర్చాం. తొలుత  మేము నిర్దేశించుకున్న లక్ష్యం... 100 రోజుల్లో 10 వేల మందికి భోజనాలు అందించాలని! కానీ దానికి ఐదు  రెట్లు అధికంగా అందివ్వగలిగాం. ఈ క్రమంలో మా లక్ష్యం మారింది. 500 రోజుల వరకు దీన్ని కొనసాగించేలా ప్రణాళిక సిద్ధం చేశాం. అంటే మేము ఎంచుకున్న ప్రాంతాల్లోని ప్రతి బాలిక వ్యాక్సిన్‌ తీసుకొనేవరకు  ఇది నడుస్తుంది’’ అంటున్నారు రుచిరా గుప్తా. 


Updated Date - 2021-04-12T05:30:00+05:30 IST