మిలీనియం టవర్స్: కథ అడ్డం తిరుగుతుందని ముందే అర్థమైందా?

ABN , First Publish Date - 2020-02-23T03:08:38+05:30 IST

రాజధాని విశాఖకు షిఫ్టింగ్ అయిపోవాలి.. ఉన్నఫళంగా కార్యాలయాలు తరలిపోవాలి.. ఇదే ప్రభుత్వం టార్గెట్.! కానీ ఎక్కడికెళ్లాలి.. ఎక్కడుండాలి...

మిలీనియం టవర్స్: కథ అడ్డం తిరుగుతుందని ముందే అర్థమైందా?

రాజధాని విశాఖకు షిఫ్టింగ్ అయిపోవాలి.. ఉన్నఫళంగా కార్యాలయాలు తరలిపోవాలి.. ఇదే ప్రభుత్వం టార్గెట్.! కానీ ఎక్కడికెళ్లాలి.. ఎక్కడుండాలి. సచివాలయ ఉద్యోగుల్లో ఒకటే టెన్షన్. ఇదంతా ఒకెత్తైతే ప్రభుత్వ పెద్దలు మాత్రం ఎత్తుకుపైఎత్తులు వేశారు. అప్పుడే ప్రభుత్వ పెద్దల కంట్లో కుంభస్థలంలాంటి మిలీనియం టవర్స్‌ పడింది. ఇక వెనకడుగు వేయలేదు. అంతే స్పీడుగా ఐటీ కంపెనీలను ఖాళీ చేయాలంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఒక్కసారిగా ఐటీ ఉద్యోగుల గుండెల్లో పిడుగు పడినట్లైంది. ఈ తతంగం ఇలా జరుగుతుండగా సడన్‌ బ్రేక్‌లు వేసినట్టుగా.. జగన్ దూకుడికి నేవీ బ్రేకులు వేసింది. ‘‘అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి’’ అన్న చందగా జగన్ వేసిన ప్లాన్ రివర్స్ కొట్టింది. కథ అడ్డం తిరుగుతుందని మంత్రులు మందే ఊహించారేమో గతంలో కొన్ని కీలక ప్రకటనలు చేసి రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారారు.


జరిగిందిదీ..

జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. విశాఖ, కర్నూలు, అమరావతి.. ఈ 3 ప్రధాన నగరాలను కేంద్రంగా చేసుకుని రాజధానులు ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే అమరావతి నుంచి విశాఖకు కార్యాలయాల తరలింపునకు రంగం సిద్ధం చేశారు. అయితే విశాఖలో సచివాలయం ఎక్కడ పెట్టాలని ప్రభుత్వ పెద్దలు జల్లెడ పడితే మిలీనియం టవర్స్ కంట్లో పడింది. అంతే ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అందులో ఉన్న ఐటీ కంపెనీలను ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు కూడా ఇచ్చేసింది. అంతేకాదు.. ఉత్తరాంధ్రకు రాజధాని రావడం ఎంతో శుభపరిమాణం ఉంటూ ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు.. సీఎం జగన్‌కు విశాఖ ఉత్సవ్‌ సందర్భంగా ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి ఆర్కే బీచ్ వరకూ మానవహారంగా ఏర్పడి జిల్లా ప్రజలు ‘‘థ్యాంక్యూ జగన్’’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలతో హోరెత్తించారు.


జగన్‌కు షాకిచ్చిన నేవీ.. మిలీనియం టవర్స్‌లోకి నో ఎంట్రీ!


గతంలో మంత్రులు ఏమన్నారంటే..!?

అంతేకాకుండా..  మంత్రులు బొత్స, అవంతి, మేకపాటి పదే పదే ప్రెస్‌మీట్లు పెట్టి మరీ కొన్ని కీలక ప్రకటనలు చేశారు. మిలీనియం టవర్స్‌ ‌నుంచి ఐటీ కంపెనీలను వెళ్లగొడుతున్నారని విమర్శలు వస్తుండటంతో వాటికి అప్పట్లోనే రియాక్ట్ అయ్యారు. ఒకవైపు మిలీనియం టవర్స్‌లో సచివాలయ కోసం ఏర్పాట్లు చేసుకుంటూనే పైకి మాత్రం మీడియా ముందు ‘మిలీనియం టవర్స్‌‌లో సచివాలయం పెడుతున్నట్లు ఎవరు చెప్పారు..? ప్రభుత్వం ఏమైనా అధికారిక ప్రకటన చేసిందా..? ఈ మేరకు జీవోలు ఏమైనా ఇచ్చిందా..? ఐటీ కంపెనీలను మేం వెళ్లమన్నామా..’ అని మంత్రులు ప్రకటన చేశారు. భవిష్యత్తులో మిలీనియం టవర్స్‌లో సచివాలయ ఏర్పాటుకు నేవీ అడ్డు చెబితే ఈ ప్రకటనలను సాకుగా చూపి అసలు అలాంటి ప్రయత్నాలు తాము చేయలేదని ఎత్తి చూపేందుకే ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 


ఇక్కడే సీన్ రివర్స్ అయ్యింది!

ఓ వైపు సచివాలయం తరలింపుకు పనులు చకచకా జరిగిపోతుంటే.. తాజాగా నేవీ అధికారిక ప్రకటన ప్రభుత్వానికి షాకిచ్చినట్లయ్యింది. ‘ మిలీనియం టవర్స్‌లో సచివాలయం పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమే. ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు’ అని తేల్చిచెప్పింది. తాజా నేవీ ప్రకటనతో వైసీపీ నేతల స్పందన చర్చనీయాంశంగా మారింది. గతంలో చేసిన ప్రకటనలే పునరుద్ఘటిస్తూ తామేమీ మిలీనియం టవర్స్‌లో సచివాలయ ఏర్పాటుకు పూనుకోలేదని చెప్పుకొస్తున్నారు. సచివాలయం ఏర్పాటు ఆ టవర్స్‌లోనే అని ముందే ప్రకటించి ఉంటే.. నేవీ నుంచి ఇలాంటి అడ్డంకులు ఉంటాయని తద్వారా ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుందనే ఇలా చేశారనే విమర్శలూ వస్తున్నాయి.



Updated Date - 2020-02-23T03:08:38+05:30 IST