భాగ్ మిల్కాభాగ్

ABN , First Publish Date - 2021-06-20T08:38:58+05:30 IST

అది 1947.. భారత్‌ స్వేచ్ఛా వాయువులను పీల్చుకోవడమే కాదు.. మత కల్లోలాల్లో లక్షలాది ప్రాణాలను కూడా బలి తీసుకున్న ఏడాది.

భాగ్ మిల్కాభాగ్

అది 1947.. భారత్‌ స్వేచ్ఛా వాయువులను పీల్చుకోవడమే కాదు.. మత కల్లోలాల్లో లక్షలాది ప్రాణాలను కూడా బలి తీసుకున్న ఏడాది. దీంట్లో భాగంగానే పాకిస్థాన్‌లోని ఓ కుర్రాడు తన కళ్లెదుటే ముష్కరుల దాడిలో తల్లిదండ్రులను కోల్పోయాడు. అప్పుడు ప్రాణ భయంతో పరిగెత్తి భారత్‌లో అడుగుపెట్టాడు.


సీన్‌ కట్‌ చేస్తే..

అది 1958, కార్డిఫ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌.. రెఫరీ బుల్లెట్‌ పేల్చాడు. బక్కపల్చని ఓ సిక్కు యువకుడు సింథటిక్‌ ట్రాక్‌పై మెరుపు వేగంతో పరిగెడుతున్నాడు. మొండి పట్టుదలతో అందరికన్నా ముందే  రేసును పూర్తి చేయడంతో ఒక్కసారిగా ఆశ్చర్యం. ఎందుకంటే అప్పటివరకు అథ్లెటిక్స్‌లో భారత్‌ ఎన్నడూ స్వర్ణం సాధించలేదు. ఈ రెండు సన్నివేశాల్లోనూ కాళ్లకు పనిచెప్పిన వ్యక్తి ఒక్కడే.. అతడే ‘ఫ్లయింగ్‌ సిఖ్‌’ మిల్కా సింగ్‌.


ఆసియా గేమ్స్‌లో మోత:

1958, 1962లో జరిగిన టోక్యో, జకర్తా ఆసియా క్రీడల్లో మిల్కా అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ఏకంగా 4 స్వర్ణ పతకాలను దేశానికి అందించాడు. టోక్యోలో 200, 400మీ.లలో.. జకర్తా గేమ్స్‌లో 400మీ., 4గీ400మీ. రేసుల్లోనూ విజేతగా నిలిచి శభాష్‌ అనిపించుకున్నాడు.

ఇవీ ఘనతలు

కామన్వెల్త్‌ గేమ్స్‌- స్వర్ణం (1958)

ఆసియా గేమ్స్‌-     4 స్వర్ణాలు (1958, 1962)

జాతీయ క్రీడలు-    2 స్వర్ణాలు (1958)

పద్మశ్రీ అవార్డు-    1958లో


కోలుకుంటా..:

‘ఆందోళన వద్దు. నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నా. నాకు కరోనా సోకడం ఆశ్చర్యంగా ఉంది. త్వరలో కోలుకొని బయటకు వస్తా’ అని ఆసుపత్రిలో చేరడానికి ముందు మిల్కాసింగ్‌ అన్న మాటలు. అయితే కొవిడ్‌ను జయించిన అతడు..తర్వాత ఏర్పడిన సమస్యలపై చేసిన పోరాటంలో మాత్రం అలిసిపోయాడు.


బయోపిక్‌కు కేవలం రూపాయే..:

‘భాగ్‌ మిల్కా భాగ్‌’ పేరిట మిల్కా జీవితంపై రూపొందిన బయోపిక్‌ 2013లో విడుదలై బాక్సాఫీస్‌ హిట్‌ కొట్టింది. ఫర్హాన్‌ అక్తర్‌ టైటిల్‌ రోల్‌ పోషించిన ఆ సినిమాకు మిల్కాసింగ్‌ తీసుకున్న పారితోషికం కేవలం రూపాయే. ఇంతకీ ఆ రూపాయి స్పెషల్‌ ఏమిటో తెలుసా..1958లో ఆ నోటు ప్రింటైంది. అదే ఏడాది కామన్వెల్త్‌ గేమ్స్‌లో మిల్కాసింగ్‌ స్వర్ణ పతకం గెలవడం విశేషం. 


అర్జునను అందుకోలేదు..:

2001లో మిల్కా కు అప్పటి ప్రభుత్వం అర్జున అవార్డును ప్రకటించింది. కానీ మిల్కా దీన్ని తిరస్కరించాడు. 1958లోనే పద్మశ్రీ అందుకున్న తనకు 43 ఏళ్ల తర్వాత అర్జున ప్రకటించడం రుచించలేదు. 



సికింద్రాబాద్‌తో అనుబంధం..

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి) : దిగ్గజ అథ్లెట్‌ మిల్కాసింగ్‌కు సికింద్రాబాద్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. 1952లో సైన్యంలో చేరిన మిల్కా..సికింద్రాబాద్‌లోని ఈఎంఈ సెంటర్‌లో బాధ్యతలు నిర్వర్తించాడు. 1960 వరకు ఇక్కడ ఉన్న సమయంలోనే అతడి అథ్లెటిక్స్‌ కెరీర్‌కు అడుగులు పడ్డాయి. బొల్లారంలోని అమ్ముగూడ పహాడ్‌ చుట్టూ మిల్కా ప్రతిరోజూ రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేసేవాడు. రాళ్లు నింపిన బ్యాగులు భుజాన ఉంచుకొని పరిగెత్తేవాడు. అలా అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు సికింద్రాబాద్‌లోనే బీజాలు పడ్డాయి. ఈనేపథ్యంలో ఈఎంఈ సెంటర్‌లోని ఓ కాలనీకి మిల్కాసింగ్‌ పేరు పెట్టి స్థానికులు అతడిని గౌరవించారు. కాగా 2014 నవంబరులో మిల్కా హైదరాబాద్‌ వచ్చినప్పుడు ఈఎంఈ ఆర్టిలరీ సెంటర్‌ను సందర్శించాడు. ఆ సందర్భంగా సెంటర్‌లోని టర్ఫ్‌ను ముద్దాడి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ‘ఈ ప్రదేశాన్ని నేను ఎలా మరువగలను. ఈఎంఈ గ్రౌండ్‌ నాకు గురుద్వారాతో సమానం’ అని మిల్కాసింగ్‌ అన్నాడు.


హైదరాబాద్‌ వాసిని కూడా..

‘నేను పంజాబీనే. కానీ హైదరాబాద్‌ వాసిని కూడా. నా అథ్లెటిక్‌ కెరీర్‌ హైదరాబాద్‌లోనే మొదలైంది. మిల్కాసింగ్‌గా నేను పంజాబ్‌లో జన్మించినా, అథ్లెట్‌ మిల్కాసింగ్‌ పుట్టింది హైదరాబాద్‌లోనే’ అని మిల్కాసింగ్‌ ఓ సందర్భంలో  భావోద్వేగంతో చెప్పాడు. 


(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం): మిల్కా సింగ్‌ కుటుంబం పాకిస్థాన్‌లోని ముల్తాన్‌ సమీపంలోని ఓ కుగ్రామం లో నివసించేది. వీరిది వ్యవసాయ కుటుంబం. 1929, నవంబరు 21న మిల్కా జన్మించాడు. అయితే కొంతమంది అతడి పుట్టిన ఏడాదిని 1932గానూ పేర్కొంటారు. మిల్కా బాల్యం సాధారణంగానే గడిచినా 1947లో మాత్రం కుటుంబం చిన్నాభిన్నమైంది. దేశ విభజన అల్లర్లలో తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులను కోల్పోయా డు. దీంతో ఢిల్లీకి పారిపోయి వచ్చిన మిల్కా మూడు వారాల పాటు శరణార్థులతో కలిసి ఫ్లాట్‌ఫామ్‌పైనే ఉన్నాడు. కొంతకాలం దొంగతనాలు చేసి జైలుకెళ్తే, అక్క నగలమ్మి విడిపించింది. ఆనక చిన్నా చితకా పనులు చేసుకుంటూనే ఆర్మీలో చేరాలనే కలను నాలుగో ప్రయత్నంలో నెరవేర్చుకున్నాడు. అలా 1952లో సిపాయిగా చేరిన మిల్కా మొదట శ్రీనగర్‌, ఆ తర్వాత సికింద్రాబాద్‌లో పనిచేశాడు. అక్కడే అతడి అథ్లెటిక్స్‌ జీవితానికి బీజం పడింది. 


తొలి భారతీయుడిగా..

చిన్నతనంలో పాఠశాల కోసం పది కిలోమీటర్ల దూరం నడిచివెళ్లిన అనుభవం ఉన్న మిల్కా ఆర్మీలో చేరాక సహజంగానే అథ్లెటిక్స్‌ వైపు ఆకర్షితుడయ్యాడు. పాల్గొన్న తొలి క్రాస్‌ కంట్రీ రేస్‌ (దాదాపు 10 కి.మీ)లోనే మిల్కా ఆరో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత అతడికి 400మీ. రేసులో శిక్షణ ఇవ్వడంతో దూసుకెళ్లాడు. ఈ విభాగంలో పాల్గొన్న మొదటి రేసులోనే 63 సెకన్లలో పరిగెత్తి నాలుగో స్థానంతో ఫర్వాలేదనిపించాడు. ఆ తర్వాత 1956 మెల్‌బోర్న్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించినా హీట్స్‌లో వెనుదిరిగాడు. అయితే జాతీయ క్రీడల్లో రికార్డులు కొల్లగొడుతూ ఎదురులేదనిపించుకున్నాడు. 1958లో అతడి పేరు విశ్వవ్యాప్తంగా మారుమోగింది.


ఆ ఏడాది కార్డి్‌ఫలో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో మిల్కా సింగ్‌ 400మీ. రేసును 46.6 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. దీంతో భారత్‌ తరఫున తొలి స్వర్ణం సాధించిన అథ్లెట్‌గా చరిత్రకెక్కాడు. ఈ రికార్డు 2014 వరకు కొనసాగడం మరో విశేషం. ఇక 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో మిల్కా కేవలం 0.1 సెకన్‌ తేడాతో కాంస్యాన్ని చేజార్చుకోవడం క్రీడాభిమానులను ఇప్పటికీ బాధించే విషయం. అదే ఏడాది పాక్‌ పర్యటనలో 200మీ.లలో అక్కడి చాంపియన్‌ అబ్దుల్‌ ఖాలిక్‌ను మట్టికరిపించి దేశం గర్వపడేలా చేశాడు. ఈ సందర్భంగానే అప్పటి పాక్‌ అధ్యక్షుడు అయూబ్‌ ఖాన్‌ మిల్కాను ఫ్లయింగ్‌ సిఖ్‌గా సంబోధించాడు.


మిల్కా.. మీకు ప్రత్యేక స్థానం 

మిల్కా జీ మరణంతో.. దేశం ఓ గొప్ప క్రీడాకారుడిని కోల్పోయింది. దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రతి భారతీయుడి హృదయంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. మిల్కా స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం కోట్లాది మంది హృదయాలను గెలుచుకొంది. 

                                                                            -ప్రధాని నరేంద్ర మోదీ 

 లక్ష్యం ఉన్నతంగా ఉండాలనే గొప్ప స్ఫూర్తిని దేశ ప్రజల్లో రగిలించారు. లక్ష్యాన్ని చేరుకొనేంత వరకు విశ్రమించొద్దనే సంకల్పాన్ని చాటారు.

-కోహ్లీ

మిల్కా సింగ్‌ మృతి భారత క్రీడారంగానికి శాశ్వత లోటు. దేశం వెలకట్టలేని నిధిని కోల్పోయింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా

- మంత్రి కేటీఆర్‌


అశ్రునివాళి

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు 

హాజరైన ప్రముఖులు

చండీగఢ్‌: కరోనా అనంతర సమస్యలతో శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూసిన దిగ్గజ అథ్లెట్‌ మిల్కాసింగ్‌ (91) అంత్యక్రియలు శనివారం ఇక్కడ పూర్తి అధికార లాంఛనాలతో ముగిశాయి. అతడి మృతితో దేశ అథ్లెటిక్స్‌లో ఒక శకం ముగిసిందంటూ ఫ్లయింగ్‌ సిఖ్‌కు అశ్రు నయనాలతో దేశం యావత్తు వీడ్కో లు పలికింది. తొలుత..స్థానిక సెక్టర్‌-8లోని మిల్కా ఇంట్లో ఉంచిన అతడి పార్థివదేహంపై ప్రధాని నరేంద్ర మోదీ తరపున, అలాగే ఆర్మీ తరపున పుష్పగుచ్ఛాలను ఉంచి నివాళి అర్పించారు. అనంతరం అంతిమయాత్ర ప్రారంభమైంది. పూలతో అలంకరించిన వాహనంపై మిల్కా పార్థివ దేహాన్ని ఉంచి యాత్రగా స్మశానానికి తీసుకొచ్చారు. అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్న ప్రజలు తమ అభిమాన క్రీడాకారుడిని చివరిసారి దర్శించుకున్నారు. పోలీసు బృందం గాలిలో తుపాకులు పేల్చి మిల్కాకు గౌరవ వందనం సమర్పించింది. మిల్కా కుమారుడు, ప్రముఖ గోల్ఫర్‌ జీవ్‌మిల్కా తండ్రి చితికి నిప్పంటించాడు. అంత్యక్రియల్లో మిల్కాసింగ్‌ కుమార్తె, కుటుంబ సభ్యులు, కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు సహా వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-20T08:38:58+05:30 IST