తెలం‍గాణలో క్షీర విప్లవం!

ABN , First Publish Date - 2021-04-17T06:27:32+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం గ్రామీణ ప్రధాన ఆదాయ వనరు అయిన వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చింది. సాగునీటి వసతి, రైతుబంధు లాంటి పథకాల ద్వారా తెలంగాణను దక్షిణ భారత ధాన్యాగారంగా మార్చింది...

తెలం‍గాణలో క్షీర విప్లవం!

ముఖ్యమంత్రి  కేసీఆర్  ప్రభుత్వం గ్రామీణ ప్రధాన ఆదాయ వనరు అయిన వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చింది. సాగునీటి వసతి, రైతుబంధు లాంటి పథకాల ద్వారా తెలంగాణను దక్షిణ భారత ధాన్యాగారంగా మార్చింది. స్వయంగా రైతు బిడ్డ అయిన కేసీఆర్ వ్యవసాయంతో పాటు తెలంగాణలో క్షీర విప్లవం తీసుకురావడానికి కంకణం కట్టుకున్నారు.


మనిషి పుట్టుక మొదలు చనిపోయే వరకు అన్ని దశల్లోనూ పాల వాడకం ఉంటుంది. పాలు, పాల ఆధారిత పెరుగు, వెన్న నెయ్యి, తీపి పదార్థాలు అన్నీ మనిషి మనుగడకు ప్రధానం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చింది, రైతును నెత్తికెత్తుకుంది. వ్యవసాయాధారిత పనుల్లో పంటలతో పాటు పాడి పరిశ్రమ ముఖ్యమైనదే. బర్రెలు, గొర్రెలు, మేకలు, ఆవులు లాంటి జంతువులను పెంచడం, పశువుల పెంపకం ఇందులో భాగమే. ఆహార పదార్థాలను పండించే వ్యవసాయ కార్యకలాపాలు తద్వారా లభించే ఆదాయం, జీవన భృతి గ్రామాల్లో ప్రధాన ఆదాయ వనరుగా ఉంటుంది. అటు తరువాత గ్రామాల్లోని ప్రధాన ఆదాయ వనరు పశువుల పెంపకం ద్వారా లభించే పాల ఉత్పత్తి నుంచే లభిస్తుంది.


బర్రెలు, ఆవులు పాల అవసరాలను తీర్చడంతో పాటు వ్యవసాయానికి అవసరమైన ఎద్దులు, దున్నపోతులను దేశానికి అందిస్తాయి. గొర్రెలు, మేకలు పాలు ఇవ్వడంతో పాటు మాంసాహారంగాను ఉపయోగపడే ఆదాయ మార్గాలు. వీటన్నిటి తోలు చర్మకార పరిశ్రమలో ముడి సరుకుగా ఉపయోగపడుతుంది. ఎముకలు అనేక రకాల పింగాణీ వస్తువులు తయారు చేయడానికి ఉపయోగపడుతాయి. ఇలా పశువులు, గొర్రె మేకల పెంపకం కేవలం పాల అవసరాలను తీర్చడమే కాకుండా, మాంసాహారాలను తీర్చి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అందుకే ఇవి వ్యవసాయం తరువాత ప్రధాన ఆదాయ వనరుగా గ్రామీణులకు ఉపయోగపడుతుంది. 


గ్రామీణ జీవితంలో ప్రధాన ఆదాయ వనరు, ఎంతో మందికి జీవనాధారమైన పాల ఉత్పత్తి, పాల ఉత్పత్తికి మూల కారణమైన పశువుల పెంపకం వేద కాలం నుంచే ఉన్నది. వేదాల్లో పశు పాలకుల ప్రసక్తి ఉంది. ఆ పశు పాలకులు ప్రధానంగా వేద కాలంలో వచ్చిన వర్ణ వ్యవస్థలో భాగమైన కురుమ, గొల్లలే. ఇప్పటికి యాదవులుగా చెప్పుకోబడే కురుమ గొల్లలే గొర్రెలు, మేకలు, బర్రెలు, ఆవులను పెంచేవారుగా ఉన్నారు. వాళ్ళ ప్రధాన వృత్తి పశువుల పెంపకంతో పాటు పాల ఉత్పత్తి చేయడం, గొర్రెలు, మేకల ద్వారా మాంసాన్నందించడం. పాలకు సంబంధించిన అనేక తీపి సంబంధమైన పదార్థాలు తయారుచేస్తూ బతికేవారున్నారు. మాంసం, పాలు, పెరుగు, నెయ్యి, తీపి పదార్థాలు లాంటివి సమాజానికందించే గొల్ల కురుమలు తెలంగాణాలో గణనీయమైన సంఖ్యలో ఉన్నారు.


తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రధాన ఆదాయ వనరు అయిన వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చింది. సాగునీటి వసతి, రైతుబంధు లాంటి పథకాల ద్వారా తెలంగాణను దక్షిణ భారత ధాన్యాగారంగా మార్చింది. స్వయంగా రైతు బిడ్డ అయిన కె.సి.ఆర్. వ్యవసాయంతో పాటు తెలంగాణలో క్షీర విప్లవం తీసుకురావడానికి కంకణం కట్టుకున్నారు. అందులో భాగమే పాల ఉత్పత్తిని పెంచే చర్యలు శరవేగంతో నడుస్తున్నాయి. పశువులను ఆయా కులాలవారికి అందించడం ద్వారా వాళ్ళ వృత్తి పరమైన ఆదాయాలు పెరుగుతాయి. పాల ఉత్పత్తి పెరుగుతుంది. ప్రజలకవసరమైన మాంసం ఉత్పత్తి పెరుగుతుంది. గొల్ల కురుమలకు గొర్రెలు, మేకలు, ముదిరాజులకు, బెస్తలకు చెరువులలో చేపలు వేయడం, ఇతర కులాలకు లేదా ఆయా పనులు చేసే వారికి బర్రెలు, ఆవులు, ఇవ్వడం ద్వారా వారికి బతుకుదెరువు లభిస్తుంది. శ్వేత విప్లవం విజయవంతమవుతుంది. కొందరికి కోళ్లఫారాలు, కొందరికి తీపి దుకాణాలు, ఐస్‌క్రీం పార్లర్లు ఇవ్వడం ద్వారా బతుకుదెరువుతో పాటు మాంసాహారం తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. పశువుల పెంపకాన్ని, గొర్రెలు, మేకలను ఓ పరిశ్రమగా అభివృద్ధి చేయడం వాటి పాలు, మాంసాలతో పాటు పశువుల పెంట భూములకు ఎరువుగా ఉపయోగపడుతుంది. పాలపై ప్రభుత్వం లీటరుకు నాలుగు రూపాయల ప్రోత్సాహకాన్ని ఇస్తూ పాల పరిశ్రమను ప్రోత్సహిస్తుంది. 


తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 80 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుంది. కరీంనగర్ డైరీ, ముల్కనూర్ కో- ఆపరేటివ్ సొసైటీ, హైదరాబాద్ డెయిరీ ఇతర అనేక డెయిరీల ద్వారాను, గ్రామాల్లోని బర్రెలు, ఆవుల పెంపకందార్ల ద్వారాను పాల సరఫరా జరుగుతుంది. ఈ ఉత్పత్తిని మరింత పెంచి ప్రతి మనిషి ఉపయోగించే పాల సగటును పెంచే ప్రయత్నంలో ప్రభుత్వముంది. ఐ.సి.ఎం.ఆర్. ప్రతి మనిషి రోజుకు 280 మిల్లిలీటర్ల పాలు వినియోగించాలని సిఫారసు చేసింది. తెలంగాణలో సగటు వినియోగం 350 మిల్లిలీటర్లు అయితే హైదరాబాద్‌లో పాల ఉత్పత్తిని మించి వినియోగ డిమాండ్ ఉంది. ఆ డిమాండ్‌ను తీర్చడానికి ఉత్పత్తిని మరింత పెంచాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పాల ఉత్పత్తి ఉన్నా పట్టణాల్లో ఉన్నంత వినియోగం లేదు. గ్రామీణ ప్రజలను చైతన్య పరచి ఆరోగ్యం కోసం ఎక్కువ పాలను ఉపయోగించేట్టు చూడాలి. తెలంగాణ రాష్ట్రంలో పాల వినియోగం రోజుకు 68 లక్షల లీటర్లు. ఇందులో హెచ్.ఎం.డి.ఏ. ప్రాంతంలోనే 30 లక్షల లీటర్ల వినియోగముంది. కోటి జనాభా ఉన్న మహానగరంలో ఇది సగటు పాల వినియోగం కంటే కొంచెం ఎక్కువ. పాడి రైతులకు ప్రోత్సాహకంగా తెలంగాణ ప్రభుత్వం 248 కోట్ల రూపాయలను విడుదల చేసింది. దీంతో 2.13 లక్షల మంది పాడి రైతులు లబ్ధి పొందుతున్నారు. రాష్ట్రంలో ఉన్న నాలుగు సహకార డెయిరీలను కాపాడుతూ ఉత్పత్తిని పెంచే చర్యలు చేపట్టారు.


భారతదేశ భౌగోళిక ప్రాం తంలో 3.5 శాతమున్న తెలంగాణ రాష్ట్రం జనాభాలో 2.9 శాతముంది. పశువుల, గొర్రెల జనాభా దేశ పశువులు, గొర్రెల జనాభాలో 5.5 శాతంగా ఉంది. అపారమైన పశుసంపద ఉన్న తెలంగాణలో 2.9 మిలియన్ కుటుంబాలు అంటే 29 లక్షల కుటుంబాలు తమ జీవనోపాధికి పశువుల రంగంపై ఆధారపడి ఉన్నాయి. గొర్రెల పెంపకంలో తెలంగాణ భారతదేశంలో మొదటి స్థానంలో, గేదెల పెంపకంలో 13వ స్థానంలో మేకల పెంపకంలో 10వ స్థానంలో ఉంది. అనేక జలాశయాలు, రిజర్వాయర్లు, తటాకాల ద్వారా నీటి లభ్యత ఉంది. అనేక పౌల్ట్రీ ఫామ్‌లతో తెలంగాణ గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే మూడవ స్థానంలో ఉంది. మత్స్య సంపదలోనూ ఐదవ స్థానంలో ఉంది. ఇలా వ్యవసాయాన్ని మరో దిక్కు పాడి పరిశ్రమను, పాలు, మాంసం, చేపల ఉత్పత్తిని తెలంగాణ ప్రభుత్వం విశేషంగా పెంచి వృత్తి కులాలవారికి ఎంతో ఆదెరువైంది. 


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ శ్వేత విప్లవం సాధించే దిశలో పయనిస్తుంది. పాల ఉత్పత్తిలో 30 శాతం పెరుగుదల ఈ ఐదారేళ్లలో కనపడుతుంది. సాంప్రదాయక వ్యవసాయాన్ని తగ్గించడమే కాకుండా ఆర్థిక దిగుబడినిచ్చే ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ పశు సంపదను పెంచే పనిలో తెలంగాణ ప్రభుత్వముంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి శ్వేత విప్లవం సాధించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలవల్ల సహకార డైరీలతో పాటు, మెగా డైయిరీల ఏర్పాటు ప్రక్రియల ద్వారా పాల సేకరణ పెరిగింది. ఈ చర్యల వల్ల తెలంగాణాలో పాల ఉత్పత్తి 2014-–15 లో ఉన్న 4.4 ఎం.ఎం. నుంచి 5.6 ఎం.ఎం.కు పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం పాడి పరిశ్రమ రంగానికి విశేష ప్రాధాన్యతనిస్తూ 66,403 కోట్ల విలువ కలిగిన 25.82 లక్షల కుటుంబాలకు తెలంగాణ పశువుల రంగం మద్దతు నిస్తుంది. అంగన్‌వాడీలకు, రెసిడెన్షియల్ పాఠశాలలకు, వివిధ రంగాలలో పని చేస్తున్న ప్రజలకు, గిరిజనులకు సరైనన్ని పాలు అందించే కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వము నిమగ్నమై ఉన్నది. గొర్రెలు, మేకలు, గేదెలు వివిధ కులాలకు ఇవ్వడంతో పాటు గేదెలు కొనడానికి సబ్సిడీ ఇస్తోంది. 


ఇలా తెలంగాణలో క్షీర విప్లవంతో పాటు, మాంసం ఉత్పత్తి, చేపల ఉత్పత్తి, వివిధ కులాల వారికి ఆదాయ మార్గాలు, వృత్తి పని నైపుణ్యాలు పెంచడానికి క్షీర విప్లవం సాధనలో ప్రధాన సాధనమైన గేదెలు కొనడానికి రైతుకు 50 శాతం సబ్సిడీ, ఎస్.సి., ఎస్.టి. రైతులకైతే 75 శాతం సబ్సిడీ ఇస్తోంది. ప్రభుత్వం తలపెట్టిన శ్వేత విప్లవంలో ప్రధాన పాత్ర వహించే ఉత్పత్తి దారులు ముఖ్యంగా బి.సి.లే, బి.సి. ల్లోనూ తరతరాలుగా పశువుల పెంపకం, గొర్రెలు, మేకల పెంపకం, పాల సరఫరా వృత్తి పనులు చేసేది, చేస్తున్నది ప్రధానంగా గొల్ల కురుమలే. వృత్తి కులాలందరితో పాటు గొల్ల కురుమలకు ఆదరువుగా నిలుస్తూ తెలంగాణ ప్రభుత్వం కె.సి.ఆర్. ప్రజాబంధు, గొల్ల కురుమల (యాదవ) బంధువు అవుతున్నాడు. యాదవులకు, గొర్రెల, మేకల పెంపక కేంద్రాలను, డైయిరీలను కేటాయించి గొల్ల కురుమల (యాదవ) జాతి నాదుకునే శ్రీకృష్ణుడు అవుతాడనడంలో సందేహం లేదు. 


గోసుల శ్రీనివాస్ యాదవ్ 

వ్యవస్ధాపక అధ్యక్షులు

గొల్ల కురుమ హక్కుల పోరాట సమితి

Updated Date - 2021-04-17T06:27:32+05:30 IST