పాలవెల్లువ

ABN , First Publish Date - 2020-08-02T11:09:27+05:30 IST

పాలవెల్లువ

పాలవెల్లువ

కృషి కల్యాణ్‌ అభియాన్‌ పథకానికి శ్రీకారం

మేలు జాతి పశు సంపద, అధిక పాలదిగుబడే లక్ష్యం

కృత్రిమ గర్భోత్పత్తితో దేశవాళళళీ పశువుల నుంచి మేలు జాతి పశువుల అభివృద్ధి 

జిల్లాలో 10వేల పశువులకు గర్భధారణ లక్ష్యం 

ఆగస్టు 1 నుంచి 2021 మే వరకు కార్యక్రమం అమలు 

ఐఎన్‌ఏపీహెచ్‌ పోర్టల్‌లో వివరాల నమోదు


నగర ప్రజలకు రోజుకు లక్షలాది లీటర్లలో పాలు అవసరమవుతాయి. ఆశించిన స్థాయిలో పాల  దిగుబడి లేకపోవడంతో ధరలకు రెక్కలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాల ఉత్పత్తులను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీని కోసం కృషి కల్యాణ్‌ అభియాన్‌ పథకానికి శ్రీకారం చుట్టింది. 


(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి)

మేడ్చల్‌ జిల్లా నగరానికి చేరువలో ఉండి మార్కెటింగ్‌ సౌకర్యం కూడా ఉండటంతో పాడి అభివృద్ధిని పెంచేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. అధిక పాల దిగుబడిని ఇచ్చే మేలు జాతి గేదెలు, ఆవులను కొనుగోలు చేయాలంటే ఒక్కోదానికి రూ.80వేల నుంచి రూ.లక్షకు పైగా వెచ్చించాలి. దీంతో రైతులు దేశవాళీ పశువులనే సాకుతుంటారు. అయితే లక్షల రూపాయలు వెచ్చించి పశువులను కొనాల్సిన అవసరం లేకుండా.. దేశవాళీ పశువుల జాతిని.. మేలు జాతి పశువులుగా అభివృద్ధి చేస్తూ, పాల దిగుబడిని పెంచాలనే ఉద్దేశంతో జాతీయ కృత్రి మ గర్భధారణ కార్యక్రమం అమలుకు ప్రభు త్వం శ్రీకారం చుట్టింది. కృషి కల్యాణ్‌ అభియాన్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద దేశవాళి పశువులకు అధిక పాలు ఇచ్చే మేలురకమైన సంకరజాతి పశువీర్యంతో కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా మేలు జాతిదూడలను పుట్టించడంతోపాటు పాలదిగుబడిని పెంచుకోవచ్చు. జిల్లాలో మొత్తం 15 మండలాలు ఉన్నాయి. అన్ని మండలాల్లోనూ పశువులు ఉన్న ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. జిల్లాలో మొత్తం పశువులు 86,983 ఉండగా, వీటిలో గోజాతి 27,088, గేదేజాతి 59,895 ఉన్నాయి. పాలిచ్చే పశువులు 42,161 ఉన్నాయి. 5 నుంచి 20 గేదెలు వరకు ఉన్న రైతులు జిల్లాలో 2,005 మంది ఉన్నారు. 20 నుంచి 50 వరకు ఆవులు, గేదేలు ఉన్న రైతులు 539 మంది ఉన్నారు. జిల్లాలో రోజుకు 2.52లక్షల లీటర్లు పాల దిగుబడి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 1, 2020 నుంచి మే 31వ తేదీ 2021 వరకు పశువులకు ఉచితంగా కృత్రిమ గర్భధారణ కార్యక్రమాలు చేపడుతున్నారు. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో కృషి కల్యాణ్‌ అభియాన్‌ పథకం కింద 10వేల పశువులకు కృత్రిమ గర్భధారణ చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. కృత్రిమ గర్భధారణ చేసిన ప్రతి పశువుకు గుర్తింపు నెంబర్‌(చెవిపోగు) వేయడంతోపాటు పశు జాతి, వయసు, ఎన్ని ఈతలు ఈనినది, తదితర పూర్తి వివరాలతో పాటు పశు యాజమాని వివరాలను కూడా నమోదు చేస్తున్నారు. పశువులు, రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో ఉండాలన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు ఐఎన్‌ఏపీహెచ్‌ (ఇన్‌ఫర్మేషన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ ఎనిమల్‌ ప్రొడక్టివిటీ, హెల్త్‌) పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ఆంబోతులను పోషించడం వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. సన్నకారు, చిన్నకారు రైతులు కేవలం పునరుత్పత్తి కోసం ఆంబోతులను పోషించడం సాధ్యం కాదు. పోషణ, దాణా ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. కృత్రిమ గర్భధారణ విధానం చౌకగా ఉంటుంది. 


నిర్ధారణ తరువాతే..

మంచి లక్షణాలు అధిక పాలసారున్న వాటి వీర్యాన్ని సేకరించి, వీర్యం నాణ్యతను పరీక్షించి నాణ్యమైనదిగా నిర్థారించుకున్న తర్వాతనే ఉపయోగిస్తారు. దీని వల్ల పశుజాతి అభివృద్ధి అవడంతో పాటు పాల దిగుబడి పెరుగుతుంది. సహజ సంపర్కం ద్వారా తరుచుగా సంక్రమించే గర్భకోశ వ్యాధులను నివారించవచ్చు. ఘనీకృత వీర్యం రవాణా చాలా సులభం. మారుమాల ప్రాంతాల్లో కూడా చాలా సులభంగా కృత్రిమ గర్భధారణ చేయవచ్చు. కృత్రిమ గర్భోత్పత్తి చేసే ముందు పశువుల గర్భకోశ వ్యవస్థను పశువైద్యులు పరిశిలించే అవకాశం ఉన్నందున గర్భకోశ సమస్యలు ఉన్న పశువుల్ని వెంటనే గుర్తించి, చికిత్స చేసి, పునరుత్పత్తి ప్రక్రియ మెరుగు పరిచే అవకశాలు ఉంటాయి. 


కృత్రిమ గర్భధారణతో ఎన్నో లాభాలు

కృత్రిమ గర్భధారణతో రైతులకు ఎన్నో లాభాలు ఉన్నాయి. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మేలు జాతి పశు సంపదను పెంచుకోవడంతో పాల దిగుబడి అవుతుంది. ఈ అవకాశాన్ని జిల్లాలోని పాడి రైతులంతా సద్వినియోగం చేసుకుని,  పాల దిగుబడిని పెంచుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి.   

- డాక్టర్‌ శేఖర్‌, జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి 

Updated Date - 2020-08-02T11:09:27+05:30 IST