ఉగ్రవాదిని నిలదీసి..

ABN , First Publish Date - 2022-01-26T05:30:00+05:30 IST

కశ్మిర్‌ లోయ. సాయంసంధ్య. బయట బాంబుల మోత. ఇంట్లో అమ్మ, తన ఇద్దరు చెల్లెళ్లతో బిక్కుబిక్కుమంటూ ఓ మూల తలదాచుకుంది బురుగు హిమప్రియ....

ఉగ్రవాదిని నిలదీసి..

కశ్మిర్‌ లోయ. సాయంసంధ్య. బయట బాంబుల మోత. ఇంట్లో అమ్మ, తన ఇద్దరు చెల్లెళ్లతో బిక్కుబిక్కుమంటూ ఓ మూల తలదాచుకుంది బురుగు హిమప్రియ. ఇంతలో ఇంటి తలుపు పగులగొట్టి లోపలికి వచ్చాడో ఉగ్రవాది. ఆ చిన్నారి తలపై తుపాకీ పెట్టాడు. కానీ హిమప్రియ వణికిపోలేదు. ‘ఎందుకొచ్చావ్‌’ అంటూ ధైర్యంగా అతడిని నిలదీసింది. ఆమె చూపిన తెగువకు ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్‌’ దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాటి ఘటనను ఆమె ‘నవ్య’తో పంచుకుంది. 


‘‘శ్రీకాకుళం జిల్లా పొన్నాం గ్రామం మాది. మా నాన్న బురుగు సత్యనారాయణ ఆర్మీ జవాన్‌. అమ్మ పద్మావతి గృహిణి. నాకు ఇద్దరు చెల్లెళ్లు. నాన్న ఉద్యోగరీత్యా మేం కొంతకాలం జమ్ముకశ్మీర్‌లో ఉన్నాం. అప్పుడే ఈ భయానక ఘటన జరిగింది. ఆ దృశ్యాలు ఇంకా నా కళ్లముందు కదులుతూనే ఉన్నాయి. 


అది 2018 ఫిబ్రవరి 10. సాయంత్రం ఐదు గంటలవుతుంది. ఇంట్లో నేను, అమ్మ, చెల్లెళ్లు ఉన్నాం. నాన్న డ్యూటీకి వెళ్లారు. బయట పెద్ద పెద్ద బాంబు పేలిన శబ్దాలు. భయంతో మేం తలుపులు వేసుకుని ఇంట్లో ఉండిపోయాం. ఇంతలో మా ఇంటి తలుపు బద్దలుకొట్టి ఒక ఉగ్రవాది లోపలికి వచ్చాడు. చేతిలో పెద్ద తుపాకీ. అతడిని చూడగానే మేమంతా బెడ్‌రూమ్‌లోకి వెళ్లి తలుపు వేసుకున్నాం. ఉగ్రవాది ఆ తలుపు పగులగొట్టి లోపలికి రావాలని ప్రయత్నిస్తున్నాడు. పాకిస్తానీ భాషలో పెద్దపెద్దగా అరుస్తున్నాడు. నాన్న గురించే వెతుకుతున్నాడని అనిపించింది. తలుపుకి అడ్డంగా నిలుచోవడంతో అమ్మ చేతికి తీవ్ర గాయమైంది. రక్తం కారుతోంది. బయట బాంబుల మోత కొనసాగుతూనే ఉంది. అప్పటికే చెల్లెళ్లు భయంతో సొమ్మసిల్లి పడిపోయారు. అమ్మ చేతి నుంచి రక్తం. చివరకు తలుపు బద్దలు కొట్టి, మేమున్న రూమ్‌లోకి వచ్చాడు ఉగ్రవాది. 


తలపై తుపాకీ పెట్టాడు... 

అతడు సృష్టించిన అలజడికి అపస్మారక స్థితిలోకి వెళ్లిన అమ్మ... నేలపై పడివుంది. నాకు ఏమీ అర్థంకావడంలేదు. ఏంచేయాలో తెలియడంలేదు. ఎలాగో ధైర్యం తెచ్చుకున్నాను. ‘మీరు ఎందుకు వచ్చార’ని ఉగ్రవాదిని ప్రశ్నించాను. దాంతో అతడు తుపాకీని నా తలకు గురిపెట్టాడు. కాసేపు అలాగే ఉండిపోయాను. కానీ భయపడలేదు. ఇంతలో భారత సైన్యం వచ్చింది. మా ఇంటిని చుట్టుముట్టింది. దీంతో ఉగ్రవాది పారిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న అమ్మ మీద పడి పెద్దగా ఏడ్చేశాను. తరువాత ఆ ఉగ్రవాదిని ఆర్మీ మట్టుబెట్టిందని తెలిసింది. ఆరు గంటల తరువాత జవాన్లు అమ్మను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. 


ఆ ధైర్యం నాన్న నుంచే... 

ఉగ్రవాది మా ఇంట్లో చొరబడింది మొదలు ఆరు గంటలపాటు భయానక పరిస్థితిలో మేం గడిపాం. ఆర్మీ వచ్చి, అమ్మ ప్రాణాలకు ముప్పు లేదని తెలిశాక ఊపిరి పీల్చుకున్నా. అయితే ఆ సమయంలో నేను ఎక్కడా భయపడలేదు. అప్పుడు నా వయసు ఎనిమిదేళ్లు. మూడో తరగతి చదువుతున్నా. బహుశా మా నాన్న నుంచే నాకు ఇంతటి ధైర్యం వచ్చిందేమో. తరువాత తెలిసింది... మా క్వార్టర్స్‌లో ఆర్మీ జవాన్లను హతమార్చేందుకు ఉగ్రమూకలు తుపాకులతో మెరుపు దాడి చేశారని! ఆ రోజు ఉగ్రవాదుల దాడుల్లో మా క్వార్టర్స్‌లోనే ఉంటున్న ఇద్దరు జవాన్లను, ఒక జవాను తండ్రిని కాల్చి చంపారు. 


సైనికులకు వైద్యం... 

నాన్న సైన్యంలో పనిచేస్తారని, పాకిస్తాన్‌ ఉగ్రవాదులతో ఎప్పుడూ పోరాడుతుంటారని అమ్మ చెప్పేది. ‘దేశం కోసం యుద్ధం చేస్తున్నా’నని నాన్న చెప్పేవారు. నాకు ఎంతో గొప్పగా అనిపించేది. నా సాహసానికి మెచ్చి ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్‌’ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇటీవలే జిల్లా కలెక్టర్‌ నుంచి ఆ అవార్డు అందుకున్నా. ప్రధాని మోది నుంచి ఈ పురస్కారం అందుకుంటానని భావించాను. అయితే కొవిడ్‌ కారణంగా అది కుదరలేదు. అలాగే ‘ఇండియన్‌ కౌన్సిల్‌ చిల్డ్రన్‌ వెల్ఫేర్‌’ స్వచ్ఛంద సంస్థ 2019లో ‘నేషనల్‌ బ్రేవరీ అవార్డు’, రూ.50 వేల నగదు ఇచ్చింది. ప్రస్తుతం జమ్ముకశ్మిర్‌లో ఏడో తరగతి చదువుతున్నాను. ఆర్మీ ఆసుపత్రిలో వైద్యురాలినై... నాన్నలా దేశ రక్షణకు సరిహద్దుల్లో పోరాడుతున్న భారత జవాన్లకు వైద్యం చేయాలన్నది నా లక్ష్యం. ఏదిఏమైనా ఆపద ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడితే ఎంతటి విపత్తునైనా అధిగమించవచ్చనడానికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం. 

  



ఉగ్రవాది మా ఇంట్లో చొరబడింది మొదలు ఆరు గంటలపాటు భయానక పరిస్థితిలో మేం గడిపాం. ఆర్మీ వచ్చి, అమ్మ ప్రాణాలకు ముప్పు లేదని తెలిశాక ఊపిరి పీల్చుకున్నా. 


                                                                                              మేడపల్లి వెంకట్‌, శ్రీకాకుళం 

Updated Date - 2022-01-26T05:30:00+05:30 IST