మిలిటరీ ‘నకిలీ మద్యం’ అమ్ముతున్న నలుగురి అరెస్టు

ABN , First Publish Date - 2020-10-23T10:56:49+05:30 IST

మిలిటరీ నకిలీ లేబుళ్లను మద్యం బాటిళ్లకు అంటించి అమ్ముతున్న నలుగురిని అరెస్టు చేశారు.

మిలిటరీ ‘నకిలీ మద్యం’ అమ్ముతున్న నలుగురి అరెస్టు

రూ.1.50 లక్షల విలువైన 210 బాటిళ్ల స్వాధీనం


చిత్తూరు, అక్టోబరు 22: మిలిటరీ నకిలీ లేబుళ్లను మద్యం బాటిళ్లకు అంటించి అమ్ముతున్న నలుగురిని అరెస్టు చేశారు. చిత్తూరు తాలూకా పోలీస్‌స్టేషన్‌ వద్ద డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి మీడియా కు వివరాలు తెలియజేశారు. ఎస్పీ సెంథిల్‌కుమార్‌, ఎస్‌ఈబీ ఏఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మద్యం అక్రమ రవాణా, అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. గురువారం పెనుమూరు క్రాస్‌ సమీపంలోని తిరుపతివైపుగా ఉన్న రోడ్డు పక్కన చెట్ల పొదల వద్ద అనుమానాస్పదంగా కనిపించిన మురకంబట్టుకు చెందిన చిన్ని అలియాస్‌ చంద్రశేఖర్‌, భూచక్ర, ఆంబూరుకు చెందిన శివలింగం శేఖర్‌, తిరుపత్తూరుకు చెందిన ఎం.వేలును అదుపులోకి తీసుకున్నారు. విచారించగా.. మిలిటరీ నకిలీ లేబుళ్లు మద్యం బాటిళ్లకు అంటించి అమ్ముతున్నట్లు తేలింది. దాంతో నలుగురినీ అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.1.50 లక్షల విలువైన నకిలీ మద్యం బాటిళ్లు 210 స్వాధీనం చేసుకున్నారు. వీరిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన తాలూకా సీఐ బాలయ్య, ఎస్‌ఐలు విక్రమ్‌, నాగసౌజన్య, అనిల్‌కుమార్‌, షేక్షావళి, సిబ్బంది సుధాకర్‌, రాజకుమార్‌లను డీఎస్పీ అభినందించారు. 


నకిలీ మద్యం తయారీ గ్యాంగ్‌ కోసం గాలింపు : డీఎస్పీ

నకిలీ మద్యం తయారీ గ్యాంగ్‌ కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ గ్యాంగ్‌ మన రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుల్లో కొందరిని ఎంపిక చేసుకుందన్నారు. పోలీసులు, ఎక్సైజ్‌కు దొరక్కుండా పెయింట్‌ బ్యారళ్లలో నకిలీ మద్యం బాటిళ్లను సరఫరా చేస్తోందని చెప్పారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు భారీగా గండి పడుతోందన్నారు. ఈ గ్యాంగ్‌ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు.

Updated Date - 2020-10-23T10:56:49+05:30 IST