ఉగ్రవాదుల ఘాతుకం... 50 మంది తలల నరికివేత...

ABN , First Publish Date - 2020-11-11T01:17:30+05:30 IST

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ దారుణాల్లో మరొక కిరాతకం

ఉగ్రవాదుల ఘాతుకం... 50 మంది తలల నరికివేత...

వాషింగ్టన్ : ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ దారుణాల్లో మరొక కిరాతకం చేరింది. మొజాంబిక్‌లోని కాబో డెల్గాడో ప్రావిన్స్‌లో అత్యంత పాశవికంగా నరమేధం సాగించినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం వరకు ఈ నరమేధం జరిగిందని, దాదాపు 50 మంది తలలు తెగనరకడంతోపాటు, మహిళలను అపహరించారని తెలిపింది. 


నంజబ అనే గ్రామంలోకి శుక్రవారం రాత్రి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పని చేసే ఉగ్రవాదులు ప్రవేశించి, ఇద్దరి తలలు తెగనరికి, వారి శరీరాలను కూడా ఛిద్రం చేసినట్లు స్థానికులు తెలిపారని మీడియా పేర్కొంది. ఉగ్రవాదులు ‘అల్లాహు అక్బర్’ అంటూ అరుచుకుంటూ, కాల్పులు జరుపుతూ గ్రామాల్లో ప్రవేశించినట్లు తెలిపింది. ప్రజలను చంపడంతో పాటు ఇళ్లను కూడా తగులబెట్టారని పేర్కొంది. మౌటాడి అనే గ్రామంపైకి మరికొందరు ఉగ్రవాదులు దాడి చేశారని తెలిపింది. అక్కడి ఫుట్‌బాల్ గ్రౌండ్‌లోకి 50 మందికిపైగా సామాన్య ప్రజలను తీసుకెళ్ళి, వారి తలలను తెగనరికి, వారి శరీరాలను కూడా ముక్కలుగా నరికినట్లు తెలిపింది.  


ఉగ్రవాదులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన ప్రజలను నిర్బంధించి, తెగ నరికినట్లు మీడియా పేర్కొంది. 2017 నుంచి ఇటువంటి దాడులు జరుగుతున్నాయని, ఇప్పటి వరకు సుమారు 2,000 మంది ప్రాణాలు కోల్పోయారని, దాదాపు 4 లక్షల మంది నిరాశ్రయులయ్యారని తెలిపింది. 


స్థానికులు పేదరికం, నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతుండటంతో, ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకుని, వారిని ఉగ్రవాదంలోకి చేర్చేందుకు ఇస్లామిక్ స్టేట్ ప్రయత్నిస్తోంది. ఈ ప్రాంతంలో ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోంది.


Updated Date - 2020-11-11T01:17:30+05:30 IST