షేన్‌వార్న్ ’బాల్ ఆఫ్ ది సెంచరీ’ వీడియో ఇదే.. గుర్తు చేసుకున్న మైక్ గ్యాటింగ్

ABN , First Publish Date - 2022-03-05T23:28:03+05:30 IST

బంతిని గిరిగిరా బొంగరంలా తిప్పుతూ ప్రపంచ దిగ్గజ బ్యాటర్ల గుండెల్లో గుబులు పుట్టించిన షేన్‌వార్న్ కన్నుమూసి

షేన్‌వార్న్ ’బాల్ ఆఫ్ ది సెంచరీ’ వీడియో ఇదే.. గుర్తు చేసుకున్న మైక్ గ్యాటింగ్

సిడ్నీ: బంతిని గిరిగిరా బొంగరంలా తిప్పుతూ ప్రపంచ దిగ్గజ బ్యాటర్ల గుండెల్లో గుబులు పుట్టించిన షేన్‌వార్న్ కన్నుమూసి అప్పుడే ఒకరోజు గడిచిపోయింది. కానీ అతడు మిగిల్చిన జ్ఞపకాలు మాత్రం క్రికెట్ ఉన్నంత వరకు పదిలంగా ఉంటాయి. యాషెస్ సిరీస్‌లో వార్న్ సంధించిన ఓ బంతి ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’ (ఈ శతాబ్దపు బంతి)గా ఖ్యాతికెక్కింది.


1993 యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో  వార్న్ ఈ శతాబ్దపు బంతిని సంధించాడు. ఆ బంతికి మైక్ గ్యాటింగ్ అవుటైన తీరుకు ప్రపంచమే నివ్వెర పోయింది. తానెలా అవుటయ్యానో తెలియక గ్యాటింగ్‌ అయోమయానికి గురయ్యాడు. కాసేపు క్రీజులోనే షాక్‌తో నిలబడిపోయాడు. ఆరు టెస్టుల ఆ సిరీస్‌లో వార్న్ ఏకంగా 34 వికెట్లు పడగొట్టాడు. 


2013లో ‘డెయిలీ మెయిల్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’కి 20 ఏళ్లు పూర్తయిన విషయాన్ని గ్యాటింగ్ గుర్తు చేసుకున్నాడు. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో యాషెస్‌లో అరంగేట్రం చేసిన వార్న్.. గ్యాటింగ్‌ను పూర్తిగా అయోమయంలోకి నెట్టేశాడు. లెగ్‌స్టంప్‌కు ఆవల సంధించిన బంతి అనూహ్యంగా టర్న్ తీసుకుని ఆఫ్ స్టంప్‌ను లేపేసింది. క్షణకాలంలో జరిగిన ఈ మాయాజాలానికి గ్యాటింగ్‌కు మతిపోయినంత పనైంది. మైదానంలో చూస్తున్న వారికి గానీ, టీవీల్లో మ్యాచ్‌ను వీక్షిస్తున్న వారికి కానీ ఏం జరిగిందో అర్థం కాలేదు. గ్యాటింగ్‌ అయితే కాసేపటి వరకు తేరుకోలేకపోయాడు. అందుకే ఆ బంతి ‘బాల్ ఆఫ్ ది సెంచరీ’గా రికార్డులకెక్కింది. 


‘బాల్ ఆఫ్ ది సెంచరీ’కి అవుటైన గ్యాటింగ్‌కు ఏం జరిగిందో అర్థం కాలేదని, ఇప్పటికీ అయోమయంగానే ఉందని ఆ సమయంలో కామెంటరీ బాక్స్‌లో ఉన్న ఆసీస్ మాజీ లెగ్‌ స్పిన్నర్ రిచీ బెనాడ్ పేర్కొన్నాడు. తన 23 ఏళ్ల అంపైరింగ్‌ జీవితంలో చూసిన అత్యుత్తమ బంతి ఇదేనని అప్పుడు బౌలింగ్ ఎండ్‌లో ఉన్న దిగ్గజ అంపైర్ డికీ బర్డ్ గుర్తు చేసుకున్నారు.


వార్న్ బౌలింగులో తాను అవుటైనందుకు సంతోషంగానే ఉన్నానని, తానేమీ పది టెస్టులు ఆడి 27 వికెట్లు తీసిన బౌలర్ చేతిలో అవుట్ కాలేదని ఆ ఇంటర్వ్యూలో గ్యాటింగ్ గుర్తు చేసుకున్నాడు. అలాంటి బౌలర్ అయి మాత్రం కొంత కలత చెందేవాడనని పేర్కొన్నాడు. ఆల్‌టైమ్ బెస్ట్ స్పిన్నర్ చేతిలో అవుటయ్యాను కాబట్టి దాని గురించి ఆలోంచాల్సిన పనిలేదని గ్యాటింగ్ చెప్పుకొచ్చాడు.



Updated Date - 2022-03-05T23:28:03+05:30 IST