డాలర్ల కల...కష్టాల వల

ABN , First Publish Date - 2021-10-28T05:38:15+05:30 IST

ఉపాధిని వెదుక్కుంటూ..ఖండాంతరాలు దాటి వెళుతున్న జిల్లా వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. ఏదో ఒక పని దొరికితే... కుటుంబాలు ఆర్థిక సమస్యల నుంచి బయట పడొచ్చని... ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని భావిస్తుంటే... పరిస్థితి తారుమారవుతోంది. జిల్లా నుంచి విదేశీ ఉద్యోగాలకు వెళ్తున్న వారు పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. ఉ

డాలర్ల కల...కష్టాల వల
బెహ్రయిన్‌లో కంపెనీ ఎదుట ఆందోళన చేస్తున్న బాధితులు (ఫైల్‌)


పెరుగుతున్న మోసాలు

విదేశాల్లో అష్టకష్టాలు పడుతున్న వలస జీవులు

బ్రోకర్ల బారినపడుతున్న నిరుద్యోగ యవత

పుట్టగొడుగుల్లా ఏజెన్సీలు

అక్కడకు వెళ్లాక వేతనాల్లో కోత

భోజనం, వసతి అంతంతమాత్రం

ప్రశ్నిస్తే చిత్రహింసలు

ఆందోళనలో బాధిత కుటుంబాలు

(పలాస/సంతబొమ్మాళి/వజ్రపుకొత్తూరు)

చేతినిండా ఆదాయం. విలాసవంతమైన జీవితం. సంఘంలో గౌరవం. ఆర్థిక పరపతితో కుటుంబం.... ఇదీ విదేశీ ఉద్యోగాలకు వెళ్లే యువత పరిస్థితి. కానీ ఇదంతా గతం. ఇప్పుడంతా మోసాలమయం. దేశం కాని దేశం వెళ్లిన తరువాత దుర్భర పరిస్థితులు ఎదురవుతున్నాయి. కుటుంబాలను వదలి పొట్ట చేతపట్టుకొని వెళ్తున్న వారు అర్ధాకలితో గడుపుతున్నారు. యాజమాన్యాల చేతిలో నిర్బంధాలు... చిత్రహింసలకు గురవుతున్నారు.  ఇంత జరుగుతున్నా విదేశాలకు పంపించే ఏజెన్సీలు పట్టించుకోవడం లేదు. ఏజెంట్లు పత్తా లేకుండా పోతున్నారు. కుటుంబ సభ్యుల అభ్యర్థనతో... ప్రజాప్రతినిధుల చొరవతో అతికష్టమ్మీద స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. మరవైపు ఇక్కడ ఇళ్ల వద్ద కుటుంబ సభ్యులు నిద్రాహారాలు మాని...తమ వారి కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. 

-ఉపాధిని వెదుక్కుంటూ..ఖండాంతరాలు దాటి వెళుతున్న జిల్లా వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. ఏదో ఒక పని దొరికితే... కుటుంబాలు ఆర్థిక సమస్యల నుంచి బయట పడొచ్చని... ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని భావిస్తుంటే... పరిస్థితి తారుమారవుతోంది. జిల్లా నుంచి విదేశీ ఉద్యోగాలకు వెళ్తున్న వారు పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. ఉన్నత రంగాల్లో పనులు చేయడానికి వెళ్తున్న వారు అంతంతమాత్రమే. కానీ పరిశ్రమల్లో పని చేసేందుకు మాత్రం వేలాది మంది పయనమవుతున్నారు. ఫిట్టర్‌, వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌, ఫాబ్రికేటర్‌, రాడ్‌ బెండింగ్‌ వంటి వాటిలో నైపుణ్యం ఉన్నవారికి విదేశాల్లో పుష్కలంగా ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి. ప్రధానంగా టెక్కలి డివిజన్‌లోని ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి మండలాల నుంచి విదేశాలకు వెళ్తున్న వారు అధికం. ఒక్కో గ్రామం నుంచి పదుల సంఖ్యలో యువకులు విదేశాల్లో పని చేస్తున్నారు. ఎక్కువ మొత్తంలో వేతనం లభిస్తుండడంతో ఎక్కువ మంది విదేశాల వైపే మొగ్గు చూపుతున్నారు.  

వివరాలేవీ?

వివిధ దేశాలకు ఉపాధి వెదుక్కుంటూ వెళుతున్న వారు ఎంతమంది? అక్కడ ఏఏ పరిశ్రమల్లో పని చేస్తున్నారు? ఏ ప్రాంతంలో ఉంటున్నారు? అత్యవసర పరిస్థితుల్లో ఎవరిని సంప్రదించాలి? వంటి వివరాలు మన జిల్లా యంత్రాంగం వద్ద ఉండడం లేదు. విదేశాల్లో వారికి ఇబ్బందులు తలెత్తినప్పుడు వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులకు సమస్యను వివరిస్తున్నారు. తరువాత ప్రజాప్రతినిధుల సాయంతో అతి కష్టమ్మీద స్వస్థలాలకు చేరుకుంటున్నారు.  

 గతంలో మంచి వేతనాలు

 ‘ఉండడానికి ఇల్లు. పిల్లలకు ఉన్నత చదువులు. వారి భవిష్యత్‌ కోసం  కొంత పొదుపు’...ఇవి విదేశాలకు వెళుతున్న వారి ప్రధాన లక్ష్యాలు. మొన్నటి వరకూ విదేశాల్లో ఉద్యోగం ఒక కల. కానీ ఇప్పుడు ఆ మాటంటేనే భయం. విదేశీ ఉద్యోగాల పేరిట అంతలా మోసాలు పెరిగిపోయాయి. గతంలో నైపుణ్యం చూసి సదరు కంపెనీ నేరుగా విదేశాలకు తీసుకెళ్లేది. ఆకర్షణీయమైన జీతం. మంచి వసతి అందించేవి. ఉద్యోగి ఇంటి నుంచి  బయలుదేరిన క్షణం నుంచి యోగ క్షేమాలు చూసుకునేవి. ఏడాదికి పరిమిత దినాలు సెలవు ప్రకటించేవి. రానూపోనూ విమాన చార్జీలు సైతం అందించేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడంతా దళారీ వ్యవస్థే నడుస్తోంది. మేన్‌పవర్‌ ఏజెన్సీల ప్రభావం ఎక్కువైంది. నైపుణ్యం పక్కన పెట్టి ఎక్కువ నగదు కట్టిన వారికే ప్రాధాన్యం. విమానం చార్జీలు, విసా ఖర్చుల పేరిట ముందే వసూళ్లకు దిగుతున్నారు.

 పల్లెలకే నేరుగా..

విదేశీ ఉద్యోగాల పేరిట ఇటీవల యువత మోసపోతున్నారు. ఏజెన్సీల మాయలో పడిపోతున్నారు. తొలుత విశాఖ, విజయవాడ, హైదరాబాద్‌ పట్టణాల్లో ఉండే ఈ ఏజెన్సీలు పల్లెలకు పాకాయి. కొంతమంది దళారులుగా అవతారమెత్తి యువత నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. నేరుగా గ్రామాలకు వెళ్లి నిరుద్యోగ యువతను కలుస్తున్నారు. ఆకర్షణీయమైన జీతం, మంచి వసతులు, ఓవర్‌ టైమ్‌ డ్యూటీ అంటూ నమ్మబలుకుతున్నారు. దీంతో యువత వాటిపై ఆసక్తి కనబరుస్తున్నారు. అప్పుచేసి మరీ వారికి నగదు కడుతున్నారు. తీరా మోసపోయామని తెలిసి బాధ పడుతున్నారు. విదేశాలకు వెళ్లేంతవరకూ హడావుడి చేసే ఏజెన్సీల ప్రతినిధులు అక్కడ ఇబ్బందులు తలెత్తితే ముఖం చాటేస్తున్నారు. తాము కష్టాల్లో ఉన్నామని చెప్పేందుకు ఫోన్‌ చేసినా స్పందించడం లేదు. జిల్లాలో ప్రభుత్వ ఐటీసీ (పారిశ్రామిక శిక్షణ సంస్థ)ల్లో ఫిట్టర్‌, వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌, ఫాబ్రికేటర్‌ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నా..వాటిని కాదని ఏజెన్సీలు పొడిపొడిగా వాటిలో శిక్షణనిచ్చి విదేశాలకు పంపుతున్నాయి. తీరా అక్కడికి వెళ్లాక అభ్యర్థులకు చుక్కెదురవుతోంది. తగిన నైపుణ్యం లేకపోవడంతో ముందుగా మాట్లాడిన వేతనంలో కోత విధిస్తున్నారు. సౌకర్యాలు గ్గిస్తున్నారు. అందుకే ఇటువంటి ఏజెన్సీలపై పోలీస్‌ నిఘా పెంచాలని బాధితులు కోరుతున్నారు.





Updated Date - 2021-10-28T05:38:15+05:30 IST