‘ఉక్కు’ నుంచి వలస!

ABN , First Publish Date - 2022-08-05T08:00:06+05:30 IST

‘ఉక్కు’ నుంచి వలస!

‘ఉక్కు’ నుంచి వలస!

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను వదిలివెళ్లిన 100 మందికిపైగా అధికారులు

రెండేళ్లుగా పదోన్నతులు నిల్‌

ఉద్యోగుల సంఖ్య కుదించేందుకు కుట్ర

రిక్రూట్‌మెంట్‌ కూడా నిలిపివేత

భవిష్యత్‌ ఉండదనే భయంతోనే అనుభవజ్ఞుల నిష్క్రమణ

కేంద్రం కావాలనే చేస్తోందని ఆరోపణలు

ఇప్పటికే ముడి పదార్థాల సరఫరాకు బ్రేక్‌

సంస్థకు ఆర్థిక సాయమూ బంద్‌


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను అస్మదీయులకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కావాలనే దాని విలువ తగ్గేలా నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు ముడి పదార్థాల సరఫరాకు ఆటంకం కల్పిస్తూ.. ఇంకోవైపు ఆర్థిక సాయం అందకుండా అడ్డంకులు సృష్టిస్తోంది. ఇవి చాలవన్నట్టు ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు కుట్ర చేస్తోంది. ప్రమోషన్‌ పాలసీని రద్దు చేసి రెండేళ్లుగా పదోన్నతులు నిలిపివేసింది. దాంతో ఇక్కడ పనిచేస్తే భవిష్యత్‌ ఉండదనే భయంతో గత ఏడాది కాలంలో 100 మందికి పైగా అధికారులు వేరే ఉద్యోగాలకు వెళ్లిపోయారు. ఈ వలస ఇంకా కొనసాగుతోంది. ప్రైవేటీకరణ జరిగితే ఉద్యోగాల సంఖ్య పెరుగుతుందని ఒకపక్క చెబుతున్న కేంద్రం.. మరోపక్క ఇక్కడ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియకు మోకాలడ్డుతోంది. ఏటా 200 మంది వరకు మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలను తీసుకోవడం రివాజు. ఆ విధంగానే 245 మంది మేనేజ్‌మెంట్‌ ట్రెయినీల రిక్రూట్‌మెంట్‌కు 2020లో నోటిఫికేషన్‌ ఇచ్చారు. 1,000 మందికి పైగా హాజరయ్యారు. వారిలో 750 మందికి నిరుడు ఏప్రిల్లో ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. ఏడాది దాటినా ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వలేదు. ప్లాంట్‌లో పనిచేసే 150 మంది ప్రమోషన్‌ కోసం పరీక్షకు హాజరై ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విఽధంగా ప్లాంటు నిర్వహణకు సుశిక్షితులైన ఉద్యోగుల కొరత ఏర్పడేలా కేంద్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి.


ప్రమోషన్‌ పాలసీయే రద్దు

2019లో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో జరిగిన రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఒకరు సీబీఐకి ఫిర్యాదు చేశారు. మరొకరు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు. సీబీఐ దర్యాప్తు చేసి... ఆరోపణలు నిజమేనని నిర్ధారించి 15 మందిపై చార్జిషీట్లు వేసింది. వీరిలో ఇద్దరు డైరెక్టర్లు కూడా ఉండడం గమనార్హం. ఈ కేసును సాకుగా చూపించి యాజమాన్యం పదోన్నతుల ప్రక్రియను నిలిపివేసింది. సాధారణంగా ఏ రిక్రూట్‌మెంట్‌పై ఆరోపణలు వస్తే.. దానినే ఆపుతారు. కానీ ఇక్కడ ఏటా ఇచ్చే ప్రమోషన్లను 2020 నుంచీ నిలిపివేయడం గమనార్హం. సకాలంలో ప్రమోషన్లు ఇస్తే.. ఆ తర్వాతి పదోన్నతి  కోసం వారంతా మరింత మెరుగ్గా పనిచేసి, చక్కటి పనితీరు ప్రదరిస్తారని.. అదే జాప్యం చేస్తే వారంతా నిరాశకు లోనై సరిగా పనిచేయరని, దానివల్ల సంస్థ లక్ష్యాల సాధనలో వెనకబడుతుందని, కేంద్ర ప్రభుత్వానికి కావలసింది అదే కాబట్టి.. ఆ విధంగానే ముందుకు వెళ్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి విశాఖ ఉక్కులో 1997లో అద్భుతమైన ప్రమోషన్‌ పాలసీ ప్రవేశపెట్టారు. ఇక్కడ సుదీర్ఘకాలం పనిచేసి అనుభవం సంపాదించిన అనేక మంది అధికారులు దేశంలోని ప్రతిష్ఠాత్మక కంపెనీలకు సీఎండీలుగా, చైర్మన్లుగా, డైరెక్టర్లుగా వెళ్లి వాటిని లాభాల బాటలో నడిపిస్తున్నారు. ప్రస్తుతం నాల్కో సీఎండీ చాంద్‌, ఎన్‌ఎండీసీ చైర్మన్‌ సుబిత్‌ దేబ్‌ ఇక్కడి నుంచి వెళ్లినవారే. అలాగే హిందూస్థాన్‌ షిప్‌యార్డులో ఫైనాన్స్‌ డైరెక్టర్‌ రాంబాబు, మిథానీ ఫైనాన్స్‌ డైరక్టర్‌ గౌరీశంకర్‌, స్కూటర్‌ ఇండియాలో అత్యున్నత స్థానంలో ఉన్న శ్రీనివాసరావు సైతం ఇక్కడ పనిచేసినవారే. ఈ స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తే మంచి పదోన్నతులతో పాటు ఇతర కంపెనీల్లో అత్యున్నత పదవులు లభిస్తాయని ఐఐటీలు, ఎన్‌ఐటీల నుంచి ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు వచ్చి చేరుతుంటారు. కానీ రెండేళ్లుగా కేంద్రం అమలు చేస్తున్న విధానాలు చూసి.. భవిష్యత్‌ అగమ్యగోచరంగా ఉందని భావించి వెళ్లిపోతున్నారు. 

Updated Date - 2022-08-05T08:00:06+05:30 IST