కష్టాల్లో వలస కార్మికులు!

ABN , First Publish Date - 2020-04-04T10:49:48+05:30 IST

కష్టాల్లో వలస కార్మికులు!

కష్టాల్లో వలస కార్మికులు!

తెలంగాణలో 9 లక్షల మంది

ప్రభుత్వం లెక్కల్లో 3.25 లక్షలే!

వెంటనే సాయం అవసరం

‘ఆంధ్రజ్యోతి’తో రవి కన్నగంటి

తెలంగాణలో దాదాపు 9 లక్షల మంది వలస కార్మికులు ఉన్నారని ఒక అనధికార అంచ నా. కరోనా దెబ్బతో వీరిలో కొందరు తమ స్వరాష్ట్రాలకు వెళ్లటం మొదలుపెట్టారు. మిగిలిన వారిలో అనేక మందికి సరైన రేషన్‌ దొరకక ఇబ్బందులు పడుతున్నారు. వలస కార్మికుల కోసం ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలవని.. ఇంకా చేయాల్సినది ఎంతో ఉందనేది అసంఘటిత కార్మిక రంగ విశ్లేషకుల అభిప్రాయం. లాక్‌డౌన్‌ వల్ల హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన వలస కార్మికులకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా ‘సహాయ’   సంస్థ  పేరిట సాయాన్ని అందిస్తున్నాయి. ఇందులో చురుకైన పాత్ర పోషిస్తున్న రవి కన్నగంటి వలస కార్మికుల సమస్యలను ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. 

రాష్ట్రంలో ఎంతమంది వలస కార్మికులు ఉంటారు? 

ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 3.25లక్షల మంది వలస కార్మికులు ఉన్నారు. వాస్తవానికి వీరిసంఖ్య దాదాపు 9 లక్షల దాకా ఉంటుంది. వలస కార్మికుల్లో చాలామంది దినకూలీలుగా ఇటుక బట్టీలలోను..భవన నిర్మాణ రంగంలోను.. వివిధ ఫ్యాక్టరీలలోను పనిచేస్తున్నారు. వీరికి సంబంధించిన రికార్డులు ప్రభుత్వం వద్ద లేవు. మేము 3 రోజులుగా ‘సహాయ’ అనే సంస్థ పేరిట వలస కార్మికులకు అవసరమైన బియ్యం, పప్పు దినుసు లు, ఇతర సామానులు అందిస్తున్నాం. మేము నమోదు చేసుకున్న జాబితాలోనే 22వేల మంది ఉన్నారు.

 వలస కార్మికులకు ఎదురయిన సమస్యలేమిటి?

సాధారణంగా వీరిలో ఎక్కువ మంది కాంట్రాక్ట్‌ లేబర్‌గా పనిచేస్తూ ఉంటారు. అంటే వీరిని ఒక కాంట్రాక్టర్‌ తీసుకువచ్చి ఒక ఫ్యాక్టరీలోనో.. కనస్ట్రక్షన్‌ సైట్‌లోనో పెడతాడు. లాక్‌డౌన్‌ వల్ల పనులు ఆగిపోయాయి. పని లేకపోవటం వల్ల వేతనాలు ఉండవు. అంటే వారికి ఆహారం కొనుగోలు చేయటానికి కూడా డబ్బులు ఉండవు. వీరిలో చాలా మంది ప్రభుత్వ లెక్కల్లో ఉండరు కాబట్టి వారికి  సర్కార్‌ సాయం కూడా అందదు. ఉదాహరణకు నిన్న మాకు హఫీజ్‌పేటలో ఉన్న ఒక పెద్ద భవన నిర్మాణ కంపెనీ నుంచి ఫోన్‌ వచ్చింది. ఆ సైట్‌లో 2వేల మంది పనిచేస్తున్నారు. కాంట్రాక్టర్‌ కనిపించకపోవటంవల్ల వారిలో చాలా మందికి ఆహారం కూడా లేదు. ఇలాంటి సైట్‌లు హైదరాబాద్‌లో అనేకం ఉన్నాయి. ఈ విషయాన్ని మేము మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లాం. 

ప్రభుత్వం సాయం చేస్తానని ప్రకటించింది కదా?

వలస కార్మికులకు 12 కిలోల బియ్యం, రూ.500 ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే, ఈ సాయాన్ని ఎలా అందిస్తారనే విషయంలో ఇంకా స్పష్టత  లేదు. రేషన్‌ డీలర్ల ద్వారా సరఫరా చేయటానికి  ప్రస్తుతం దుకాణాలు మూసివేసి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వలస కార్మికుల పరిస్థితిని మరో సారి సమీక్షించాల్సిన అవసరముంది. 

వలస కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లిపోవటం వల్ల లాక్‌డౌన్‌ తర్వాత హైదరాబాద్‌లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి?

లాక్‌డౌన్‌ ఎప్పుడు పూర్తిగా ఎత్తివేస్తారో తెలియదు. పైగా ఒకసారి వెళ్లిన కార్మికులు మళ్లీ తిరిగి వస్తారని కచ్చితంగా చెప్పలేం. ఉదాహరణకు 2రోజుల క్రితం శ్రీకాకుళానికి చెందిన 185 మంది ఆదివాసీలు 4 బృందాలుగా  హైదరాబాద్‌ నుంచి నడుచుకుంటూ బయలుదేరారు. వారికి అవసరమైన సాయాన్ని దారి పొడుగునా అందిస్తూ వచ్చాం. బహుశా రేపు వారు తమ స్వస్థలాలకు చేరుకోవచ్చు. ఇంత కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నవారు మళ్లీ ఎలా తిరిగి వస్తారు? ఒకవేళ వచ్చినా వారికి ఉపాధి దొరుకుతుందా? లాక్‌డౌన్‌ తర్వాత స్థానిక పరిశ్రమలు ఎన్ని మూతబడతాయి? లాంటి అనేక ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం. 

వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి దీర్ఘ చర్యలు తీసుకోవాలి?

ముందుగా వలస కార్మికుల వివరాలను నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత వారికి యాజమాన్యాలు సరైన సదుపాయాలు కల్పించేలా చూడాలి. వాస్తవానికి ఇవన్నీ చట్టాల్లో ఉన్నవే! కానీ ఎవరూ పాటించరు. కార్మిక శాఖ కూడా చూసీ చూడనట్లు వదిలేస్తూ ఉంటుంది. 

Updated Date - 2020-04-04T10:49:48+05:30 IST