ఆకలిదప్పుల నడక

ABN , First Publish Date - 2020-03-29T09:36:15+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా రోడ్ల మీద వాహనాలు, జనాలు కనిపించకపోయినా.. నెత్తిమీద మూటలు, చేతుల్లో సంచులు, చంకన బిడ్డలను ఎత్తుకొని మండుటెండలో నడుచుకుంటూ చాలామంది

ఆకలిదప్పుల నడక

వేల కిలోమీటర్లు నడుస్తున్న వలస కార్మికులు

మండుటెండల్లో పిల్లలతో కలిసి సొంతూర్లకు పయనం

హరియాణ, రాజస్థాన్‌కు నడుస్తున్న ఆ రాష్ట్రాల కూలీలు

మధ్యప్రదేశ్‌కు సైకిళ్లపై ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులు

ముంబై నుంచి వస్తూ కర్ణాటకలో ఇరుక్కున్న కార్మికులు

ముంబైలో చిక్కుకుపోయిన మంచిర్యాల జిల్లా కూలీలు

వలస కార్మికుల దుస్థితికి కేంద్రమే కారణం 

పరిస్థితి చేజారకముందే చర్యలు చేపట్టండి: రాహుల్‌ 

ఢిల్లీలోని కార్మికులకు తిండి, వసతి ఏర్పాట్లు: కేజ్రీవాల్‌

వలస కార్మికుల కోసం హైవేల పక్కన శిబిరాలు

29వేల కోట్ల ఎన్డీఆర్‌ఎఫ్‌ నిధులు వాడుకోండి

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అమిత్‌ షా ఆదేశం

కార్మికుల కోసం టోల్‌ సిబ్బంది ఆహారం, తాగునీరు: గడ్కరీ


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా రోడ్ల మీద వాహనాలు, జనాలు కనిపించకపోయినా.. నెత్తిమీద మూటలు, చేతుల్లో సంచులు, చంకన బిడ్డలను ఎత్తుకొని మండుటెండలో నడుచుకుంటూ చాలామంది వెళుతున్నారు. తమ ఆకలిని చంపుకుంటూ.. ఆకలవుతోందని చంకనున్న పిల్లలు ఏడుస్తుంటే నీళ్లతోనే వారి కడుపు నింపుతూ నెత్తినెత్తుకున్న మూటలు దించకుండా సాగుతున్న వారి నడక ఎప్పుడు గమ్యం చేరేనో గానీ చూసేవారికి కన్నీళ్లు తెప్పిస్తోంది. వీరంతా వలస కార్మికులు, కూలీలు! పనుల కోసం వేల కిలోమీటర్ల దూరం నుంచి రాష్ట్రానికొచ్చి లాక్‌డౌన్‌ కారణంగా ఇరుక్కుపోయారు. సొంత ప్రాంతాలకు కంటైనర్‌లో వెళుతున్న హరియాణ, రాజస్థాన్‌కు చెందిన 120 మంది కూలీలను మెదక్‌జిల్లా తూప్రాన్‌ టోల్‌ప్లాజా వద్ద అడ్డుకున్నారు. ఇప్పుడు వీరంతా కాలినడకనే స్వస్థలాలకు వెళుతున్నారు.  రామగుండం ఎన్టీపీసీలో కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన 15మంది కూలీలు సైకిళ్లపై 640కిలోమీటర్ల దూరంలోని సొంతూళ్లకు బయలుదేరారు.


ముంబై నుంచి ఓ వెయ్యి మంది వలస కార్మికులు ప్రైవేటు వాహనాల్లో బయలుదేరగా కర్ణాటక సరిహద్దులోని గుల్బర్గా జిల్లా కాజూర్‌లో పోలీసులు అడ్డుకున్నారు. వీరంతా నారాయణపేట జిల్లా వాసులు. సొంత గ్రామాలకు తమను వెళ్లనివ్వడం లేదని, తామిప్పుడు ఏంచేయాలని వారు ప్రశ్నిస్తున్నారు.  ఉపాధి కోసం నిర్మల్‌ జిల్లా కడెం, దస్తూరాబాద్‌, ఖానాపూర్‌, పెంబి, మంచిర్యాల జిల్లా జన్నారం మండలానికి చెందిన ప్రజలు ముంబైకి వెళ్లారు. లాక్‌డౌన్‌తో అక్కడే చిక్కుకుపోయి ఆకలితో అలమటిస్తున్నారు. మామిడి తోటల్లో పనిచేసేందుకు మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చిన  85మంది కూలీలకు జగిత్యాల జిల్లా చల్‌గల్‌లో స్వచ్ఛంద సంస్థలు భోజన ఏర్పాట్లు చేశాయి. యాదాద్రి జిల్లాలో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒడిసా కూలీలకు దాతల సాయంతో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ భోజన వసతి కల్పించారు.


రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం పెద్దగోల్కొండ ఔటర్‌రింగ్‌ రోడ్డుపై శుక్రవారం అర్ధరాత్రి బొలేరోను లారీ బలంగా ఢీకొట్టడంతో వాహనంలో ప్రయాణిస్తున్న 30మందిలో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. మధ్యప్రదేశ్‌ చెందిన కూలీలకు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ సాయం అందించారు. ఆ రాష్ట్రానికి చెందిన 60మంది కూలీలు, హైదరాబాద్‌ నానకరాంగూడలో చిక్కుకుపోయారు. వారికి వంటసామగ్రి, బియ్యం, పప్పు, చింతపండు వంటనూనెను లక్ష్మణ్‌ అందజేశారు. 


వలస బతుకులు ఛిద్రం

ఎలాగైనా సొంత ప్రాంతాలకు చేరుకోవాలనే తపనతో కాలినడకన వెళుతున్న కార్మికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రాజస్థాన్‌ నుంచి ముంబైకి  వెళుతున్న వలస కార్మికులపైకి ఓ టెంపో దూసుకెళ్లింది శనివారం తెల్లవారుజామున 3గంటలకు మహారాష్ట్రలోని పాల్గర్‌ జిల్లాలో ఈ  ఘోరం జరిగింది. ముగ్గురు కార్మికులు దుర్మరణంపాలయ్యారు. ఒక కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. మహారాష్ట్రలోని థానే నుంచి రాజస్థాన్‌కు ట్యాంకర్‌లో వెళుతున్న 10మంది వలస కార్మికులను పాల్గర్‌లో పోలీసులు పట్టుకున్నారు. 


మా విమానాలు వాడుకోండి

 వేలమంది వలస కార్మికులను తమ విమానాల్లో వారి   ప్రాంతాలకు తరలించేందుకు గోఎయిర్‌ సంస్థ ముందుకొచ్చింది. పిల్లలతో వెళుతూ ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా వారిని  సొంత ప్రాంతానికి దగ్గర్లో గల ఎయిర్‌పోర్టులో దిగబెట్టుందుకు  వాయుసేనకు అనుమతి కోరుతూ లేఖ రాసినట్లు సంస్థ పేర్కొంది. 


యూపీలో 527 వంటశాలలు

లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయిన వారి ఆకలి తీర్చేందుకు యూపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 527 సామూహిక వంటశాలలను ఏర్పాటు చేసింది. వలస కార్మికులను సరిహద్దులను దాటిచేందుకు యోగి సర్కారు 1000 బస్సులను ఏర్పాటు చేసింది.  లాక్‌డౌన్‌తో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారడంతో అడవుల్లోని జంతువులు రోడ్ల మీదకొస్తున్నాయి. కేరళలోని కోజికోడ్‌ ప్రాంతంలో 250 దాకా పునుగుపిల్లులు రోడ్ల మీదకొచ్చాయి.  


కరోనాతో కాదు.. ఆకలితో చచ్చేట్లున్నాం 

ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ ప్రాంతంలో ప్రభుత్వం నిర్వహించే సత్రం వద్ద నిత్యం వేల సంఖ్యలో కూలీలు, బిచ్చగాళ్లు భోజనం చేస్తారు. లాక్‌డౌన్‌తో దీన్ని మూసివేయడంతో అన్నార్తులు ఆకలి కేకలు పెడుతున్నారు. శుక్రవారం అక్కడ 5వేల మంది భోజనం పెడతారేమోనని వచ్చారు. మూసివేసి ఉండటంతో నిరాశగా వెనుదిగారు. ‘కరోనా వైర్‌సతో చస్తామోలేదో గానీ ముందు ఆకలితో పోయేటట్టున్నాం’ అని రాంపాల్‌ అనే రిక్షా కార్మికుడు వాపోయాడు. ఈ స్థితిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలస కార్మికులుకు ఆహారం అందిచకపోతే దేశవ్యాప్తంగా ఆకలి దాడులు చోటుచేసుకునే ప్రమాదం ఉందని స్టాటిస్టిషియన్‌ మాజీ చీఫ్‌ ప్రణబ్‌ సేన్‌ హెచ్చరించారు. లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా వలస కార్మికులు ఎదుర్కొంటున్న దుస్థితికి ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్‌ విమర్శించింది. వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పరిస్థితి చేజారకముందే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. 


తక్షణమే శిబిరాలు..  

న్యూఢిల్లీ: వలస కార్మికులను ఆదుకోవాలని కేంద్రం నిర్ణయించింది. వారి కోసం తక్షణమే అన్ని సౌకర్యాలతో కూడిన శిబిరాలను హైవేల పక్కన ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. దేశంలో దాదాపు 10వేల మంది వలస కార్మికులు నడుచుకుంటూ స్వస్థలాలకు వెళుతున్నట్లు అంచనా వేసింది.  వారందనీ ఆదుకుంటామని హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ బృందానికి (ఎన్డీఆర్‌ఎఫ్‌) సంబంధిచిన రూ. 29వేల కోట్ల నిధులను వలస కార్మికులకు ఆహారం, వసతుల కోసం ఖర్చు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించారు. వలస కార్మికుల కోసం శిబిరాలు ఏర్పాటుపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హోంశాఖ కార్యదర్శి లేఖ రాశారు.


రాష్ట్ర విపత్తుల సహాయ నిధిని, ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన నిధులను వాడుకోవాలని లేఖలో పేర్కొన్నారు. శిబిరాల్లో సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని, కార్మికుల కోసం వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. వలసదార్లకు శిబిరాల ఏర్పాటు తెలిసేలా  ప్రచారం చేయాలని పేర్కొన్నారు. వలస దార్ల కోసం ఆహారం, మంచినీళ్లను ఏర్పాటు చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌కు, టోల్‌ సిబ్బందికి రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఆదేశించారు. ఢిల్లీలోని వలస కార్మికులు రాష్ట్రం దాటి పోవొద్దని.. అందరికీ ఆహారం, వసతి కల్పిస్తామని సీఎం కేజ్రీవాల్‌ భరోసా ఇచ్చారు.  


Updated Date - 2020-03-29T09:36:15+05:30 IST