వలస కూలీ... టాపర్‌ అయ్యింది!

ABN , First Publish Date - 2020-03-09T06:42:26+05:30 IST

పొట్ట చేతపట్టుకొని బీహార్‌ నుంచి కేరళకు వలస వచ్చిన కుటుంబం ఆమెది. ఊరే కాదు అక్కడి భాష కూడా ఆమెకు కొత్తే.

వలస కూలీ... టాపర్‌ అయ్యింది!

పొట్ట చేతపట్టుకొని బీహార్‌ నుంచి కేరళకు వలస వచ్చిన కుటుంబం ఆమెది. ఊరే కాదు అక్కడి భాష కూడా ఆమెకు కొత్తే. ఊరు కాని ఊరిలో కూలీ పనికోసం ఆమె భర్త, ఆమె నానా తిప్పలే పడ్డారు. అలాంటిది ఇప్పుడు ఆమె మలయాళంలో చక్కగా మాట్లాడడమే కాదు రాయడమూ నేర్చుకుంది. తాజాగా కేరళ ప్రభుత్వం లిటరసీ మిషన్‌ నిర్వహించిన ఎగ్జామ్‌లో వందకు వంద మార్కులు సాధించి టాపర్‌గా నిలిచి వార్తల్లోకెక్కింది రోమియా కథూర్‌. 


ఆరేళ్ల క్రితం ఉపాధి వెతుక్కుంటూ కేరళ వచ్చిన రోమియా ఆమె భర్త సైఫ్‌ ఉల్లాహ్‌ కొల్లామ్‌ జిల్లాలోని ఉమయనల్లూర్‌లో స్థిరపడ్డారు. మొదట్లో మలయాళం భాష అర్థం కాక చాలా ఇబ్బందులు పడ్డారు. వచ్చీరానీ భాషలో మాట్లాడుతూ ఆమె భర్త కూలీ పనుల కోసం అడ్డా మీద నిల్చొనేవాడు. ముగ్గురు పిల్లల ఆలానాపాలనా చూసుకుంటూనే రోమియ ఇంటిపట్టున జ్యూస్‌ బండి నడపడం మొదలెట్టింది. అలా సాగిపోతున్న ఆమె జీవితంలో మలయాళం నేర్చుకునే అవకాశం అనుకోకుండానే వచ్చింది. 


ప్రభుత్వ ప్రాజెక్ట్‌ సాయంతో

ఇతర రాష్ట్రాల నుంచి కేరళకు వచ్చి స్థిరపడిన వలస కార్మికులకు మలయాళం నేర్పించాలనే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం ‘ఛంగతి ప్రాజెక్ట్‌’ చేపడుతోంది. మలయాళం, హిందీ రెండూ వచ్చిన వారిని ఎంపిక చేసి వారితో పాఠాలు చెప్పించేవారు. స్కూళ్లు, గ్రంథాలయాలలో తరగతులు నిర్వహించేవారు. 10 నుంచి 12  మంది కార్మికులను బృందంగా చేసి వారంలో ఒకరోజు అయిదు గంటలు మలయాళీ పాఠాలు చెప్పేవారు. అందరికీ సులభంగా అర్థమయ్యేలా పరిశుభ్రత, ఆరోగ్యం, సాంకేతికత, కార్మికుల హక్కులు వంటి విషయాలు సంభాషణ రూపంలో 25 పాఠాలున్న ‘హమారీ మలయాళం’ పుస్తకాన్ని ఉచితంగా అందించేవారు. మలయాళం రాక ఇబ్బంది పడుతున్న రోమియ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంది. ఏదో అవసరం కోసం అని కాకుండా మలయాళం భాష మీద పట్టు సాధించాలనుకుంది. వారు చెప్పే పాఠాల్ని మనసుపెట్టి వినేది. అలా మలయాళంలో ఓనమాలతో మొదలై అక్షరాలు రాయగలిగే స్థాయికి చేరింది. అక్కడితో ఆగకుండా కేరళ విద్యాశాఖ నిర్వహించే సెకండరీ లిటరసీ ఎగ్జామ్‌లో పాసవ్వాలనే లక్ష్యంతో చదివింది. 


ఈ ఏడాది జనవరిలో 19న ఛంగతీ రెండో ఫేజ్‌ పరీక్షకు నాలుగు నెలల బిడ్డను చంకనెత్తుకొని హాజరయింది రోమియ. 1,998 మంది వలస కార్మికులు హాజరైన ఈ పరీక్షలో నూటికి నూరు మార్కులు సాధించింది. దాంతో లిటరసీ మిషన్‌ డైరెక్టర్‌ పీఎ్‌స.శ్రీకళ స్వయంగా రోమియ ఇంటికి వచ్చి మరీ ఆమెను అభినందించారు. ఇదే ఉత్సాహంతో హయ్యర్‌ సెకండరీ ఎగ్జామ్‌ పాసవ్వాలనే ఆలోచనలో ఉన్న రోమియకు మిషన్‌ డైరెక్టర్‌ పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ‘‘ఛాగతి సభ్యులు అందజేసిన ‘హమారీ మలయాళం’ పుస్తకం నాకు ఎంతో ఉపయోగపడింది. ఈ పుస్తకం చదివడంతో రైల్వేస్టేషన్‌, మార్కెట్‌... ఎక్కడకు వెళ్లినా మలయాళంలో సులువుగా మాట్లాడేదాన్ని. నాలా నా పిల్లలకు భాష పరంగా ఇబ్బంది పడకుండా వారికీ మలయాళం నేర్పించాలనుకుంటున్నా’’ 

అన్నారు రోమియ.



Updated Date - 2020-03-09T06:42:26+05:30 IST