మధ్య తరగతి లేఅవుట్‌?

ABN , First Publish Date - 2022-01-23T06:02:09+05:30 IST

ఎండాడలో దశాబ్దం కిందట ‘రాజీవ్‌ స్వగృహ’ కోసం కేటాయించిన స్థలంలో ప్రస్తుతం లేఅవుట్‌ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి.

మధ్య తరగతి లేఅవుట్‌?

ఎండాడలో రాజీవ్‌ స్వగృహ కోసం కేటాయించిన భూమిలో ఎంఐజీ, హెచ్‌ఐజీ ప్లాట్లు వేయాలని ప్రభుత్వం నిర్ణయం

నివాసాలతో పాటు వాణిజ్యానికీ కేటాయింపు

అక్కడ గజం రూ.70,000

200 గజాలు సుమారు రూ.1.4 కోట్లు...

ఆ రేటుకు సామాన్యులు కొనే అవకాశమే లేదు

మార్చి నాటికి లేఅవుట్‌ సిద్ధం చేయాలని నిర్ణయం

అనుమతుల కోసం వీఎంఆర్‌డీఏకు దరఖాస్తు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


ఎండాడలో దశాబ్దం కిందట ‘రాజీవ్‌ స్వగృహ’ కోసం కేటాయించిన స్థలంలో ప్రస్తుతం లేఅవుట్‌ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఇక్కడ మధ్య తరగతి ప్రజలకు హెచ్‌ఐజీ, ఎల్‌ఐజీ ప్లాట్లు (స్థలాలు) ఇవ్వాలనేది తమ ఆలోచనగా ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు శుక్రవారం అమరావతిలో భేటీ అయిన మంత్రివర్గం కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 

ప్రభుత్వం 2007లో రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌కు భూమి కేటాయించగా, అప్పుడు 14 అంతస్థుల్లో 888 ఫ్లాట్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు. ఆ సమయంలో కొండపైకి రూ.20 కోట్లతో అప్రోచ్‌ రోడ్డు నిర్మించారు. ఆ తరువాత ప్రాజెక్టు మూలకు చేరడంతో భూమిలో కొంత ఆక్రమణలకు గురైంది. ఎండాడ సర్వే నంబరు 16లో 57.16 ఎకరాలు కేటాయించగా, చుట్టుపక్కలున్న ప్రైవేటు సంస్థలు కొంత భూమిని ఆక్రమించడంతో విస్తీర్ణం 47.62 ఎకరాలకు తగ్గిపోయింది. అంటే సుమారు పది ఎకరాలు అన్యాక్రాంతమైంది. 


కొత్త లేఅవుట్‌ కోసం వీఎంఆర్‌డీఏకు దరఖాస్తు

ఆర్థిక వనరుల కోసం ఆరు నెలల క్రితం విశాఖపట్నంలో విలువైన భూముల కోసం అన్వేషిస్తున్న సమయంలో ఇది  ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ప్రజల గృహ నిర్మాణాలకు కేటాయించిన భూమి కావడంతో ఆ అవసరాలకే వినియోగించాలని నిర్ణయించింది. అయితే రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ వద్ద నిధులు లేకపోవడంతో మౌలిక వసతులు కల్పించే బాధ్యతను పంచాయతీరాజ్‌ శాఖలో ఆరోగ్య విభాగానికి అప్పగించింది. వారు గత రెండు నెలలుగా పనులు చేస్తున్నారు.  లేఅవుట్‌లో రోడ్లు, కాలువలు, మంచినీటి సదుపాయం వంటి వాటి కోసం రూ.9.6 కోట్లతో పనులు చేపడుతున్నారు. మార్చి నెలాఖరు నాటికి ఈ పనులు పూర్తవుతాయంటున్నారు. మరోవైపు రాజీవ్‌ స్వగృహ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు లేఅవుట్‌ ప్లాన్‌ అనుమతి కోసం వీఎంఆర్‌డీఏకు దరఖాస్తు చేశారు. అయితే అప్పట్లో ఇక్కడ ఫ్లాట్ల నిర్మాణానికి పనులు చేపట్టినా, అధికారులు భూ వినియోగ మార్పిడికి అనుమతులు తీసుకోలేదు. దాంతో వీఎంఆర్‌డీఏ భూ వినియోగ మార్పిడికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈలోగా అదే వీఎంఆర్‌డీఏ కొత్తగా రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌లో ఎండాడలో ఈ ప్రాంతమంతా రెసిడెన్షియల్‌ జోన్‌లోకి రావడంతో భూ వినియోగ మార్పిడి అవసరం లేకుండా పోయింది. అయినా వీఎంఆర్‌డీఏ ఇంకా లేఅవుట్‌కు అనుమతి ఇవ్వలేదు. ఫీజుల నుంచి స్వగృహ అధికారులు మినహాయింపు కోరారు. ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చుకోవాలని సూచించారు. అలాగే లేఅవుట్‌లో కొన్ని ప్లాట్లను నిబంధనల ప్రకారం తనఖా పెట్టాలి. ఆ ప్లాట్ల వివరాలు కూడా దరఖాస్తులో పేర్కొనలేదు. వీటన్నింటినీ తెలియజేసి, వాటికి సంబంధించిన పత్రాలు సమర్పించాలని వీఎంఆర్‌డీఏ సూచించింది. ఈ లాంఛనాలన్నీ పూర్తయ్యాకే వీఎంఆర్‌డీఏ లేఅవుట్‌కు అనుమతి ఇస్తుంది. అప్పుడే వాటిని విక్రయించడానికి వీలవుతుంది.


వాణిజ్యానికీ కేటాయింపు

ప్రస్తుతం ఈ కొండపై 47.62 ఎకరాల స్థలం మిగిలింది. అందులో రహదారులు, కాలువలు, సామాజిక అవసరాలకు కేటాయింపులు పోను మిగిలిన స్థలంలో ప్లాట్లు వేయాల్సి ఉంది. ఇక్కడ కేవలం నివాసాలకే కాకుండా వాణిజ్య అవసరాలకు కూడా ప్లాట్లు కేటాయిస్తున్నట్టు స్వగృహ అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ఒక్కొక్కటి వేయి చ.గజాల విస్తీర్ణం గల ప్లాట్లను లేఅవుట్‌లో చూపించారు. వాటి  కంటే ఎక్కువ విస్తీర్ణంలో వాణిజ్య అవసరాలకు మార్కింగ్‌ చేసినట్టు సమాచారం. ప్లాన్‌ అప్రూవ్‌ అయితే తప్ప ఎంత విస్తీర్ణంలో హెచ్‌ఐజీ, ఎంఐజీ ప్లాట్లను వేశారో చెప్పలేమని అంటున్నారు.


అవి పెద్దలకేనా..?

ఎండాడలో భూముల ధరలు చాలా అధికంగా ఉన్నాయి. ఇది ప్రధాన రహదారిని ఆనుకొని ఉంది. కాబట్టి అధిక ధర పలుకుతుంది. ప్రస్తుతం అక్కడ గజం రూ.70 వేల వరకు ఉంది. ఆ లెక్కన ఇక్కడ వేయి చ.గ. ప్లాటు కొనాలంటే.. రూ.7 కోట్లు ఉండాలి. హెచ్‌ఐజీ (హై ఇన్‌కం గ్రూపు) అంటే కనీసం 400 గజాలు ఉంటుంది. అంటే రూ.3 కోట్లు వెచ్చించాలి. ఎంఐజీ (మిడిల్‌ ఇన్‌కమ్‌ గ్రూపు) అంటే 200 గజాల వరకు ఉంటుంది. దానికి రూ.1.5 కోట్లు అవుతుంది. పైగా వీటిని దరఖాస్తులు ఆహ్వానించి లాటరీ పద్ధతిలో కేటాయిస్తారా?, వేలం నిర్వహించి ఎవరు ఎక్కువకు పాడుకుంటే వారికి అమ్ముతారా? అనేది ఇంకా నిర్ణయించలేదు. ముందు పనులు పూర్తయితే ఆ తరువాత జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. ఏదేమైనా మధ్య తరగతి ప్రజల కోసం ఉద్దేశించిన ఈ స్థలం ఇప్పుడు ఉన్నత వర్గాల చేతుల్లోకి వెళ్లిపోతున్నదనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ద్వారా వెయ్యి కోట్లకు పైగా ఆదాయం ఆశిస్తోంది. అంతకంటే ఎక్కువే వస్తుందని అధికార వర్గాల సమాచారం.



Updated Date - 2022-01-23T06:02:09+05:30 IST