మొదట్లో ఆ పాత్రపై అంత ఆసక్తి చూపించలేదు!

ABN , First Publish Date - 2020-11-29T06:37:35+05:30 IST

తండ్రి పాత్రలు వేసి ఒప్పించటం అంత సులభం కాదు. అనేక భావోద్వేగాలను ప్రదర్శిస్తూ- ఇతర పాత్రలతో పోటీ పడుతూ- చూడటానికి సహజంగా కనిపించాలి. అలాంటి ఒక పాత్ర మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌లోని కొండలరావు. కొడుకు మీద అపారమైన ప్రేమ ఉన్నా దానిని బయటకు చూపించని మిడిల్‌ క్లాస్‌ తండ్రి పాత్ర...

మొదట్లో ఆ పాత్రపై అంత ఆసక్తి చూపించలేదు!

తండ్రి పాత్రలు వేసి ఒప్పించటం అంత సులభం కాదు. అనేక భావోద్వేగాలను ప్రదర్శిస్తూ- ఇతర పాత్రలతో పోటీ పడుతూ- చూడటానికి సహజంగా కనిపించాలి. అలాంటి ఒక పాత్ర మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌లోని కొండలరావు. కొడుకు మీద అపారమైన ప్రేమ ఉన్నా దానిని బయటకు చూపించని మిడిల్‌ క్లాస్‌ తండ్రి పాత్ర అది. ఈ పాత్ర పోషించి గోపరాజు రమణ పుట్టిల్లు రంగస్థలం. ‘‘ నా నాటకం చూసే నాకీ అవకాశం ఇచ్చారు.. మొదట్లో ఈ పాత్రపై పెద్ద ఆసక్తి చూపించలేదు’’  అనే రమణను నవ్య పలకరించినప్పుడు ఆయన చెప్పిన కబుర్లివి..


ఈ సినిమా సక్సెస్‌ను ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారు?

చాలా కాలంగా నాటకాల్లో నటిస్తున్నా. టెలివిజన్‌ సీరియల్స్‌లోను, సినిమాల్లో కూడా పనిచేశా. ‘ఓ పనై పోతుంది బాబూ’ నా తొలి సినిమా. ఆ తర్వాత 15 సినిమాల్లో నటించాను. ఇంద్రగంటి మోహనకృష్ణగారి దర్శకత్వంలో మూడు సినిమాలు చేశా. గ్రహణంలో మంచి పేరు వచ్చింది. కానీ గుర్తింపు రాలేదు. ఈ మధ్య మంచి నాటకం వస్తే తప్ప నటించకూడదనుకున్నా. ఇక రిలాక్స్‌ అవుదామనుకున్న సమయంలో దర్శకుడు వినోద్‌గారు కొండలరావు పాత్ర ఇచ్చారు. ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ పాత్ర తర్వాత ఎనిమిది ఆఫర్లు వచ్చాయి. 


అసలు ఆ పాత్ర మీకు ఎలా దక్కింది?

చాలా మందికి తెలియని ఒక విషయం చెబుతా. మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ నాటకాలు వేస్తూనే ఉన్నారు. నాకు కూడా నాటకం ద్వారానే ఈ అవకాశం వచ్చింది. రవీంద్రభారతిలో నేను ప్రదర్శిస్తున్న ఓ నాటకాన్ని ఈ చిత్ర ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత అన్నే రవి చూసి- దర్శకుడు వినోద్‌కు చెప్పారు. తెనాలికి సమీపంలో కొలకలూరు మా స్వగ్రామం. అక్కడ నాటక పరిషత్‌లో పోటీలు జరుగుతుంటే వినోద్‌ అక్కడకు వచ్చారు. మూడు రోజులు అక్కడే ఉండి- నాటకాలు చూశారు. ఆ విషయం నాకు తర్వాత తెలిసింది. కొలకలూరు ఆయనకు ఎంత నచ్చిదంటే- సినిమా కూడా అక్కడే తియ్యాలని ఫిక్స్‌ అయ్యారు. హైదరాబాద్‌కు తిరిగి వెళ్లిన తర్వాత- నాకు కబురు చేశారు. ‘మేం ఓ సినిమా అనుకుంటున్నాం. అందులో ఓ పాత్ర మీకు ఇవ్వాలని ఫిక్స్‌ అయ్యాం’ అంటే చాలా ఆశ్చర్యపోయా! అక్కడ కూడా చిన్న ఇబ్బంది వచ్చింది. అప్పటికి నేను రెండు టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నా. సడన్‌గా డేట్స్‌ కావాలంటే ఇబ్బంది అయింది. నా పరిస్థితిని టీవీ నిర్మాతల దగ్గరకు వెళ్లి వివరిస్తే సహకరించారు. అలా నాకు కొండలరావు పాత్ర దక్కింది. ఆనందకరమైన ఇంకో విషయమేమిటంటే- నాతో పాటు మరి కొంత రంగస్థల నటులకు కూడా ఈ సినిమాలో అవకాశం వచ్చింది. 


సినీ పరిశ్రమ నుంచి రెస్పాన్స్‌ ఎలా ఉంది?

చాలా మంది దర్శకులు ఫోన్లు చేసి అభినందించారు. మంచి భవిష్యత్తు ఉందని అభినందించారు. పైన చెప్పినట్లు ఎనిమిది సినిమాలకు ఆఫర్లు వచ్చాయి. ఈ క్రెడిట్‌ అంతా నిర్మాత ఆనంద ప్రసాద్‌గారికి.. దర్శకుడు వినోద్‌కు దక్కుతుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఒకప్పుడు తెలుగు సినిమాల్లోకి రంగస్థలం నుంచే నటులు వచ్చేవారు. నూతన్‌ప్రసాద్‌, రాళ్లపల్లి, ఎల్బీ శ్రీరామ్‌, తనికెళ్ల భరణి- ఇలా అనేక మంది నటులకు పుట్టినిల్లు రంగస్థలమే! అయితే ఈ మధ్య కాలంలో రంగస్థల నటులకు సినిమాల్లో అవకాశాలు తక్కువగానే లభిస్తున్నాయి. నాటక ప్రదర్శనలు ఎక్కువ లేకపోవటం కూడా ఒక కారణం కావచ్చు. ఈ సమయంలో- రంగ స్థలం నుంచి వచ్చిన నాకు ఒక ప్రధాన పాత్ర రావటం.. దానికి మంచి పేరు రావటం చాలా మంచి పరిణామం. రంగస్థలానికి చెందిన అనేక మంది నటులు ఫోన్‌ చేసి అభినందిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. 


ఈ సినిమాలో మీకు నచ్చిన సన్నివేశమేది?

కొడుకు బాంబే చట్నీని రుచిగా చేయటానికి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. మావిడి కాయతో చట్నీ చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చి చేయటం మొదలుపెడతాడు. ఆ సమయంలో తల్లి..తండ్రి.. కొడుకు దగ్గరకు వస్తారు. వాళ్లను చూసి- అతను వారిద్దరినీ కూర్చోబెట్టి దోశ, చట్నీ వడ్డిస్తాడు. వాళ్లు తింటుంటే- లోపలి నుంచి వారి హాహభావాలు చూస్తూ ఉంటాడు. తండ్రికి కొడుకు చేసిన చట్నీ నచ్చుతుంది. కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పడు. అలాగని బావులేదని కూడా అనడు.  ‘కష్టాలు అన్నాక  వస్తుంటాయి, పోతుంటాయి. మన పనులు మనం నిజాయితీగా చెయ్యాలి’ అంటాడు. ఆ సందర్భంలో తన భావోద్వేగాలను నియంత్రించుకొనే తండ్రి పాత్ర పోషించటం ఒక ఛాలెంజ్‌. ఈ సీన్‌ నాకే కాదు. చాలా మందికి నచ్చింది. 

- వినాయకరావు


Updated Date - 2020-11-29T06:37:35+05:30 IST