Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 08 Dec 2021 08:00:26 IST

బడి బువ్వ వండేదెలా!?

twitter-iconwatsapp-iconfb-icon
బడి బువ్వ వండేదెలా!?

మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు మూడు నెలలుగా బిల్లులు చెల్లించని ప్రభుత్వం

సరుకులు కొనుగోలు చేసేందుకు అప్పులపాలు

మార్కెట్‌లో కూరలు, నూనెల ధరల పెరుగుదల

అందుకు అనుగుణంగా పెరగని ప్రభుత్వ ధరలు

కార్మికుల వేతనమూ 3 నెలలుగా పెండింగ్‌

సమ్మె బాటలో భోజన పథకం నిర్వాహకులు


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): వారు.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్నం పూట భోజనం వండి పెడతారు. పాఠశాలల్లో ఉండే అరకొర సౌకర్యాలు, ప్రభుత్వం ఇచ్చే చాలీచాలని నిధులతోనే పిల్లల కడుపు నింపుతున్నారు. నామమాత్రపు వేతనంతోనే ఇలా ఏళ్ల తరబడి సేవలందిస్తున్న మధ్యాహ్న భోజన నిర్వాహకులు.. ఇప్పుడు తామే అప్పులపాలై పస్తులుండాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఓవైపు ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు నెలల తరబడి పేరుకుపోవడం, మరోవైపు కూరగాయలు, నూనె, గుడ్లు, గ్యాస్‌ వంటి వాటి ధరలు భారీగా పెరిగిపోవడంతో ఈ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు. పలు జిల్లాల్లో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఆందోళన బాట పడుతున్నారు. ఇప్పటికే నిజామాబాద్‌, సిరిసిల్ల, పెద్దపల్లిజిల్లాల్లో కార్మికులు ఆందోళనకు దిగడంతో ఉపాధ్యాయులు వంట చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రభుత్వం 3 నెలలుగా బిల్లులు చెల్లించడంలేదు. దీంతో రూ.100 కోట్లకు పైగా పెండింగ్‌ బిల్లులు పేరుకుపోయాయి. వంట కార్మికులకు కూడా మూడు నెలలుగా వేతనాలు చెల్లిచండంలేదు. సాధారణంగా ప్రతినెలా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులను సంబంధిత పాఠశాల ప్రాధానోపాధ్యాయుడు ఎంఈవోకు సమర్పిస్తే.. అక్కడినుంచి నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం నుంచి గ్రాంటు విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో పథకం నిర్వాహకులకు బిల్లులు అందడం లేదు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా.. 

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం.. 1-5వ తరగతి వరకు ప్రతి విద్యార్థికి రోజుకు రూ.4.97 ఇస్తారు. 6-10 తరగతుల విద్యార్థులకు రూ.7.45 చెల్లిస్తున్నారు. వీటితోనే పథకం నిర్వాహకులు.. గ్యాస్‌, కట్టెలు, పప్పు, కూరగాయలు, నూనె, ఉప్పు వంటి సమస్త వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. బియ్యాన్ని మాత్రం పౌరసరఫరాల శాఖ నుంచి సరఫరా చేస్తున్నారు. ఈ ధరలను ప్రతి ఏడాది ఏప్రిల్‌లో 7.5 శాతం చొప్పున పెంచుతూ వస్తున్నారు. అయితే.. ఈ పెంపుదల వాస్తవ ధరలకు అనుగుణంగా ఉండడంలేదని కార్మికులు చెబుతున్నారు. ఉదాహరణకు.. మార్కెట్‌లో టమోటా ధర కిలో రూ.60-70, ఆలుగడ్డ కిలో రూ.40 వరకు ఉన్నాయి. నూనెలు, పప్పులు, కారం వంటి అన్ని వస్తువుల ధరల పెరిగిపోతున్నాయి. పప్పులో ఏదో ఒక ఆకుకూరను కలిపి వండాల్సి ఉంది. ప్రస్తుతం ఆకుకూరల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయని కార్మికులు చెబుతున్నారు. ఇవే కాకుండా.. విద్యార్థులకు వారానికి మూడుసార్లు గుడ్లు వండి పెట్టాలని ప్రభుత్వం చెబుతోంది. గుడ్ల కోసం మెనూలో రూ.12 నిర్ణయించింది. అయితే.. ప్రస్తుతం బయటి మార్కెట్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.6 ఉంది. దాంతో ప్రభుత్వం ఇచ్చే నిధులతో రెండు గుడ్లను మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గుడ్ల విషయంలో నిర్వాహకులపై భారం పడుతోంది. 


మూడు నెలలుగా రాని బిల్లులు..

రాష్ట్రంలో 25 వేలకు పైగా ప్రభుత్వ బడుల్లో 85 వేల మంది మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి 2009లో రూ.1000 వేతనాన్ని నిర్ణయించారు. వీరితోపాటు వంట కార్మికులకు నెలకు ఇచ్చే రూ.1000 కూడా మూడు నెలలుగా ఇవ్వడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2020 ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన వేతనం కూడా చెల్లించలేదు. సరుకులు కొనేందుకు నిర్వాహకులు అప్పులు చేయాల్సివస్తోంది. ఇవి రూ.లక్షలకు చేరి, భారంగా మారడంతో వారు ఆందోళనకు దిగుతున్నారు. పలు జిల్లాల్లో కలెక్టరేట్‌ల ఎదుట, జిల్లా విద్యాశాఖ కార్యాలయాల ఎదుట కార్మికులు ధర్నాలు చేశారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో తాము సమ్మెకు దిగుతామంటూ ఈ నెల 1న నోటీసు ఇచ్చారు. వంట చేయడం నిలిపివేశారు.  కాగా, సమ్మెలో భాగంగా కార్మికులు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు. 


వేతనాలు, ధరలు పెంచాలి

ఎప్పుడో నిర్ణయించిన ధరల కారణంగా కార్మికులు నష్టపోతున్నారు. రెండు గుడ్లకు నిధులిచ్చి, విద్యార్థులకు మూడు గుడ్లు అందించాలని ఒత్తిడి చేస్తున్నారు. మార్కెట్‌లో సరుకుల ధరలు భారీగా పెరిగినా.. ప్రభుత్వం చెల్లించే ధరలు మాత్రం పెరగడం లేదు. బిల్లులు కూడా బకాయి ఉండడంతో కార్మికులు అప్పుల పాలవుతున్నారు. ధరలు పెంచడంతో పాటు, బిల్లులను వెనువెంటనే చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

- ఎస్‌.రమ, మధ్యాహ్న భోజన పథకం కార్మిక యూనియన్‌ ప్రధాన కార్యదర్శి

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

జాతీయం Latest News in Teluguమరిన్ని...

క్రీడాజ్యోతిLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.