మధ్యాహ్నం భోజనం ఆలస్యం.. బిస్కెట్లు పంచిన టీచర్లు

ABN , First Publish Date - 2022-07-06T07:04:03+05:30 IST

రెండు నెలల తర్వాత తమ పాఠశాలకు వెళ్లిన విద్యార్థులకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. పాఠశాల తెరిచిన మొదటి రోజే విద్యార్థులు ఆకలితో ఇబ్బందిపడ్డారు.

మధ్యాహ్నం భోజనం ఆలస్యం..  బిస్కెట్లు పంచిన టీచర్లు
గండేపల్లిలోని ఓ పాఠశాలలో ఆలస్యంగా వచ్చిన భోజనాలు వడ్డిస్తున్న దృశ్యం

గండేపల్లి, జూలై 5 : రెండు నెలల తర్వాత తమ పాఠశాలకు వెళ్లిన విద్యార్థులకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. పాఠశాల తెరిచిన మొదటి రోజే విద్యార్థులు ఆకలితో ఇబ్బందిపడ్డారు. గండేపల్లి మండలంలోని పలు పాఠశాలల్లో భోజనాలు ఆలస్యంగా రావడం, గండేపల్లిలో ఉన్న గండేపల్లి హైస్కూల్‌కు అల్లూరి సీతారామరాజు ఎడ్యుకేషన్‌ సొసైటీ బెండపూడి నుంచి మధ్యాహ్నం 12.30కు రావాల్సిన భోజనాలు రెండున్నరకు రావడంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. దీంతో హైస్కూల్‌ ఉపాధ్యాయులు భోజనం కోసం ఎదురుచూసి విద్యార్థుల ఆకలి గమనించి బిస్కెట్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు. దీంతో విద్యార్థులు బిస్కెట్లు తిని మంచినీటితో తమ ఆకలిని కొంత తీర్చుకున్నారు. మధ్యాహ్నం రెండున్నరకు వచ్చిన భోజనాన్ని విద్యార్థులకు ఉపాధ్యాయులు వడ్డించారు. అదేకాకుండా పాఠశాల ఆవరణ వర్షపునీటితో చెరువులా మారింది. దీంతో పిల్లల తరగతుల గదులు కూడా చెమ్మదనంతో నిండి ఉంది. గండేపల్లి మెయిన్‌ స్కూల్‌ విద్యార్థులకు 12 గంటలకు అందాల్సిన భోజనం అరగంట లేటుగా వచ్చింది. మెనూ సరిగా అందించకుండా నామమాత్రపు భోజనాలు పెట్టారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తే మొదటిరోజు కావడంతో ఆలస్యమైందని చెప్పారు. గండేపల్లి మెయిన్‌ స్కూల్లో చుట్టూ అపారిశుధ్యంగా మారింది. కాగా మధ్యాహ్న భోజనం ఎందుకు ఆలస్యమైందనే దానిపై ఎడ్యుకేషన్‌ సొసైటీని అడిగి తెలుసుకుంటామని, ఇక ఆలస్యంగా రాకుండా చర్యలు తీసుకుంటామని ఎంఈవో నాయక్‌ వివరణ ఇచ్చారు. ఇదిలా ఉండగా పాఠశాలలు తెరుచుకున్న తొలిరోజే కావడం, దానికి తోడు వర్షం పడడంతో పాఠశాలలకు 40 శాతం మాత్రమే విద్యార్థులు హాజరైనట్టు విద్యాశాఖాధికారులు తెలిపారు.



Updated Date - 2022-07-06T07:04:03+05:30 IST