అత్యంత ఆకర్షణీయ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ ఇండియా

ABN , First Publish Date - 2020-07-29T06:00:03+05:30 IST

దేశంలో ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయమైన కంపెనీల జాబితాలో మైక్రోసాఫ్ట్‌ ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. సామ్‌సంగ్‌ ఇండియా, అమెజాన్‌ ఇండియా వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి...

అత్యంత ఆకర్షణీయ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ ఇండియా

రాండ్‌స్టాడ్‌ సర్వే వెల్లడి 


దేశంలో ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయమైన కంపెనీల జాబితాలో మైక్రోసాఫ్ట్‌ ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. సామ్‌సంగ్‌ ఇండియా, అమెజాన్‌ ఇండియా వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. ఈ ఏడాదికి గాను విడుదలైన రాండ్‌స్టాడ్‌ ఎంప్లాయర్‌ బ్రాండ్‌ రీసెర్చ్‌ (ఆర్‌ఈబీఆర్‌) సర్వే నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఆర్థిక పరిపుష్టి, మార్కెట్లో పరపతి, ఆధునిక సాంకేతికతల వినియోగం వంటి అంశాల్లో మైక్రోసాఫ్ట్‌ ఇండియాకు గరిష్ఠ మార్కులు లభించాయని రాండ్‌స్టాడ్‌ రిపోర్టు పేర్కొంది. మరిన్ని ముఖ్యాంశాలు.. 


వృత్తి-వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోగలిగే కంపెనీలో పనిచేసేందుకే ఉద్యోగులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 43 శాతం మంది ఇదే విషయాన్ని వెల్లడించారు. తర్వాత ప్రాధాన్యాల్లో ఆకర్షణీయమైన జీతం (41 శాతం), ఉద్యోగ భద్రత (40 శాతం) ఉన్నాయి. 


కంపెనీ కారు లేదా ఫోన్‌, చైల్డ్‌కేర్‌ సర్వీసెస్‌ అండ్‌ సపోర్ట్‌, అనుగుణమైన పని గంటలు కూడా ముఖ్యమేనని సర్వేలో పాల్గొన్న 81 శాతం మంది వెల్లడించారు. 


18-24 ఏళ్ల వయసు (జనరేషన్‌ జెడ్‌) వారిలో 38 శాతం మంది తమ యాజమాన్యం నుంచి మెరుగైన నైపుణ్య శిక్షణ అవకాశాలను ఆశిస్తున్నారు. 


25-34 ఏళ్ల వయసు (జనరేషన్‌ వై)వారిలో 34 శాతం మంది ముందు చూపు ఉన్న, ఆధునిక టెక్నాలజీ వినియోగ కంపెనీల్లో పనిచేసేందుకు ఆసక్తి చూపారు.

 

35-54 ఏళ్ల వయసు (జనరేషన్‌ ఎక్స్‌) వారిలో 46 శాతం మంది వృత్తి-వ్యక్తిగత జీవిత సమతుల్యానికి పెద్దపీట వేశారు. 


55-64 ఏళ్ల వయసున్న వారిలో 32 శాతం మంది తాము పని చేయబోయే కంపెనీ తమకు సౌలభ్యంగా ఉండే ప్రాంతంలో ఉండాలని కోరుకుంటున్నారు. 


మన దేశంలో ఉద్యోగులు ఐటీ, ఐటీఈఎస్‌, టెలికాం, ఆటోమోటివ్‌, ఎఫ్‌ఎంసీజీ, రిటైల్‌, ఈ-కామర్స్‌, బీఎ్‌ఫఎ్‌సఐ రంగాల్లో పనిచేసేందుకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. 


అంతర్జాతీయ మానవ వనరుల (హెచ్‌ఆర్‌) సేవల కన్సల్టింగ్‌ కంపెనీ రాండ్‌స్టాడ్‌.. ఈ సర్వే కోసం 33 దేశాల్లోని 6,136 కంపెనీలపై 1,85,000 మంది (18-65 ఏళ్ల వయసు వారు) నుంచి సేకరించిన అభిప్రాయాలు సేకరించింది.


టాప్‌-10 ఆకర్షణీయ కంపెనీలు 


1. మైక్రోసాఫ్ట్‌ ఇండియా 

2. సామ్‌సంగ్‌ ఇండియా 

3. అమెజాన్‌ ఇండియా 

4. ఇన్ఫోసిస్‌ 5. మెర్సిడెజ్‌ బెంజ్‌ 

6. సోనీ 7. ఐబీఎం 

8. డెల్‌ టెక్నాలజీస్‌

9. ఐటీసీ గ్రూప్‌ 

10. టీసీఎస్‌ 


ఉద్యోగుల్లో పెరిగిన భద్రతాభావం 

భారత ఉద్యోగులు తమ ఉద్యోగ భద్రత విషయంలో గతంలో కంటే ఆశావహంగా ఉన్నారని లింక్డ్‌ఇన్‌ తాజా సర్వే వెల్లడించింది. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుతో గత నెల నుంచి వ్యాపారాలు నెమ్మదిగా తెరుచుకుంటుడటంతో పాటు ఈ-కామర్స్‌, ఐటీ, బీమా, గేమింగ్‌ తదితర రంగాల్లో ఉద్యోగావకాశాలు మెరుగవడం ఇందుకు దోహదపడిందని నివేదికలో పేర్కొంది. జూన్‌ 1-14 మధ్య కాలానికి లింక్డ్‌ఇన్‌ ఉద్యోగుల విశ్వాస సూచీ స్కోర్‌ 48గా నమోదైంది. జూన్‌ 15-28 మధ్య కాలానికి స్కోర్‌ 50కి మెరుగుపడింది. 

Updated Date - 2020-07-29T06:00:03+05:30 IST