టిక్‌టాక్, మైక్రోసాఫ్ట్‌కు షాకిచ్చిన ట్రంప్...!

ABN , First Publish Date - 2020-08-02T18:49:14+05:30 IST

టిక్‌టాక్‌ను నిషేధించే యోచనలో ఉన్నాం. అయితే ఈ విషయంలో మాముందు మరి కొన్ని ప్రత్యామన్నాయాలు కూడా ఉన్నాయి ఇది ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్య

టిక్‌టాక్, మైక్రోసాఫ్ట్‌కు షాకిచ్చిన ట్రంప్...!

వాషింగ్టన్: ‘టిక్‌టాక్‌ను నిషేధించే యోచనలో ఉన్నాం. అయితే ఈ విషయంలో మాముందు మరి కొన్ని ప్రత్యామన్నాయాలు కూడా ఉన్నాయి..’ ఇదీ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్య. దీంతో టిక్‌టాక్‌పై నిషేధం ఉండకపోవచ్చనే ఆశలు అమెరికాలో చిగురించాయి. ఈ నేపథ్యంలోనే.. టిక్‌టాక్‌కు చెందిన అమెరికా కార్యకలాపాలను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ ఆసక్తి వ్యక్తం చేసింది. ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటూ ట్రంప్ ఇచ్చిన ఉత్సాహం నడుమ రెండు సంస్థలూ చర్చలు ప్రారంభించాయి.


ఈ చర్చల్లో అమెరికా అధికారులూ పాల్గొన్నారు. సోమవారం నాటికి డీల్ పక్కా అని కొన్ని వర్గాలు వ్యాఖ్యానించాయి కూడా.  టిక్‌టాక్ లాభాలు తెస్తున్న సంస్థ కావడంతో ఈ డీల్‌పై మైక్రోసాఫ్ట్ ఆసక్తి కనబరుస్తోంది. అమెరికా సంస్థ అయిన మైక్రోసాఫ్ట్ ఆధీనంలో టీక్‌టాక్ వెళితే..అమెరికా ప్రభుత్వం టిక్‌టాక్‌ను నిషేధించే అవకాశమూ ఉండదు. సో.. ఈ డీల్ రెండు సంస్థలకూ లాభదాయకమే. 


కానీ ఇంతలో ఊహించని షాక్..! ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చిన ట్రంప్ ఆకస్మాత్తుగా..టిక్‌టాక్‌ను నిషేధించడమే సబబంటూ పూర్తి యూటర్స్ తీసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ సంచలన కథనం ప్రచురించింది. దీంతో మైక్రోసాఫ్ట్, టిక్‌టాక్‌లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి. ఇక చేయగలిగిందేం లేదు కాబట్టి..మైక్రోసాఫ్ట్ టిక్‌టాక్‌తో చర్చలకు ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పెట్టింది.


అయితే ట్రంప్ నిర్ణయం నేపథ్యంలో టిక్‌టాక్ కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికాలో సుదీర్ఘ కాలం పాటు కార్యకలాపాలు నిర్వహిస్తామని టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాల జనరల్ మేనేజర్ వెనెస్సా పాపాస్ ట్విటర్ ద్వారా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. వచ్చే మూడెళ్లలో అమెరికన్ల కోసం మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తామని కూడా ఆమె చెప్పారు. ‘సమాచార భద్రత పరంగా చూస్తే.. అత్యంత సురక్షితమైన యాప్‌ను మేము రూపొందిస్తున్నాం. ఇదే సరైన కార్యాచరణ కూడా. ఇక్కడ సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతాం. టిక్‌టాక్ మీ అందరి అభిప్రాయాలకూ గొంతుకనిస్తోంది. కాబట్టి మనందరం టిక్‌టాక్‌కు మద్దతుగా నిలవాలి’ అని ఆమె ట్వీట్ చేశారు. దీంతో అమెరికాలో టిక్‌టాక్ భవితవ్యంపై మరోసారి క్వశ్చన్ మార్కు వచ్చి పడింది.  

Updated Date - 2020-08-02T18:49:14+05:30 IST