కొవిడ్‌తో నగదు నిల్వలు ఆవిరి

ABN , First Publish Date - 2020-08-10T05:56:07+05:30 IST

కొవిడ్‌-19 అనంతర రికవరీపై సూక్ష్మ తరహా (మైక్రో) పరిశ్రమలు అశావహంగానే ఉన్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా అంతరాయాలు ఏర్పడినప్పటికీ తిరిగి కోలుకోగలమన్న ఆశాభావం 81 శాతం మంది వ్యక్తం చేశారు...

కొవిడ్‌తో నగదు నిల్వలు ఆవిరి

  • మైక్రో పరిశ్రమల ఆవేదన


న్యూఢిల్లీ: కొవిడ్‌-19 అనంతర రికవరీపై సూక్ష్మ తరహా (మైక్రో) పరిశ్రమలు అశావహంగానే ఉన్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా అంతరాయాలు ఏర్పడినప్పటికీ తిరిగి కోలుకోగలమన్న ఆశాభావం 81 శాతం మంది వ్యక్తం చేశారు. అయితే నగదు నిల్వలు పూర్తిగా అంతరించిపోయాయని, మనుగడ కూడా ప్రశ్నార్ధకంగానే ఉన్నదని 57 శాతం మంది అన్నారు. క్రియా విశ్వవిద్యాలయానికి చెందిన లీడ్‌ సహకారంతో గ్లోబల్‌ అలయన్స్‌ ఫర్‌ మాస్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ (గేమ్‌) నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి.


1500 మైక్రో సంస్థలను సర్వే చేయగా 40 శాతం మంది వ్యయాల కోసం రుణాలకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపాయి. కాని కేవలం 14 శాతం మందికి మాత్రమే వ్యవస్థీకృత రుణ సంస్థల నుంచి రుణాలు అందుతున్నాయి. కొవిడ్‌-19 భారత ఆర్థిక వ్యవస్థ పైన ప్రత్యేకించి మైక్రో పరిశ్రమల పైన కోలుకోలేని ప్రభావం చూపిందని గేమ్‌ సహ వ్యవస్థాపకుడు మదన్‌ పడకి అన్నారు. మైక్రో పరిశ్రమల యజమానుల్లో పురుషుల కన్నా మహిళలు అధిక సంఖ్యలో గృహ సంబంధిత సవాళ్లు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ఈ తరహా సవాలును ఎదుర్కొంటున్నట్టు చెప్పిన పురుషుల సంఖ్య 53 శాతం ఉండగా మహిళలు 70 శాతం ఉన్నారు. ఖర్చులు భరించలేనివిగా ఉన్నాయని చెప్పిన వారిలో కూడా పురుషుల కన్నా మహిళలే అధికంగా ఉన్నారు. 


Updated Date - 2020-08-10T05:56:07+05:30 IST