Oct 27 2021 @ 18:35PM

రూ.15 కోట్లు నష్టం.. హీరో శింబుపై నిర్మాత ఫిర్యాదు

ప్రముఖ హీరో శింబుపై సినీ నిర్మాత మైఖేల్‌ రాయప్పన్‌ చెన్నై నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. శింబు వల్ల తనకు రూ.15 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఇదే విషయంపై ఆయన నగర పోలీసు కమిషనర్‌కు మూడు పేజీల ఫిర్యాదును సమర్పించారు. ఇందులో శింబు వల్ల ఆయన ఏ విధంగా నష్టపోయారో వివరించారు. 

‘‘గత 2016లో శింబు హీరోగా ‘అన్బానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌’ అనే చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్‌ చేశాం. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకుడు. కానీ, ఒప్పందం ప్రకారం శింబు ఈ చిత్రంలో నటించలేదు. సినిమా షూటింగ్‌ 50 శాతం పూర్తి చేసిన నేపథ్యంలో సినిమాను రిలీజ్‌ చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఒకవేళ నష్టం వస్తే మరో చిత్రంలో నటిస్తానని మాటిచ్చారు. ఆయన మాటలు నమ్మి చిత్రాన్ని విడుదల చేశాను. కానీ, ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. దీంతో రూ.15 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. ఇందులో రూ.12 కోట్లు పంపిణీదారులకు అందజేయాల్సి ఉంది. ఇదే అంశంపై నిర్మాతల సంఘానికి ఫిర్యాదు చేశాను. ఆ సమయంలో హీరో విశాల్‌ అధ్యక్షుడుగా ఉన్నారు. ఆ సమయంలో జరిగిన చర్చల్లో మరో చిత్రంలో నటించేందుకు శింబు సమ్మతించారు. నిర్మాతల మండలి నిర్వాహకులు మారిపోయిన తర్వాత శింబు కూడా మాట తప్పారు. దీంతో మరోమారు నిర్మాతల మండలి, యాక్టివ్‌ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశాను. ఇదే విషయంపై శింబు తల్లి ఉషా రాజేందర్‌ వద్ద సంప్రదించాను. కానీ, ఆమె కట్ట పంచాయతీలు చేస్తున్నట్టు ఫిర్యాదు చేశారు. ఇందుకు ఆమె భర్త హీరో టి.రాజేందర్‌ కూడా వత్తాసు పలుకుతున్నారు. తమను మోసం చేసిన శింబు, ఉషా రాజేందర్‌, టి.రాజేందర్‌పై తగిన చర్యలు తీసుకోవాలి’ అని నిర్మాత మైఖేల్‌ రాయప్పన్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.