పోలింగ్ బూత్ వద్ద ట్రంప్ మాస్క్ ధరించినందుకు.. పోలీసు అధికారిని..

ABN , First Publish Date - 2020-10-21T15:59:10+05:30 IST

అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు నవంబర్ మూడో తేదీన జరగనున్నాయి. నవంబర్ మూడో తేదీన ఓటు వేయలేని

పోలింగ్ బూత్ వద్ద ట్రంప్ మాస్క్ ధరించినందుకు.. పోలీసు అధికారిని..

మియామి, ఫ్లోరిడా: అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు నవంబర్ మూడో తేదీన జరగనున్నాయి. నవంబర్ మూడో తేదీన ఓటు వేయలేని వారి కోసం ఎర్లీ ఓటింగ్(ఎన్నికల రోజు కంటే ముందుగానే ఓటు వేయడం) ఇప్పటికే ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఓటర్లు ఎర్లీ ఓటింగ్‌ను వినియోగించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఫ్లోరిడాలోని మియామిలో ఓటింగ్ జరిగే ప్రదేశంలో యూనిఫామ్‌లో ఉన్న ఓ పోలీసు అధికారి ట్రంప్ మాస్క్‌ను ధరించాడు. ఓటర్లను బెదిరించేందుకే పోలీసు అధికారి ఇలా ట్రంప్ మాస్క్‌ను ధరించాడంటూ మియామి-డేడ్ కౌంటీ డెమొక్రటిక్ చైర్మన్ స్టీవ్ ట్వీట్ చేశారు. 


ఈ అంశంపై మియామి మేయర్ ఫ్రాన్సిస్ సూరెజ్ మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. పోలీసు అధికారి ఓటు వేసేందుకు వెళ్లాడని, అయితే అధికారి ట్రంప్ మాస్క్ పెట్టుకోవడం డిపార్ట్‌మెంట్ నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆయన చెప్పారు. రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థిని ప్రమోట్ చేసినట్టు ఉండటంతో పోలీసు అధికారి సస్పెన్షన్‌కు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. పోలీసు అధికారులు యూనిఫామ్ ధరించి పొలిటికల్ స్టేట్‌మెంట్లు, నాయకులకు అనుగుణంగా ప్రవర్తించడం సరైన పద్దతి కాదన్నారు. యూనిఫామ్ వేసుకుని ఓటు వేయడం తప్పుకాదని.. కానీ రాజకీయ నాయకుడికి సంబంధించిన మాస్క్ ధరించడం తప్పు అని మేయర్ ఫ్రాన్సిస్ సూరెజ్ అన్నారు. 


ట్రంప్ మాస్క్‌తో ఉన్న అధికారి ఓటు వేసేందుకు కాకుండా అక్కడ విధులు నిర్వర్తిస్తూ ఉండుంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదని చెప్పారు. మరోపక్క అధికారి చేసింది ఆమోదయోగ్యంగా లేదని మియామి పోలీస్ చీఫ్ జార్జ్ కొలినా ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. కాగా.. ట్రంప్ మాస్క్ ధరించిన పోలీసు అధికారి సస్పెన్షన్‌కు గురయ్యారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-10-21T15:59:10+05:30 IST