2 లక్షల ల్యాప్‌టాప్‌లను సిద్దం చేసిన విద్యాశాఖాధికారులు.. అమెరికాలో..

ABN , First Publish Date - 2020-03-15T07:14:14+05:30 IST

కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం వణికిపోతోంది. ఏ దేశంలో చూసినా కరోనానే హాట్ టాపిక్ అయిపోయింది. ప్రజలు కనీసం బయటకు రావాలన్నా

2 లక్షల ల్యాప్‌టాప్‌లను సిద్దం చేసిన విద్యాశాఖాధికారులు.. అమెరికాలో..

మియామి, ఫ్లోరిడా: కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం వణికిపోతోంది. ఏ దేశంలో చూసినా కరోనానే హాట్ టాపిక్ అయిపోయింది. ప్రజలు కనీసం బయటకు రావాలన్నా భయపడే విధంగా ఈ కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కారణంగా 5 వేలకు పైగా చనిపోయారు. కరోనా కేంద్ర స్థానమైన చైనాలోనే 3 వేలకు పైగా మృతిచెందారు. ఆ తరువాత అత్యధికంగా ఇరాన్, ఇటలీలలో 800కు పైగా మరణించారు. కరోనా లక్షణాలతో వచ్చే రోగులతో ఆస్పత్రులు మొత్తం నిండిపోతున్నాయి. ఎక్కడికక్కడ ప్రయాణాలపై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. పాఠశాలలు, కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడుతున్నాయి. ఇప్పటికే అనేక కంపెనీలు ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని ఆదేశాలు జారీ చేశాయి. ఇదే విధంగా అనేక స్కూళ్లు కూడా తమ విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే పాఠాలు చెప్పాలని నిశ్చయించుకున్నాయి. 


అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో అనేక స్కూళ్లు కరోనా వ్యాప్తి చెందుతోందని క్లాసులను రద్దు చేశాయి. ఇదే సమయంలో జిల్లా విద్యాశాఖాధికారులు పిల్లల చదువుకు ఇబ్బంది కలగకూడదని ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే అవసరమైన విద్యార్థులకు మొబైల్ లెర్నింగ్ డివైజెస్, ల్యాప్‌టాప్‌లను అందజేస్తున్నారు. వీరందరూ ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో క్లాసులకు హాజరవ్వచ్చని అధికారులు తెలిపారు. శనివారం మియామి సౌత్‌రిడ్జ్ సీనియర్ హైస్కూల్ విద్యార్థులకు జిల్లా అధికారులు 250కు పైగా మొబైల్ లెర్నింగ్ డివైజెస్‌ను అందజేశారు. శనివారం వరకు తాము మొత్తంగా 32 వేల డివైజ్‌లను విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అందజేసినట్టు అధికారులు స్పష్టం చేశారు. కాగా.. విద్యార్థుల కోసం మొత్తం 2 లక్షల డివైజ్‌లను సిద్దం చేయగా.. ఇంట్లో కంప్యూటర్ లేని వారికి మాత్రమే వీటిని అందజేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తమ టీచర్లు ల్యాప్‌టాప్, మొబైల్ లెర్నింగ్ డివైజెస్‌ను ఎలా వాడాలో నేర్పినట్టు విద్యార్థులు చెబుతున్నారు. ల్యాప్‌టాప్‌లు, మొబైల్ లెర్నింగ్ డివైజెస్‌లతో పాటు వైఫై లేని వారికి రానున్న 60 రోజుల పాటు ఉచితంగా వైఫై సేవలను అందిస్తామని ఈ సందర్భంగా విద్యాశాఖకు చెందిన అధికారులు పేర్కొన్నారు.   

Updated Date - 2020-03-15T07:14:14+05:30 IST