భారత్‌లో 40 లక్షల టీవీలను అమ్మేసిన షియోమీ!

ABN , First Publish Date - 2020-03-26T22:43:16+05:30 IST

చైనీస్ మొబైల్ మేకర్ షియోమీ భారత్‌లో గత రెండేళ్లలో 40 లక్షల ఎంఐ టీవీలను విక్రయించింది. ఈ విషయాన్ని..

భారత్‌లో 40 లక్షల టీవీలను అమ్మేసిన షియోమీ!

న్యూఢిల్లీ: చైనీస్ మొబైల్ మేకర్ షియోమీ భారత్‌లో గత రెండేళ్లలో 40 లక్షల ఎంఐ టీవీలను విక్రయించింది. ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఆకట్టుకునే ఫీచర్లు, బడ్జెట్ ధరల్లో తీసుకొచ్చిన ఎంఐ టీవీ మోడల్స్ దేశంలోని వినియోగదారులను విశేషంగా ఆకర్షించాయి. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇప్పటికే మంచి పేరు సంపాదించుకున్న షియోమీ నుంచి వచ్చిన స్మార్ట్ టీవీలకు కూడా మార్కెట్లో అంతే డిమాండ్ ఉంది. దీంతో ఆ సంస్థ నుంచి వచ్చిన స్మార్ట్ టీవీలు భారత్‌లో హాట్‌కేకుల్లా అమ్మడువుతున్నాయి.  


దేశంలో గత రెండేళ్ల కాలంలో 40 లక్షల ఎంఐ టీవీలను విక్రయించామని, వినియోగదారుల మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు షియోమీ ట్వీట్ చేసింది. మీరు ఉపయోగిస్తున్న ఎంఐ టీవీలు బోల్డంత వినోదాన్ని అందిస్తున్నాయని ఆశిస్తున్నట్టు పేర్కొంది. మీ వద్ద ఎంఐ టీవీ ఏ మోడల్ ఉందో చెప్పాలని అందులో కోరింది.


ఫిబ్రవరి 2018లో షియోమీ నుంచి తొలి ఎంఐ టీవీ మోడల్ ‘ఎంఐ టీవీ4’ విడుదలైంది. ఇది ప్రపంచంలోనే అతి పలుచనైన ఎల్‌ఈడీ టీవీ. 55 అంగుళాల ఈ టీవీ ధర రూ.39,999. 4కె ప్యానెల్, హె‌డీఆర్ సపోర్ట్, 64 బిట్ క్వాడ్‌క్వార్ అమ్లోజిక్ కోర్టెక్స్-ఎ53 ఎస్ఓసీ, 2జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజీ వంటి ఆప్షన్లు ఉన్నాయి. ఆ తర్వాత మరిన్ని మోడళ్లను విడుదల చేసింది.

Updated Date - 2020-03-26T22:43:16+05:30 IST