Sep 25 2021 @ 11:48AM

అందుకే నీకోసం మూడు వారాలు ఎదురుచూశా.. ఎస్పీ బాలుతో ఎమ్జీఆర్ మాటలివి

తెలుగులో అగ్ర కథానాయకులు ఎన్టీఆర్‌, ఏయన్నార్‌లకే కాకుండా తమిళంలోనూ ఎందరో పెద్ద హీరోలకు బాలు పాడారు. ఎమ్జీఆర్‌ నిర్మించిన ‘అడమైప్పెణ్‌’ చిత్రంలో ‘ఆయిరం నిలవేవా’ అనే పాట ఎమ్జీఆర్‌కు ఆయన పాడిన తొలి పాట. ఈ పాట వెనుక పెద్ద కథే ఉంది. 1969లో విడుదలైన ఈ చిత్రంలో ఎమ్జీఆర్‌, జయలలిత నటించారు. గాయకుడిగా బాలు ఎదుగుతున్న దశ అది. ఆయన ప్రతిభ గురించి విని ఈ అవకాశం ఇచ్చారు ఎమ్జీఆర్‌. ఆ చిత్రానికి సంగీత దర్శకుడు కేవీ మహదేవన్‌.


చెన్నై రామవరంలోని ఎమ్జీఆర్‌ గార్డెన్స్‌లో బాలు, సుశీలతో పాట రిహార్సల్స్‌ జరిగాయి. పదిహేను రోజుల్లో పాట రికార్డింగ్‌ ఉంటుందని చెప్పారు. ఆనందంతో బాలు తిరిగి వచ్చేశారు. అయితే ఆ మర్నాటి నుంచీ ఆయనకు విపరీతమైన జ్వరం పట్టుకుంది. ‘‘ఇది టైఫాయిడ్‌.. మూడు వారాల విశ్రాంతి అవసరం’ అని డాక్టర్‌ చెప్పాడు. గడప దాటి బయటకు వెళ్లలేని పరిస్థితి. మరో పక్క బాలు పాడే పాటను ఎమ్జీఆర్‌, జయలలితపై జైపూర్‌లో చిత్రీకరించడానికి అన్ని ఏర్పాట్లూ జరిగిపోతున్నాయి. యూనిట్‌ సభ్యులు అక్కడికి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఆ సంస్థ ప్రొడక్షన్‌ మేనేజర్‌ వచ్చి బాలు పరిస్థితి చూసి వెళ్లాడు. ఆయన మాత్రం ఏమంటాడు! ‘రెస్ట్‌ తీసుకో’ అని చెప్పి వెళ్లిపోయాడు.


కొన్ని రోజులకు బాలు కోలుకున్నారు. కానీ ఓ మంచి అవకాశం మిస్‌ అయిందనే బాధ మాత్రం ఆయన్ని వదల్లేదు. మళ్లీ ప్రొడక్షన్‌ మేనేజర్‌ వచ్చాడు. బాలు ఆరోగ్యం మెరుగవడం చూసి సంతృప్తిచెంది, ‘రేపు రిహార్సల్స్‌కు రాగలరా?’ అని అడిగాడు. ఆ మాటతో బాలుకు కొత్త ఉత్సాహం వచ్చింది. ఎమ్జీఆర్‌ నుంచి మళ్లీ పిలుపు వస్తుందని ఆయన ఊహించలేదు. ఎగిరి గంతులెయ్యాలని అనిపించినా, బలవంతంగా ఆగి ‘తప్పకుండా వస్తాను సార్‌’ అన్నారు బాలు. ఎమ్జీఆర్‌ ఆఫీసుకు వెళ్లగానే.. అంతకుముందు పాడాల్సిన పాటనే ఆయనతో మళ్లీ రిహార్సల్స్‌ చేయించారు మహదేవన్‌. ‘ఇదేమిటి.. ఆ పాట ఇంతవరకూ రికార్డ్‌ చేయలేదా?’ అని అడిగే ధైర్యం కూడా బాలుకు లేదు.


ఆ మర్నాడు బాలు, సుశీలతో పాట పాడించి రికార్డ్‌ చేశారు మహదేవన్‌. ఆ మర్నాడు ఎమ్జీఆర్‌ను కలిశారు బాలు.


‘ఈ పాట నేను మరో గాయకుడితో పాడించి, షూటింగ్‌ కూడా పూర్తి చేసేవాణ్ని. కానీ నీ గురించి ఆలోచించి మూడు వారాలు వేచి చూశాను. ఎందుకంటే నువ్వు నాకు పాడుతున్నావని అందరికీ తెలిసిపోయింది. నువ్వు కూడా కొంతమందికి చెప్పుకొని ఉంటావు. ఇలాంటి పరిస్థితుల్లో నేను మరో గాయకుడితో పాట పాడిస్తే, నీ పాట నచ్చక అలా చేశానని అందరూ అనుకొంటారు. అది నీ భవిష్యత్‌కు మంచిది కాదు. అందుకే అన్నీ ఆలోచించి, మూడు వారాలు నీ కోసం ఎదురుచూశాను. జ్వరం తగ్గిన తర్వాతే నీతో పాడించాను. క్రమశిక్షణతో మెలిగి వృద్ధిలోకి రా’ అని ఆశీర్వదించారు ఎమ్జీఆర్‌. ఎదుగుతున్న గాయకుడికి ఇంతకంటే గొప్ప ప్రోత్సాహం ఇంకేమి ఉంటుంది!