అమెరికా కాదు.. సరిహద్దుల వద్ద భద్రత పెంచాల్సింది మనం: మెక్సికో నేతలు

ABN , First Publish Date - 2020-07-04T23:49:32+05:30 IST

మెక్సికో నుంచి అమెరికాలోకి ఎవరు అక్రమంగా ప్రవేశించినా అమెరికా వారిని

అమెరికా కాదు.. సరిహద్దుల వద్ద భద్రత పెంచాల్సింది మనం: మెక్సికో నేతలు

మెక్సికో సిటి: మెక్సికో నుంచి అమెరికాలోకి ఎవరు అక్రమంగా ప్రవేశించినా అమెరికా వారిని వెంటనే వెల్లగొడుతుంది. అంతేకాకుండా అమెరికా ప్రభుత్వం అమెరికా - మెక్సికో సరిహద్దుల వద్ద నిత్యం గట్టి భద్రతను ఏర్పాటు చేస్తుంది. మెక్సికో నుంచి ఎవరూ అమెరికాకు రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం అమెరికాను కరోనా మహమ్మారి కబళిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా బదులుగా మెక్సికో ప్రభుత్వం సరిహద్దుల వద్ద భద్రత పెంచేందుకు పూనుకుంటోంది. అమెరికా నుంచి మెక్సికోకు వస్తున్న వారి వల్ల మెక్సికోలో కరోనా వ్యాప్తి విపరీతంగా పెరుగుతోందని మెక్సికో రాజకీయ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెక్సికోలోని టామాలిపస్ రాష్ట్ర గవర్నర్ జేవియర్ గార్సియా ఇటీవల కరోనా బారిన పడ్డారు. 


దీంతో మెక్సికో నుంచి అమెరికాకు, అమెరికా నుంచి మెక్సికోకు వచ్చి వెళ్లే వారిపై నిఘా పెట్టాలంటూ ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆయనతో పాటు అనేక రాష్ట్రాలకు చెందిన నేతలు సరిహద్దుల వద్ద భద్రత పెంచాలంటూ కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నారు. దేశ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని.. అమెరికా నుంచి వచ్చే ప్రతిఒక్కరికి పరీక్షలు నిర్వహించాలని నేతలు కోరుతున్నారు. కాగా.. మెక్సికోలో ఇప్పటివరకు 2,45,251 కేసులు నమోదు కాగా.. 29,843 మంది మృత్యువాతపడ్డారు. ఇక అమెరికాలో నిత్యం 50 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కాలిఫోర్నియా, టెక్సాస్, అరిజోనా, ఫ్లోరిడా రాష్ట్రాలు కరోనాకు కేంద్రాలుగా మారిపోయాయి. అమెరికాలో ఇప్పటివరకు దాదాపు 29 లక్షల కేసులు నమోదు కాగా.. లక్షా 30 వేలకు పైగా మరణాలు సంభవించాయి.

Updated Date - 2020-07-04T23:49:32+05:30 IST