Metturu Dam నుంచి సాగుజలాలు

ABN , First Publish Date - 2022-05-25T14:08:28+05:30 IST

కావేరి డెల్టా జిల్లాల రైతాంగం కోసం సేలం జిల్లా మేట్టూరు డ్యాం నుంచి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మంగళవారం ఉదయం సాగుజలాలను విడుదల చేశారు. మేట్టూరు డ్యాం వద్ద

Metturu Dam నుంచి సాగుజలాలు

- విడుదల చేసిన సీఎం స్టాలిన్‌

- డెల్టా రైతుల హర్షం


చెన్నై: కావేరి డెల్టా జిల్లాల రైతాంగం కోసం సేలం జిల్లా మేట్టూరు డ్యాం నుంచి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మంగళవారం ఉదయం సాగుజలాలను విడుదల చేశారు. మేట్టూరు డ్యాం వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి మీట నొక్కటంతో క్రష్‌గేట్లు తెరచుకుని డ్యాం నుంచి జలాలు కిందికి ఉరకలెత్తాయి. నీటిపై ముఖ్యమంత్రి స్టాలిన్‌, మంత్రులు, ఇరిగేషన్‌ శాఖ ఉన్నతాధికారులు పూలు చల్లారు. కావేరి పరివాహక ప్రాంతాల్లో ప్రస్తుతం భారీగా వర్షాలు కురుస్తుండటం, మేట్టూరు డ్యాంలో అధిక పరిమాణంలో జలాలు ప్రవేశిస్తుండటంతో ముందుగానే సాగునీటిని విడుదల చేశారు. దీంతో డెల్టా రైతులు హర్షం ప్రకటించారు. 18 రోజులకు ముందే నీరు విడుదల చేయడంతో తమ ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరుగుతాయని, చివరి ఆయకట్టు వరకూ నీరు వస్తుందని చెబుతున్నారు. ప్రతియేటా కావేరి డెల్టా జిల్లాల్లో కురువై (స్వల్పకాలిక) వరి సాగుకోసం ఆ డ్యాం నుండి జూన్‌ 12న జలాలను విడుదల చేయడం ఆనవాయితీ. అయితే ప్రస్తుతం మేట్టూరు డ్యాంలో నీటి మట్టం 89.942 టీఎంసీలకు చేరుకోవడంతో ముందుగానే సాగుజాలాను విడుదల చేశారు. ఈ డ్యాం నీటితో డెల్టా జిల్లాల్లో 5.22 లక్షల ఎకరాల్లో సాగు చేయగలుగుతారు. 


99.74 టీఎంసీల జలాలు...

నామక్కల్‌, కరూరు, తిరుచ్చి, తంజావూరు, తిరువారూరు, నాగపట్టినం, మైలాడుదురై జిల్లాల్లో 4.91 లక్షల ఎకరాలకు ఈ డ్యాం నుండి 93.8 టీఎంసీల సాగుజలాలను విడుదల చేస్తారు. ఇదే విధంగా కడలూరు, అరియలూరు జిల్లాల్లో 30,800 ఎకరాలకు 5.88 టీఎంసీలను విడుదల చేయనున్నారు. ఈ మొత్తం జిల్లాలకు జూన్‌ 12 నుంచి సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు 125 టీఎంసీల సాగుజలాలు అవసరమవుతాయి. మేట్డూరు డ్యాం నుంచి 99.74 టీఎంసీల నీరు విడుదల చేస్తే, 25.26 టీఎంసీలు భూగర్భజలాలు, వర్షాల ద్వారా లభిస్తాయి. మంగళవారం ఉదయం డ్యాం నుంచి మూడువేల ఘనపుటడుగుల పరిమాణంలో నీటిని విడుదల చేశారు. సాయంత్రానికి 10 వేల ఘనపుటడుగుల మేరకు పెంచారు. జూన్‌ నెలాఖరు వరకు ఈ పరిమాణంలోనే నీటిని విడుదల చేస్తారు. 


జూలైలో 16 వేల ఘనపుటడుగుల చొప్పున నీరు విడుదల చేస్తారు. డెల్టా జిల్లాల్లో ఈ జలాలతో 120 రోజుల్లోగా అధికదిగుబడినిచ్చే స్వల్పకాలిక వరి సాగుచేస్తారు. ఆగస్టులో అవసరాలను బట్టి 18 వేల ఘనపుటడుగుల మేరకు జలాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో నీటివనరుల శాఖ మంత్రి దురైమురుగన్‌, నగరపాలక శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ, రవాణా శాఖ మంత్రి ఎస్‌ఎస్‌ శివశంకర్‌, ఎంపీలు ఎస్‌.సెంథిల్‌కుమార్‌, ఎస్‌ఆర్‌ పార్తీబన్‌, ఏకేపీ చిన్నరాజ్‌, శాసనసభ్యుడు రాజేంద్రన్‌, ప్రజాపనుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సందీప్‌ సక్సేనా, సేలం జిల్లా కలెక్టర్‌ ఎస్‌.కార్మేగం, నీటి వనరుల శాఖ ప్రధాన కార్యదర్శి రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-25T14:08:28+05:30 IST