ముమ్మరంగా Metro రెండో విడత పరుగులు

ABN , First Publish Date - 2022-01-17T15:17:08+05:30 IST

రాజధాని నగరం చెన్నైలో వాహనాల రద్దీ నియంత్రణే లక్ష్యంగా ప్రారంభమైన చెన్నై మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌) రెండో విడత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 2011కు ముందు డీఎంకే ప్రభుత్వ

ముమ్మరంగా Metro రెండో విడత పరుగులు

- 2వ విడత పనులు వేగవంతం 

- 30 సొరంగ మార్గాల నిర్మాణం

- చైనా నుంచి అత్యాధునిక యంత్రాలు


ప్యారీస్‌(చెన్నై): రాజధాని నగరం చెన్నైలో వాహనాల రద్దీ నియంత్రణే లక్ష్యంగా ప్రారంభమైన చెన్నై మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (సీఎంఆర్‌ఎల్‌) రెండో విడత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 2011కు ముందు డీఎంకే ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన మెట్రోరైల్‌ తొలి విడత పనులు పూర్తయి నగరవ్యాప్తంగా మెట్రోరైల్‌ పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. తొలి విడతగా ఉత్తర చెన్నైలో మాధవరం నుంచి దక్షిణ చెన్నైలోని శిరుచ్చేరి సిప్కాట్‌ మధ్య, మాధవరం-షోళింగనల్లూరు మధ్య 52.01 కి.మీటర్ల మెట్రో రైలు మార్గం నిర్మించారు. దీంతో పాటే మైలాపూర్‌ లైట్‌ హౌస్‌ నుంచి పూందమల్లి బైపాస్‌ వరకు మెట్రోరైల్‌ నిర్మాణం పనులు 12 ప్రాంతాల్లో జరుగుతున్నాయి. తాజాగా సొరంగమార్గం పనులు చేపట్టారు. రెండో విడతలో రైల్వేస్టేషన్లు, ప్లాట్‌ఫారాలు, ప్రయాణీకులకు సీటింగ్‌ తదితరాలను సమకూర్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పనులను వేగంగా పూర్తి చేసేలా ముఖ్య ఇంజనీర్లతో ఓ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కాంట్రాక్టర్లతో కలిసి నిర్ణీత గడువులోపే పనులు ముగించాలని ఆదేశించింది. ముందుగా సొరంగ మార్గాలు, మాధవరం - తరమణి లింకురోడ్డులో 30 రైల్వేస్టేషన్లు ఏర్పాటవుతున్నాయి. కాగా పూందమల్లి బైసాస్‌ రోడ్డు- లైట్‌హౌస్‌ మార్గంలో, కోడంబాక్కం పవర్‌ హౌస్‌ - లైస్‌ హౌస్‌ మధ్య మొత్తం అండర్‌గ్రౌండ్‌లో 12 రైల్వేస్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. మాధవరం - షోలింగనల్లూర్‌ మార్గంలో 6 రైల్వే స్టేషన్లు నిర్మితం కానున్నాయి. సొరంగ మార్గం కంటే ముందు మిగిలిన పనులు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.  

  భారీ యంత్రాల దిగుమతి

సొరంగ మార్గాలు తవ్వేందుకు చైనా నుంచి అత్యాధునిక యంత్ర పరికరాలను తెప్పిస్తున్నారు. ఒక్కో యంత్రం విలువ రూ.60 కోట్లు  వరకు వుంటుందని అధికారులు తెలిపారు. ఒక్కో యంత్రం ఒక మినీ కర్మాగారమని చెప్పే స్థాయికి డిజైన్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. రెండవవిడత మెట్రో పనుల్లో ఇరుకుగా వున్న రోడ్ల మధ్య సొరంగ మార్గాలు తవ్వేందుకు వీటిని వినియోగించనున్నారు. ఇవి మే కంటే ముందే నగరానికి చేరుకుం టాయని, ఈ లోగా సొరంగాల తవ్వకానికి ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-01-17T15:17:08+05:30 IST