Abn logo
Apr 13 2021 @ 00:45AM

మెట్రో రైలు పట్టాలెక్కేనా?

సిద్ధం కాని డీపీఆర్‌

దసరా రోజున విశాఖలో కార్యాలయం ప్రారంభం

మార్చి 2021కే టెండర్లు పూర్తి చేస్తామన్న మంత్రి బొత్స

ఇప్పటివరకూ అతీగతీ లేదు

ప్రాజెక్టు అంచనా వ్యయం...రూ.15,993 కోట్లు

మోడరన్‌ ట్రామ్‌కు మరో రూ.6 వేల కోట్లు

రెండింటికీ కలిపి సుమారు రూ.22 వేల కోట్లు అవసరం

రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.11,000 కోట్లు

నిధుల సమీకరణ ఎలా?


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


‘విశాఖపట్నంలో డ్రైవర్లు లేని మెట్రో రైళ్లు రాబోతున్నాయి. రైళ్ల పైన విద్యుత్‌ వైర్లు కూడా ఉండవు. డీసీ పవర్‌తోనే నడుస్తాయి. రెండు డీపీఆర్‌లు తయారు చేయిసున్నాం. మార్చి 2021 నాటికి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిపోతుంది.’

- గత విజయదశమి (అక్టోబరు 25) రోజున విశాఖపట్నంలో ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్‌ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పురపాలన, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పిన మాటలివి. 


వాస్తవం ఏమిటంటే...?


ఇక్కడ కార్యాలయం ప్రారంభించి ఆరో నెల వచ్చినా, ఇప్పటివరకు టెండర్లు కాదు కదా...కనీసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) కూడా పూర్తిచేయలేదు. దాని గురించి మాట్లాడే నాథుడే లేడు. మొదటి ప్రాజెక్టుకే డీపీఆర్‌ లేదంటే...రెండోది తయారు చేస్తామని నేతలు ప్రకటించారు. 


ప్రాజెక్టు ఎలాగంటే...?


విశాఖ మహా నగర అభివృద్ధి సంస్థ(వీఎంఆర్‌డీఏ) పరిధిలో 79.91 కి.మీ. పొడవున లైట్‌ మెట్రో కారిడార్‌, మరో 60 కి.మీ. పొడవున మోడరన్‌ ట్రామ్‌ కారిడార్‌ నిర్మాణానికి మాస్టర్‌ ప్లాన్‌కు ఆదేశించారు. ఈ రెండింటికీ వేర్వేరు డీపీఆర్‌లు తయారు చేయాలని అర్బన్‌ మాస్‌ ట్రాన్సిస్ట్‌ కంపెనీ (యుఎంటీసీ) సంస్థకు బాధ్యతలు అప్పగించారు. నవంబరు-2020లో మొదటి డీపీఆర్‌, డిసెంబరు-2020లో రెండో డీపీఆర్‌ పూర్తి చేయాల్సి ఉంది. దీనిపై ఇటీవలె ముఖ్యమంత్రి కార్యాలయంలో సమావేశం జరిగింది. అధికారులు సమర్పించిన నివేదికపై సీఎం సంతృప్తి చెందలేదని సమాచారం. మరిన్ని మార్పులు చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. ఈ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.15,993 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. కిలోమీటరుకు రూ.200 కోట్లు అవసరమని అధికారులు చెబుతున్నారు. సేకరించే భూమికి చెల్లించే మొత్తం దీనికి అదనం. మెట్రో రైలు కారిడార్లు, స్టేషన్లు, ఇతర అవసరాలకు 118 ఎకరాల భూమి అవసరమని పేర్కొన్నారు. ప్రయాణికుల కోసం ఆరు ప్రాంతాల్లో మల్టీ లెవెల్‌ కారు పార్కింగ్‌ భవనాలు వస్తాయి. గురుద్వారా, మద్దిలపాలెం, సంపత్‌ వినాయకుడి గుడి, గాజువాక, స్టీల్‌ప్లాంటు ప్రాంతాల్లో వీటిని నిర్మిస్తారు. ప్రతిచోట 200 నుంచి 300 కార్లు పార్కింగ్‌ చేసుకోవచ్చు. మొదటి దశలో 46.40 కి.మీ. ట్రాక్‌ను, రెండో దశలో 28.91 కి.మీ. ట్రాక్‌ను నిర్మిస్తారు.  


బీచ్‌ రోడ్డు కాకుండా మొదటి దశలో చేపట్టే లైట్‌ మెట్రో కోసం నాలుగు కారిడార్లలో 75.31 కి.మీ. పొడవున ఎలివేటెడ్‌ ట్రాక్‌ నిర్మిస్తారు. ఇందులో 52 స్టేషన్లు వస్తాయి.


స్టీల్‌ప్లాంటు-కొమ్మాది    34.23 కి.మీ    27 స్టేషన్లు

గురుద్వారా-పోస్టాఫీసు        5.26 కి.మీ.     6 స్టేషన్లు

తాటిచెట్లపాలెం-చినవాల్తేరు    6.91 కి.మీ.     9 స్టేషన్లు

కొమ్మాది-భోగాపురం        28.91 కి.మీ.    10 స్టేషన్లు


నిధులు ఎక్కడున్నాయి? 


కిలోమీటరుకు రూ.200 కోట్లు చొప్పున మొదటి దశ లైట్‌ మెట్రో పనులకు రూ.15,993 కోట్లు అవసరం. రెండో దశలో చేపట్టే మోడరన్‌ ట్రామ్‌కు మరో రూ.6 వేల కోట్లు అవసరం. రెండింటికీ కలిపి రూ.22 వేల కోట్లు ఉండాలి. ఇందులో బిడ్డర్‌ వాటా 48 శాతం కాగా మిగిలిన 52 శాతం రాష్ట్ర ప్రభుత్వ సమకూర్చాలి. అంటే సుమారుగా రూ.11 వేల కోట్లు అందించాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పేరు చెబితే ఏ ఆర్థిక సంస్థ కూడా రుణం ఇచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి సమయంలో విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు వస్తుందా?...అంటే ప్రజలే సమాధానం వెదుక్కోవాలి.

Advertisement
Advertisement
Advertisement