నేను పడ్డ ఇబ్బందుల్లో నుంచి..తెరపైకి ‘ఈ-ఆటో’

ABN , First Publish Date - 2022-04-22T15:58:33+05:30 IST

‘‘రాత్రి పూట మెట్రోరైలు దిగిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు వాహనాలు అందుబాటులో ఉండవు. బెంగళూరులో కొన్ని నెలల క్రితం నాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది

నేను పడ్డ ఇబ్బందుల్లో నుంచి..తెరపైకి ‘ఈ-ఆటో’

బెంగళూరులో ఆఫీసుకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డా.. 

రాత్రివేళలో వాహనాలు లేకపోవడంతో కాలినడకన ఇంటికి..

మెట్రో ప్రయాణికుల అవస్థలను తొలగించేందుకు ఈ-ఆటోలు

స్టేషన్‌కు 5 కిలోమీటర్ల పరిధి వరకు సేవలు

‘ఆంధ్రజ్యోతి’తో మెట్రో రైడ్‌ కో ఫౌండర్‌, డైరెక్టర్‌ గిరీష్‌ నాగ్‌పాల్‌


హైదరాబాద్‌ సిటీ: ‘‘రాత్రి పూట మెట్రోరైలు దిగిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు వాహనాలు అందుబాటులో ఉండవు. బెంగళూరులో కొన్ని నెలల క్రితం నాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. జేపీ నగర్‌ మెట్రో స్టేషన్‌కు మూడు కిలో మీటర్ల దూరంలో మా ఇంటి నుంచి స్టేషన్‌కు వెళ్లేందుకు, వచ్చేందుకు నిత్యం ఇబ్బందులు పడేవాడిని. కాలి నడకన వెళ్లి రైలు ఎక్కేవాడిని. నాకు ఎదురైన ఇబ్బందులు.. మరెవరికీ ఎదురుకావద్దని ఈ(ఎలక్ట్రిక్‌) - ఆటోలకు అంకురార్పణ జరిగింది..’’ అని మెట్రో రైడ్‌ కో ఫౌండర్‌, డైరెక్టర్‌ గిరిష్‌ నాగ్‌పాల్‌ అన్నారు. నగరంలో గురువారం ప్రారంభించిన మెట్రో రైడ్‌ విశేషాలను గిరిష్‌ నాగ్‌పాల్‌ ‘ఆంధ్రజ్యోతి’కి వెల్లడించారు. అవి ఆయన మాటల్లోనే..


అందుబాటులో మహిళా డ్రైవర్లు 

ప్రస్తుతం రెండు స్టేషన్ల వద్ద 50 ఆటోలను అందుబాటులో ఉంచుతున్నాం. ఎలక్ర్టిక్‌ ఆటోలు ఉన్న వారు మమ్మల్ని సంప్రదిస్తే ఉపాధి కల్పిస్తాం. మహిళా డ్రైవర్లను సైతం అందుబాటులో ఉంచాం. నగరంలో ఇప్పటికే 10 మంది శిక్షణ తీసుకుని సిద్ధంగా ఉన్నారు. త్వరలో వారు వాహనాలను నడపనున్నారు. బెంగళూరులో ఇప్పటికే 30 శాతం ఆటోల్లో మహిళా డ్రైవర్లే ఉన్నారు. ఒక్కో డ్రైవర్‌కు రోజుకు రూ.600, ప్రతి 5 టిప్పులపై అదనంగా రూ.100 చెల్లిస్తున్నాం. నగరంలో వచ్చే ఏడాదిలోపు 6 లక్షల మందికి సేవలందించేందుకు టార్గెట్‌గా పెట్టుకున్నాం.


ఎలా బుక్‌ చేసుకోవాలంటే..

స్మార్ట్‌ఫోన్‌లోని ప్లే స్టోర్‌లో ‘మెట్రో రైడ్‌’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. సమీపంలోని స్టేషన్‌ డెస్టినేషన్‌ ఎంచుకోవాలి. స్టేషన్‌ దగ్గరగా ఉన్న ఆటో డ్రైవర్‌ ప్రయాణికుల చెంతకు వస్తారు. ఆటోలో ముగ్గురిని మాత్రమే తీసుకెళ్తారు. యాప్‌లో ‘స్కాన్‌ ఏ క్యూ ఆర్‌ కోడ్‌, ఫైండ్‌ ఏ డ్రైవర్‌’ ద్వారా కూడా బుక్‌ చేసుకోవచ్చు. ఒక స్టేషన్‌ వద్ద 30-40 ఆటోలను ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఒకసారి బుక్‌ చేసుకుంటే క్యాన్సిలేషన్‌ ఉండదు. ప్రస్తుతం పరేడ్‌గ్రౌండ్స్‌, రాయదుర్గం మెట్రోస్టేషన్ల వద్ద ఈ-ఆటో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. దశలవారీగా అన్ని స్టేషన్లకూ విస్తరిస్తాం. వరల్డ్‌ రీసోర్స్‌ ఇనిస్టిట్యూట్‌ (డబ్ల్యూఆర్‌ఐ), షెల్‌ ఫౌండేషన్‌, హైదరాబాద్‌ మెట్రో రైలుతో ఒప్పందం కుదుర్చుకుని సేవలను ప్రారంభించారు. 


పార్కింగ్‌ సమస్య.. సమయం వృథా..

సాధారణంగా సమీపంలోని ప్రజలు బైక్‌లు, కార్లను మెట్రో స్టేషన్‌ వద్ద పార్క్‌ చేసి రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. కొన్ని పార్కింగ్‌ ఇబ్బందులు, వాహనాలు చోరీకి గురికావడం, ధ్వంసం కావడం జరుగుతుంటాయి. పార్కింగ్‌ చార్జీ కనీసం రూ.20 నుంచి రూ.40 తీసుకుంటారు. ఇలాంటి సమస్యల నుంచి ఈ-ఆటోలు ఉపశమనం కలిగిస్తాయి.


మొదటి కిలోమీటరుకు రూ.10

మినిమమ్‌ 10 కిలోమీటర్లు లేనిదే క్యాబ్‌లు రావు. ఆటోల కోసం ప్రయత్నిస్తే కనీసం రూ.100 ఇవ్వనిదే ఎవరూ రామని చెబుతుంటారు. అందుకే మెట్రోస్టేషన్‌ పరిధిలోని 5 కిలోమీటర్ల లోపు ఎలక్ర్టిక్‌ ఆటో (ఈ-ఆటో) సేవలందించేందుకు ఏర్పాట్లు చేశాం. మెట్రో రైడ్‌ యాప్‌ ద్వారా ఎవరైనా బుక్‌ చేసుకోవచ్చు. మొదటి కిలోమీటరు రూ.10, తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.6 కనీస చార్జీని తీసుకుంటారు.

Updated Date - 2022-04-22T15:58:33+05:30 IST