రూ.6683 కోట్లతో కోవైలో మెట్రో రైలు పథకం

ABN , First Publish Date - 2021-02-24T15:53:34+05:30 IST

రాష్ట్రంలో గతేడాది మార్చి నెలాఖరు నుంచి కొనసాగుతున్న కరోనా లాక్‌డౌన్‌ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపింది. కరోనా నిరోధక చర్యలకు, కరోనా బాధితులకు చికిత్సలందించటానికి ...

రూ.6683 కోట్లతో కోవైలో మెట్రో రైలు పథకం

2వేల ఎలక్ర్టికల్‌ బస్సుల కొనుగోలు

టెన్త్‌ వరకూ కంప్యూటర్‌ సైన్స్‌

వ్యవసాయ శాఖకు రూ.11982 కోట్లు

రాష్ట్ర రుణభారం రూ.5.70లక్షల కోట్లు

ద్రవ్య లోటు రూ.41 వేల కోట్లు

పన్నీర్‌సెల్వం తాత్కాలిక బడ్జెట్‌


చెన్నై (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గతేడాది మార్చి నెలాఖరు నుంచి కొనసాగుతున్న కరోనా లాక్‌డౌన్‌ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపింది. కరోనా నిరోధక చర్యలకు, కరోనా బాధితులకు చికిత్సలందించటానికి భారీగా నిధులు కేటాయించడంతో ప్రభుత్వ రుణభారం అధికమైనట్లు మంగళవారం ఉపముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం దాఖలు చేసిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రతిపాదనల్లో స్పష్టమైంది. కరోనా సంక్షోభం కారణంగా కుంటుపడిన ఆర్థికపరిస్థితిని మెరుగుపరిచే దిశగా వివిధ శాఖలకు నిధులు కేటాయించడంతో ద్రవ్యలోటు రూ.41వేల కోట్లకు పెరిగింది. మంగళవారం ఉదయం కలైవానర్‌ అరంగంలో నిర్వహించిన శాసనసభ సమావేశంలో ఆర్థ్థిక మంత్రిత్వ శాఖను నిర్వర్తిస్తున్న ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తాత్కాలిక బడ్జెట్‌ను దాఖలు చేశారు. ఈ బడ్జెట్‌లో అందరూ ఊహించినట్టు ప్రజాకర్షణ పథకాలకు సంబంధించిన ప్రకటనలు లేకపోయినా, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేలా పలు శాఖలకు పన్నీర్‌సెల్వం నిధులు కేటాయించారు. ఈ బడ్జెట్‌లో చెన్నై నగరానికి ధీటుగా వాణిజ్యనగరమైన కోయంబత్తూరులో మెట్రోరైలు ప్రాజెక్టును అమలు చేయడానికి రూ.6683 కోట్లు కేటాయించడం విశేషం. ఇక ఆరు నుంచి పదోతరగతి వరకూ కంప్యూటర్‌ సైన్స్‌ను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. రవాణా శాఖకు సంబంధించి కొత్తగా 12 వేల బస్సులు కొనుగోలు చేయనున్నామని, వాటిలో రెండువేల ఎలక్ట్రికల్‌ బస్సులు కూడా వున్నాయని ఆయన తెలిపారు. వ్యవసాయశాఖకు ఈసారి రూ.11982 కోట్ల నిధులు కేటాయించారు. బిందే సేద్యానికి రూ.4060 కోట్ల నిధులతో 1926 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలను సాగుచేయనున్నట్టు తెలిపారు. అంతే కాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పంట రుణాల మాఫీ కోసం రూ.5000 కోట్ల మేరకు నిధులు కేటాయించనున్నట్టు సభ్యుల హర్షధ్వానాల మధ్య ఆయన ప్రకటించారు. అదే సమయంలో రాష్ట్ర రుణభారం రూ.5.70 లక్షల కోట్లకు పెరిగినట్టు చావుకబురు చల్లగా చెప్పారు.


పోలీసు శాఖకు రూ. 9567 కోట్లు: రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పటిష్టపరిచే దిశగా ఆ శాఖకు రూ.9567 కోట్ల మేరకు నిధులు కేటాయించనున్నామని, అగ్నిమాపక శాఖకు రూ.4436 కోట్లు, విద్యుత్‌ శాఖకు రూ.7217 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు రూ.5478 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.11,982 కోట్ల మేరకు నిధులు కేటాయించనున్నామని పన్నీర్‌సెల్వం తెలిపారు. రిజర్వు బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ రంగరాజన్‌ కమిటీ సిఫారసుల మేరకు రాష్ట్ర పారిశ్రామిక ఆర్థిక సంస్థ ద్వారా పెట్టుబడులను పెంచే దిశగా రూ.100 కోట్ల మేరకు నిధులు కేటాయించనున్నామని, ప్రస్తుత బడ్జెట్‌లో తొలివిడతగా రూ.300 కోట్లు కేటాయించినట్లు ఆయన ప్రకటించారు.


ఎయిర్‌పోర్టు నుంచి కొత్త మెట్రో రైలు ప్రాజెక్టు : చెన్నై విమానాశ్రయం నుంచి తాంబరం మీదుగా కీలంబాక్కం బస్‌స్టేషన్‌ వరకూ మూడో దశ మెట్రో రైలు ప్రాజెక్టు అమలుపరిచేందుకు పరిశీలనలు జరిపిన ప్రణాళికలను సిద్ధం చేయనున్నట్టు పన్నీర్‌సెల్వం తెలిపారు. చెన్నై నగరంలో రెండో దశ మెట్రోరైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులను త్వరగా విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కుటుంబ సంక్షేమ బీమా పథకం ప్రకారం కుటుంబపోషకుడు సాధారణ పరిస్థితుల్లో మరణిస్తే రూ.2లక్షలు బీమా సొమ్ముగా అందిస్తామని, ప్రమాదాల్లో మరణిస్తే రూ.4లక్షలను చెల్లిస్తామని ఈ హెచ్చింపులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అమలు చేస్తామని ఆయన తెలిపారు.


ఆరోగ్యశాఖకు రూ.19420 కోట్లు: ప్రజారోగ్య శాఖకు రూ.19420 కోట్ల మేరకు నిధులు కేటాయిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కరోనా నిరోధక పనులకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.13,352 కోట్ల మేరకు నిధులను వ్యయం చేసిందని, రాష్ట్రమంతటా ప్రారంభించిన అమ్మా ఉచిత క్లినిక్కులకు రూ.144 కోట్ల మేరకు నిధులను కేటాయిస్తున్నామని ఆయన  వివరించారు. సమగ్ర శిశు సంరక్షణ అభివృద్ధి పఽథకాలకు రూ.2634 కోట్ల మేరకు నిధులు వ్యయం చేయనున్నట్టు తెలిపారు. చేనేత శాఖకు 1224.26కోట్ల మేరకు నిధులు కేటాయించి ఆ శాఖలో ఉత్పత్తులను అధికం చేయనున్నట్టు పేర్కొన్నారు. ఆది ద్రావిడుల సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్‌లో రూ.13967 కోట్ల మేరకు నిధులు కేటాయించారు. 


ఉద్యోగుల బీమా పెంపు: ప్రభుత్వ ఉద్యోగుల బీమా పథకం కింద ప్రస్తుతం చెల్లించే రూ.4 లక్షల నగదును రూ.5 లక్షలకు పెంచుతున్నట్టు ఆయన తెలిపారు. ఇదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగుల వైద్య చికిత్సలకు అందిం చే బీమా సొమ్మును కూడా 7.5 లక్షల నుంచి రూ.10లక్షలకు హెచ్చింపు చేస్తున్నామని తెలిపారు. అసాధారణమైన రోగాల చికిత్సలకుగాను రూ.20 లక్షల దాకా బీమా సొమ్మును చెల్లించడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసు కుంటుందని తెలిపారు. రాష్ట్రంలోని రహదారుల విస్తరణపనులు, కొత్త ఫ్లైవోర్ల నిర్మాణం, కల్వర్టుల నిర్మాణపు పనులకు రూ.6023.11 కోట్ల మేరకు నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు.  గ్రామీణ రహదారుల నిర్మాణానికి, రహదారుల విస్తరణ పనులకు రూ.1250 కోట్ల మేరకు నిధులు కేటాయించారు.

రెవెన్యూ ఆదాయం రూ.18991 కోట్లు: 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను బడ్జెట్‌ కేటాయింపుల ప్రకారం రెవెన్యూ ఆదాయం రూ.2,18991 కోట్లుగా ఉంటుందని పన్నీర్‌సెల్వం తెలిపారు. అదే సమయంలో రెవెన్యూ ఖర్చులు రూ.2,60409 కోట్లు పోగా రెవెన్యూ లోటు 41,417 కోట్లుగా ఉంటుందని అంచనా వేసినట్టు ఆయన పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూల ధన వ్యయం రూ.43170 కోట్లకు చేరే అవకాశం ఉందని తెలిపారు. 2012 మార్చి 31 వరకు రాష్ట్ర మొత్త రుణభారం రూ.485502 కోట్లుగా ఉంటుందని, 2022 మార్చి 31లోపున ఈ రుణభారం రూ.5,70189 కోట్లకు పెరుగుతుందని ఆయన వివరించారు.


చెన్నై రింగ్‌రోడ్డు పథకానికి రూ.12 వేల కోట్లు: ఈ బడ్జెట్‌లో చెన్నై సరిహద్దు చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మాణ పథకానికి రూ.12 వేల కోట్లు కేటాయించారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిని కూడా జారీ చేసింది. చెన్నై నగరంలోని ఐదు ప్రాంతాలను కలుపుకుని 133 కి.మీ. పొడవైన రహదారిని ఈ నిధులను నిర్మించనున్నారు. ప్రపంచ బ్యాంకు ఆర్థికసాయంతో రాష్ట్ర రహదారి అభివృద్ధి రెండో దశ నిర్మాణ పనులకు రూ.5171 కోట్లు మేరకు నిధులు కేటాయించారు. చెన్నై - కన్నియాకుమారి రహదారి నిర్మాణపు పధకానికి ఆసియా అభివృద్ధి బ్యాంకు సాయంతో రూ.6448 కోట్ల మేరకు నిధులను కేటాయించాలని బడ్జెట్‌లో పన్నీర్‌సెల్వం ప్రతిపాదించారు.


స్థానిక సంస్థలకు రూ. 5141 కోట్లు: రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఆర్థిక పరిపుష్టిని కలిగించే దిశగా ఈ బడ్జెట్‌లో నగర పాలక సంస్థలకు, రూ.5141 కోట్ల మేరకు నిధులు కేటాయించారు. గ్రామపంచాయతీలకు రూ. 6754 కోట్ల మేరకు నిధులు కేటాయించారు. ఈ నిధుల ద్వారా ఆయా స్థానిక సంస్థలలో ప్రజలకు అవసరమైన కనీస సదుపాయాలు మెరుగవుతాయి. స్మార్ట్‌ సిటీల అభివృద్ధికి రూ. 2350 కోట్లు, అమృత్‌ పఽథకానికి రూ.1450 కోట్లు కేటాయించారు. 

Updated Date - 2021-02-24T15:53:34+05:30 IST