విదేశాల్లో మాదిరిగా Metro లైట్‌.. స్టేషన్ల నుంచి సంస్థలకు నేరుగా రైలు..

ABN , First Publish Date - 2021-12-13T18:42:14+05:30 IST

విదేశాల్లో మాదిరిగా కొత్త తరహా ప్రజారవాణాను నగరంలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అడుగులు పడుతున్నాయి....

విదేశాల్లో మాదిరిగా Metro లైట్‌.. స్టేషన్ల నుంచి సంస్థలకు నేరుగా రైలు..

  • కొత్త ఏడాదిలో కొత్త ప్రాజెక్ట్‌ ఫ తొలుత ఐటీ కారిడార్‌లో..  
  • ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు
  • కూకట్‌పల్లి - కోకాపేట్‌ మార్గంలో 24.50 కిలోమీటర్లు
  • పీపీపీ విధానంలో ‘ఎల్‌ఆర్‌టీఎస్‌’ ఏర్పాటుకు నిర్ణయం

విదేశాల్లో మాదిరిగా కొత్త తరహా ప్రజారవాణాను నగరంలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అడుగులు పడుతున్నాయి. ప్రధానంగా గ్రేటర్‌ పరిధిలోని ఐటీ  సంస్థలకు వెళ్లే మార్గాల్లో ఎంఎంటీఎస్‌, మెట్రో రైలు తరహాలో మెట్రో లైట్‌, మెట్రో నియో ప్రాజెక్టులను పరిచయం చేసేందుకు ఎల్‌అండ్‌టీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలుత ఐటీ కారిడార్‌లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై హెచ్‌ఎంఆర్‌తో పాటు హెచ్‌ఎండీఏ పరిధిలోని యూనిఫైడ్‌ మెట్రో పాలిటిన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ కొన్ని నెలల క్రితం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేపట్టినట్లు సమాచారం. వీటిని ప్రైవేట్‌ పబ్లిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) పద్ధతిలో నిర్వహించనున్నట్లు తెలిసింది.


హైదరాబాద్‌ సిటీ : కొవిడ్‌ నేపథ్యంలో దాదాపు రెండేళ్లుగా వర్క్‌ఫ్రమ్‌ హోం చేస్తున్న ఐటీ ఉద్యోగులు ఇటీవల సంస్థలకు రోజువారీగా విధులకు హాజరవుతున్నారు. దీంతో మెట్రోరైళ్లలో ప్రయాణికులు క్రమక్రమంగా పెరుగుతున్నారు. గతేడాది సెప్టెంబర్‌ 27న పునఃప్రారంభమైన మెట్రోరైళ్లలో ప్రయాణికుల సంఖ్య తక్కువగానే ఉంది. ప్రస్తుతం రోజుకు 2.50 లక్షల నుంచి 2.70 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. కాగా, కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ మెట్రో లైట్‌ వ్యవస్థకు సంబంధించిన ప్రామాణికాలను విడుదల చేసింది. ఈ క్రమంలో ఐటీ సంస్థలు అధికంగా ఉండే గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్ట్‌, కోకాపేట ప్రాంతాల్లో మెట్రో నియో లేదా మెట్రో లైట్‌ ప్రాజెక్టుల్లో ఏదో ఒకటి చేపట్టాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.


కూకట్‌పల్లి నుంచి కోకాపేట వరకు లైట్‌ రైల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (ఎల్‌ఆర్‌టీఎ్‌స)ను ఏర్పాటు చేసే విషయంపై అధ్యయనం చేసిన అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. మొత్తం 24 కిలోమీటర్ల మేరకు చేపట్టనున్న మెట్రో లైట్‌ రైల్‌ ప్రాజెక్టులో కేపీహెచ్‌బీ, రాయదుర్గం మెట్రోస్టేషన్లు, హైటెక్‌సిటీ ఎంఎంటీఎస్‌ స్టేషన్లను అనుసంధానం చేసి అక్కడ దిగుతున్న ప్రయాణికులను ఐటీ సంస్థల వద్దకు నేరుగా తీసుకెళ్లేందుకు మెట్రోలైట్‌ రైల్‌ను అందుబాటులో ఉంచనున్నారు. సాధారణంగా మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతి కిలోమీటర్‌కు రూ.250 కోట్ల ఖర్చవుతోంది. అయితే మెట్రో నియో లేదా మెట్రో లైట్‌ ప్రాజెక్టును 40 శాతం ఖర్చుతోనే చేపట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మెట్రో రాకపోకల్లో అధికంగా ఐటీ ఉద్యోగులే ఉంటారని, ఈ రెండు ప్రాజెక్టుల్లో ఏదో ఒకదానిని అందుబాటులోకి తీసుకొస్తే లక్షలాది మందికి ప్రయోజనం చేకూరనుందని వివరిస్తున్నారు.


మెట్రో లైట్‌ అంటే..

మెట్రోలైట్‌ అనేది లైట్‌ అర్బన్‌ రైల్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌. ప్రతి రైలులో మూడు కోచ్‌లుంటాయి. ప్రస్తుత మెట్రో రైలుతో పోల్చితే తక్కువ ఖర్చుతో నిర్మించే అవకాశం ఉంటుంది. మెట్రో లైట్‌ అధిక సామర్థ్యం కలిగిన మెట్రోకు ఫీడర్‌ సిస్టమ్‌గా కూడా పనిచేస్తోంది. ట్రాఫిక్‌ను వేరుచేసే ప్రత్యేక మార్గం అవసరం. రోడ్డు ట్రాఫిక్‌తో విభజించి, నెట్‌వర్క్‌కు ఇరువైపులా ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. మూడు కోచ్‌ల్లో 300 మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. మెట్రో లైట్‌ గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు. ఏదైనా సందర్భంలో అన్‌బోర్డ్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ విఫలమైన సమయంలో గంటకు 25 కిలోమీటర్ల వేగానికి పరిమితం చేస్తుంటారు. ఇది గంటకు 2 వేల నుంచి 15 వేల మందిని తీసుకెళ్తుంది. 


మెట్రో నియో అంటే..

మెట్రో నియో సాధారణ రైళ్ల కంటే తేలికగా, చిన్నగా ఉంటాయి. ఇది ఎలక్ర్టిక్‌ బస్సు, ట్రాలీని పోలి ఉంటుంది. వీటి ధరలు మెట్రో రైలు, మెట్రో లైట్‌ కంటే తక్కువగా ఉంటాయి. మెట్రో నియో ట్రాక్‌పై కాకుండా రోడ్డుపై నడుస్తోంది. రద్దీ సమయంలో గంటకు 8 వేల నుంచి 10వేల మంది ప్రయాణికులను తీసుకెళ్లేందుకు అనుకూలంగా ఉంటుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నాసిక్‌లో ఈ అత్యాధునిక మాస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (ఎంఆర్‌టీఎ్‌స)కి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

Updated Date - 2021-12-13T18:42:14+05:30 IST