‘మెట్రో’ లైట్ తీసుకున్నారా!

ABN , First Publish Date - 2020-06-02T08:55:21+05:30 IST

ప్రతిష్ఠాత్మకమైన లైట్‌మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు అడుగు ముందుకు పడటం లేదు..

‘మెట్రో’ లైట్ తీసుకున్నారా!

ఏడాదిలో సిద్ధమైన డీపీఆర్‌కూ ఆమోదముద్ర లేదు

విజయవాడ లైట్‌మెట్రోకు ప్రాధాన్యత తగ్గింపు

విశాఖ మెట్రోపైనే ప్రభుత్వం దృష్టి


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ప్రతిష్ఠాత్మకమైన లైట్‌మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు అడుగు ముందుకు పడటం లేదు. విజయవాడ అభివృద్ధికి బీజం వేసే ర్యాపిడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి అంతుచిక్కని విధంగా ఉంది. ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏపీఎంఆర్‌సీ) డీపీఆర్‌ను తయారు చేసి నివేదించినా.. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుపై కనీస సమీక్ష కూడా జరగలేదు. ప్రిలిమనరీ డీపీఆర్‌ అందచేసినపుడు లైట్‌మెట్రో ప్రాజెక్టు వ్యయం చూసి నివ్వెరపోయిన ప్రభుత్వం.. ఖర్చును గణనీయంగా తగ్గించటానికి పలు సూచనలు చేసింది. ఆ ప్రకారం ఏపీఎంఆర్‌సీ యంత్రాంగం కన్సల్టెన్సీ సంస్థ  ‘శిస్ర్టా’తో ఆ మేరకు మార్పులు చేయించి నివేదించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టు విషయంలో చూపుతున్న ఆసక్తిలో ఒకటో వంతు కూడా విజయవాడ లైట్‌మెట్రో రైల్‌ ప్రాజెక్టుపై చూపటం లేదు. 


విజయవాడ లైట్‌మెట్రో రైల్‌ ప్రాజెక్టు రాజధానితో కూడా ముడిపడి ఉన్న ప్రాజెక్టు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతికి తగ్గించినట్టే లైట్‌మెట్రోకు కూడా ప్రాధాన్యత తగ్గిస్తే, విజయవాడ నగరం సంగతేమిటి? అనాదిగా రవాణా రంగ రాజధానిగా ఉన్న విజయవాడలో ఆసియాలో రెండో అతిపెద్ద బస్‌స్టేషన్‌ పీఎన్‌బీఎస్‌ ఉంది. అతి పెద్ద రైల్వే జంక్షన్‌, అతి పెద్ద విమానాశ్రయం ఉన్నాయి. ఒకనాడు బకింగ్‌ హామ్‌ కెనాల్‌ ద్వారా జల రవాణా కూడా జరిగిన ప్రాంతమిది. వర్తక, వాణిజ్య, ఉపాధి కేంద్రం కూడా కావటంతో ఈ నగరానికి రాకపోకలు ఎక్కువగా ఉంటాయి.


అందుకు తగినట్టే నగరం అత్యంత రద్దీగా ఉంటోంది. విజయవాడ మీదగా జాతీయ రహదారులు వెళ్లటం, అంతర్గతంగా ట్రాఫిక్‌ కష్టాలు ఉండటం వల్ల ర్యాపిడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ ఏర్పాటు కావాలన్నది దశాబ్దంన్నర కాలం నుంచి ఉన్న డిమాండ్‌. రాష్ట్ర విభజన  తరువాత విభజన చట్టం హామీగా విజయవాడకు మెట్రో ప్రాజెక్టును కేంద్రం మంజూరు చేసింది. నాటి టీడీపీ ప్రభుత్వం అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (ఏఎంఆర్‌సీ)ని ఏర్పాటు చేసింది. విజయవాడ మెట్రోను అమరావతి నగరంతో అనుసంధానించేలా డీపీఆర్‌ తయారు చేసే బాధ్యతను ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ)కి అప్పగించింది.


ఢిల్లీలో విజయవంతంగా మెట్రో ప్రాజెక్టును తీర్చిదిద్దిన డీఎంఆర్‌సీ వైస్‌ చైర్మన్‌ శ్రీధరన్‌ను మెట్రో సలహాదారుగా నియమించింది. రాజధాని ప్రాంతంలో డీఎంఆర్‌సీ అధ్యయనం నిర్వహించి, విజయవాడ కేంద్రంగా మెట్రోను అభివృద్ధి చేసి అమరావతికి, ఇతర ప్రాంతాలకు విస్తరించాలని నిర్ణయించింది. అందుకనుగుణంగా మీడియం మెట్రోకు డీపీఆర్‌ను రూపొందించారు. టెండర్లు పిలిచి, అధికంగా కోట్‌ చేయడంతో డీఎంఆర్‌సీ రద్దు చేసింది. టెండర్ల దశకు వచ్చినా మీడియం మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతులు ఇవ్వకపోవటంతో, ఖర్చును  కూడా దృష్టిలో ఉంచుకుని లైట్‌మెట్రో రైల్‌ ప్రాజెక్టు వైపు గత ప్రభుత్వం అడుగులు వేసింది. డీపీఆర్‌ కోసం టెండర్లు పిలిచి శిస్ర్టా అనే సంస్థకు బాధ్యతలు అప్పగించింది.


ఈ సంస్థ  సాధారణ ఎన్నికలకు ముందు డీపీఆర్‌ను తయారు చేసింది. ఈలోగా సాధారణ ఎన్నికలు వచ్చాయి. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి మెట్రో కార్పొరేషన్‌ యంత్రాంగం రూ.25 వేల కోట్ల వ్యయంతో ప్రిలిమనరీ డీపీఆర్‌ను సమర్పించింది. దీనిని సమీక్షించిన ప్రభుత్వం ఖర్చును దృష్టిలో ఉంచుకుని రాజధానిలోకి అండర్‌ గ్రౌండ్‌ విధానంలో లైట్‌మెట్రోను తీసుకు వెళ్లేందుకు నిర్ణయించిన ప్రతిపాదనను మార్చాలని సూచించినట్టు సమాచారం. ఆ తరువాత భూమి మీదనే ఎలివేటెడ్‌ విధానాన్ని ప్రతిపాదిస్తూ, రూ.15 వేల కోట్లకు ప్రాజెక్టు వ్యయాన్ని సవరించి నివేదికను అందచేశారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది. ప్రధాన పరిపాలన విశాఖపట్నం నుంచి జరపాలని నిర్ణయించడంతో అమరావతితో పాటు, విజయవాడ లైట్‌మెట్రో ప్రాజెక్టుకూ ప్రభుత్వ ప్రాధాన్యత తగ్గింది. డీపీఆర్‌ ను సమర్పించి చాలా కాలమైనా దీనిపైన ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నాన్చుతోంది. ఈ అంశాన్ని దాదాపు పక్కన పెట్టేసినట్టేనని అధికార వర్గాలలో కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది. 

Updated Date - 2020-06-02T08:55:21+05:30 IST