హైదరాబాద్‌లో Metro బంద్

ABN , First Publish Date - 2022-06-17T18:52:32+05:30 IST

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఆందోళనలతో నగరంలో మెట్రో సేవలు నిలిచిపోయాయి. నగరంలో అని సర్వీసులను నిలిపివేసినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.

హైదరాబాద్‌లో Metro బంద్

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఆందోళనలతో నగరంలో మెట్రో సేవలను నిలిచిపోయాయి. నగరంలో అన్ని సర్వీసులను నిలిపివేసినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. అన్ని మెట్రో స్టేషన్ల గేట్లను అధికారులు మూసివేశారు. దీంతో మెట్రో  కోసం వచ్చిన ప్రయాణికులు గేట్ల మూసి ఉండటంతో వెనక్కి  తిరిగివెళ్తున్నారు. దూరప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా మెట్రో సేవల నిలిపివేతపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో నిలిపివేతతో ఆర్టీసీ, ఆటోలలో జనం కిక్కిరిసి వెళ్తున్న పరిస్థితి నెలకొంది. 


మరోవైపు సికింద్రాబాద్ ఆందోళనలతో అప్రమత్తమైన రైల్వే శాఖ దాదాపు 71 రైళ్లను నిలిపివేసింది. పలు రైళ్లను దారి మళ్లించింది. అలాగే ఎంఎంటీఎస్ రైళ్లను  రైల్వే శాఖ పూర్తిగా రద్దు చేసింది. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా... జంట నగరాల్లోని పలు రైల్వేస్టేషన్‌లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే రాష్ట్రంలోని కాజీపేట, వరంగల్, జనగామ, మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లలో పోలీసులు భారీగా మోహరించారు. అనుమానితులను లోపలికి అనుమతించడం లేదు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లే దారులన్నీ మూసేశారు. బస్సులను సైతం స్టేషన్ వైపునకు అనుమతించడం లేదు.


కాగా... ఆర్మీలో ప్రవేశపెట్టనున్న అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ సికింద్రబాద్ రైల్వే స్టేషన్‌లో ఆర్మీ అభ్యర్థులు తీవ్రస్థాయిలో ఆందోళలను చేపట్టారు. రైల్వేస్టేషన్‌ను రణరంగంగా మార్చారు. రైళ్లపై రాళ్ల దాడి చేయడంతో పాటు, మూడు రైళ్లకు నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించారు. దీంతో ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు కాల్పులు జరుపగా... ఒకరు మృతి చెందారు. పలువురు గాయపడగా వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2022-06-17T18:52:32+05:30 IST