మీటర్ల మాయగాళ్లు..ఒకచోట అడ్రస్‌.. మరోచోట మీటరు..!

ABN , First Publish Date - 2021-10-11T04:47:53+05:30 IST

మీటర్ల మాయగాళ్లు..ఒకచోట అడ్రస్‌.. మరోచోట మీటరు..!

మీటర్ల మాయగాళ్లు..ఒకచోట అడ్రస్‌.. మరోచోట మీటరు..!

ట్రాన్స్‌కోలో అక్రమాల పర్వం

మినిమం బిల్లింగ్‌తో మోసాలు

ఎప్పటికప్పుడు కొత్తవి పెడుతూ ఏమారుస్తున్న వైనం

పలుమార్లు తనిఖీల్లో బహిర్గతమవుతున్న అక్రమాలు


ఖమ్మం నగరంలోని ఇల్లెందురోడ్డులో గతంలో ఓ బార్‌ ఉన్న చోట ప్రస్తుతం ఓ బేకరీ నడుస్తోంది. ఆ దుకాణానికి ఇచ్చింది కమర్షియల్‌ విద్యుత్‌ మీటర్‌. కానీ సదరు దుకాణ యజమాని చెల్లించేది మాత్రం ప్రతి నెలా రూ. వెయ్యి మాత్రమే. అయితే ఇటీవల తనిఖీ చేసిన ఉన్నతాధికారులు అవాక్కయ్యారు. అసలు ఆ మీటర్‌కు ఆ దుకాణానికి సంబంధం లేదని తెలిసింది. దాంతో ఆరా తీసిన అధికారులకు మరిన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 2015లో బార్‌ నడిపినా.. అప్పటి నుంచి మినిమం చార్జిలనే చెల్లిస్తూ వస్తున్నారు. అంతేకాదు.. అసలు అక్కడ ఏర్పాటు చేసిన మీటరుతో కలిపి మరో రెండు మీటర్లు మార్చినట్టు అధికారుల విచారణలో తేలింది. అంతేనా అసలు ఆ మీటర్లు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా తెలియని పరిస్థితి.


ఇల్లెందు రోడ్డులోని  ఒకప్పటి బార్‌ ప్రస్తుత బేకరీ దుకాణానికి సమీపంలోని ఓ ఇంట్లో ఏర్పాటు చేసిన మీటర్‌కు కూడా గత కొన్నేళ్లుగా కనీస చార్జీలనే చెల్లిస్తూ వస్తున్నారు. అయితే సదరు మీటరు నెంబరును పరిశీలిస్తే అది ఆ చిరునామాలో కాకుండా మరో ప్రాంతంలోని ఇంటికి సంబంధించినదిగా చూపుతోంది. అక్కడకు వెళ్లి పరిశీలించిన అధికారులకు ఆ ఇంట్లో కొత్త మీటరు దర్శనమిచ్చింది. కాగా ఆ ఇంటికి ఒక మీటరు ఉండగా.. కొత్త మీటరు ఎలా మంజూరు చేశారు? కనీస చార్జీలు ఎన్నేళ్లుగా చెల్లిస్తున్నారనే విషయంపై విచారణ జరుగుతోంది. 


గతంలో భద్రాచలంలోని గొందెల వారి సందులో ఓ మీటరుపై రూ.2.25లక్షలు బిల్లు చెల్లించే విషయమై వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారించగా.. సంబంధిత మీటరు మరో ప్రాంతం నుంచి తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేసినట్టు తెలియడంతో అందుకు బాధ్యుడిని చేస్తూ ఒక లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేశారు. కాగా మీటర్ల మార్పునకు సంబధించి సుమారు రెండు నెలలపాటు విచారణ సాగిన అనంతరం పోలీసులు ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. కాగా ఇలాంటి అక్రమాలు ఉమ్మడి జిల్లాలో నిత్యం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కొందరు అధికారుల కాసుల కక్కుర్తి.. మరికొందరు వినియోగదారులకు శాపంగా మారుతోంది. ట్రాన్స్‌ కో పనిచేస్తున్న కొందరు సిబ్బంది మీటర్లు మార్చి అక్రమాలకు పాల్పడుతున్న సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 


ఖమ్మం:  ఒక చోట ఉండాల్సిన మీటరు మరోచోట ఉండటం.. ఓ దుకాణంలో ఉన్న మీటరుకు అసలు నెంబరు లేకపోవడం.. మార్చిన మీటర్లు ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారో తెలియదు.. తీసేసిన పాత మీటర్లు ఏమవుతున్నాయో తెలియనివ్వరు. ఇవి ప్రస్తుతం ట్రాన్స్‌కో లోని విద్యుత్‌ వినియోగ చార్జీల వసూలు విషయంలో జరుగుతున్న అక్రమాలు. సామాన్య మానవుడికి ఒక్క మీటరు ఇవ్వాలంటే వంద రకాల కొర్రీలు పెట్టే శాఖ అధికారులకు ఆయా మీటర్ల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని తెలిసినా బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా గతంలో భద్రాచలంలో వెలుగులోకి వచ్చిన మీటర్ల మాయాజాలం కావొచ్చు.. ఇటీవల ఖమ్మం నగరంలో తనఖీల్లో బహిర్గతమైన మరికొన్ని మీటర్లు దానికి నిదర్శనంగా నిలుస్తుండగా.. కేవలం వారి దృష్టికి వచ్చిన, ఎవరైనా ఫిర్యాదులు చేసిన వాటిపైనే గుట్టుచప్పుడు కాకుండా చర్యలకు ఉపక్రమించడం పలు రకాల ఆరోపణలకు తావిస్తోంది. 


మీటర్లు మాయం...

గృహ, వాణిజ్యం వినియోగం ఏదైనా మీటర్లు పొందిన తర్వాత ప్రతి నెల వినియోగదారులు వాడిన యూనిట్ల ఆధారంగా బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. అయితే స్పాట్‌ బిల్లర్లు ఆయా మీటర్లకు సంబంధించి బిల్లులు తీస్తూ ఉంటారు. ఆయా మీటర్లలో ప్రతి నెలా ఎన్ని యూనిట్లు వినియోగించారన్నది వారికి పూర్తిస్థాయి అవగాహన ఉంటుంది. దాన్నే అదునుగా సుకుంటున్న కొందరు స్పాట్‌ బిల్లర్లు అత్యధికంగా బిల్లులు వచ్చే వినియోగదారులతో కుమ్మక్కయి అక్రమాలకు పాల్పడుతున్నారు. వినియోగదారుల నుంచి ప్రతి నెలా ముడుపులు అందుకుని వేలల్లో రావాల్సిన బిల్లులను కాస్తా వందల్లో వేస్తున్నారు. అలా ఏళ్ల తరబడి సాగుతున్న ఈ దందాలో ఏకంగా మీటర్లనే మాయం చేస్తున్నారు. మీటర్లను మార్చి ఉన్నతాధికారులను ఏమారుస్తున్నారు. పాత మీటర్ల  స్థానంలో కొత్త మీటర్లను ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుండగా.. అసలు పాతవి ఎటుపోతున్నాయి? కొత్తవి ఎక్కడినుంచి వస్తున్నాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అలా ఒకటి కాదు రెండు ఒకే దుకాణానికి సంబంధించి మూడు మీటర్లు మార్చిన ఘటనతో విద్యుత్‌ శాఖలో మరోసారి కలకలం రేపింది. కాగా ప్రస్తుతం ఉన్న మీటర్లను పరిశీలిస్తే ఈబీఎస్‌ (ఎనర్జీ బిల్లింగ్‌ సిస్టం)లో అవి ట్రేస్‌ అవ్వకపోవడం గమనార్హం. కాగా పాడయిపోయిన మీటర్లను బాగుచేయించి ఆయా మీటర్లను ఇలాంటి అక్రమాలకు వాడుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. అయితే మీటర్ల మార్పుకు సంబంధించిన కేసుల్లో ఒకరిద్దరు చేసిన తప్పిదానికి ఇతర సిబ్బంది సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నట్టు తెలుస్తోంది. 


ఉన్నతాధికారులకు తెలియకుండానే జరుగుతోందా? 

అయితే ఈ అక్రమాల్లో కొందరు అధికారుల పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారికి తెలియకుండా మీటర్ల మార్పిడి ఎలా సాధ్యమన్న వాదన వినిపిస్తోంది. మీటర్ల మార్పిడి సంబంధించి ఇటీవల ఖమ్మం నగరంలో వెలుగులోకి వచ్చిన ఓ మీటరు మరో ఇంటి అడ్రస్‌ పేరు మీద ఉండగా.. అక్కడకు వెళ్లి విచారించిన తనిఖీ అధికారులకు ఆ ఇంటికి కొత్త మీటరు ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. అయితే ఉన్నతాధికారులకు తెలియకుండా కొత్త మీటర్లు ఎలా బయటకు వచ్చాయనే విషయంలో పలు రకాల విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కడైనా కొత్త మీటరు ఇవ్వాలంటే లైన్‌ ఇన్‌స్పెక్టర్‌  నుంచి ఏఈ వరకు అధికారులు పరిశీలించిన తర్వాతనే మీటరు మంజూరు చేస్తారు. ఆయా ప్రాంతంలో స్తంభాలున్నాయా? లేవా? లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని కొత్త కనెక్షన్లు ఇస్తూ ఉంటారు. అంతటిస్థాయిలో పరిశీలించే అధికారులకు మార్చిన మీటర్ల స్థానంలో కొత్త మీటర్లు ఏర్పాటు చేసే విషయం తెలియకుండా ఎలా ఉంటుందన్న ప్రశ్న తలెత్తుతోంది.


అయితే ప్రతి మూడు, నాలుగు నెలలకోసారి లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి వ్యక్తి బిల్లింగ్‌కు వెళ్లాల్సి ఉండగా.. ఎక్కడైతే మీటర్ల మార్పిడి జరిగిన ఇళ్లు ఉన్నాయో.. అక్కడ అంతకుముందే బిల్లు కొట్టారని చెబుతుండగా.. సంబంధిత స్పాట్‌ బిల్లర్లను సంప్రదించిన సమయంలో తామే బిల్లింగ్‌ చేసినట్టు చెప్పడంతో ఆయా సిబ్బంది వెనుదిరుగుతున్నట్టు సమాచారం. నిత్యం పర్యవేక్షించాల్సిన ఏఈ స్థాయి అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ అక్రమాల వ్యవహారంలో తమకు సంబంధంలేని కొందరు కిందిస్థాయి సిబ్బంది బలవుతున్నట్టుగా తెలుస్తోంది. అంతేనా ఇలాంటి మీటర్లు ఉమ్మడి జిల్లాలో వందలసంఖ్యలో ఉంటాయన్న చర్చ సాగుతోండగా.. దొరికినోడే దొంగ అన్న రీతిలో వ్యవహారం సాగుతున్నట్టు తెలుస్తోంది. దానికితోడు గుట్టచప్పుడు కాకుండా విచారణ నిర్వహించడం కూడా విమర్శలకు తావిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని మీటర్లపై స్పెషల్‌ డ్రైవ్‌ పెట్టాలని, ప్రాంతాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి విచారణ చేపడితే బోలెడన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2021-10-11T04:47:53+05:30 IST