కేంద్రం చెప్పిందా!

ABN , First Publish Date - 2020-09-05T08:47:17+05:30 IST

రైతు గుండెల్లో ‘మీటర్‌ డర్‌’ మొదలైంది. రాజకీయంగా ఇదో వివాదంగా మారింది.

కేంద్రం చెప్పిందా!

పంపు సెట్లకు మీటర్లపై రాష్ట్రం సాకులు 

మినిట్స్‌ కాపీలో మీటర్ల మాటే లేదు

రైతుకు నగదు బదిలీ తప్పనిసరి కాదు

డిస్కమ్‌లకే నేరుగా ఇచ్చే వెసులుబాటు

అయినా... కేంద్రం పేరిట ‘సంస్కరణలు’

లెక్క తేల్చేందుకు ఇతర మార్గాలున్నా

మీటర్ల ఏర్పాటుపైనే ప్రత్యేక ఆసక్తి


‘‘రైతులకు ఉచిత విద్యుత్తు కొనసాగుతుంది. వారిపై పైసా కూడా భారం పడదు. కేవలం... కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు అమలు చేసేందుకే వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగిస్తున్నాం. నగదు బదిలీ చేస్తున్నాం!’’

...ఇది రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాట! 


ఇది నిజంగా నిజమేనా! మీటర్లు బిగించాలని... రైతుల ఖాతాలకు  నగదు బదిలీ చేసి, ఆపై వారి ప్రమేయం లేకుండానే డిస్కమ్‌లకు వెళ్లిపోయే వ్యవస్థ ప్రవేశపెట్టాలని కేంద్రం చెప్పిందా? లేక... రాష్ట్రం చేయాలనుకున్నది చేసేసి, కేంద్రంపైకి నెపం నెడుతోందా? మీటర్లు, నగదు బదిలీ విషయంలో కేంద్రం ఏం చెప్పింది? ఒక్కసారి చూద్దాం...


(అమరావతి - ఆంధ్రజ్యోతి): రైతు గుండెల్లో ‘మీటర్‌ డర్‌’ మొదలైంది. రాజకీయంగా ఇదో వివాదంగా మారింది. అప్పుడెప్పుడో చంద్రబాబు ‘వ్యవసాయ కనెక్షన్లకు మీటర్‌’ పెడతామన్నప్పుడు... వైఎస్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ భారీ ఉద్యమమే నడిపింది. దీంతో చంద్రబాబు ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు... మళ్లీ విద్యుత్‌ సంస్కరణల పేరిట జగన్‌ సర్కారు పంపుసెట్లకు మీటర్లు పెట్టి, నగదు బదిలీ అమలు చేయాలని నిర్ణయించింది. ‘కేంద్రం చెప్పింది. మేం చేస్తున్నాం’ అంటోంది. అసలు విషయమేమిటంటే.... పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదు. రైతుల ఖాతాలకు నగదు బదిలీ చేయాలని కూడా నిర్దేశించలేదు. సబ్సిడీ మొత్తాన్ని డిస్కమ్‌లకు ఎప్పటికప్పుడు చెల్లించి... వాటిని ఆర్థికంగా నిలబెట్టాలన్నది మాత్రమే కేంద్ర ప్రభుత్వం విధించిన షరతు. ఈ ఏడాది జూలై 3వ తేదీన జరిగిన అన్ని రాష్ట్రాల విద్యుత్‌ మంత్రుల సమావేశంలో కేంద్రం ఈ విషయంపై పూర్తి స్పష్టత ఇచ్చింది. ఈ సమావేశం తాలూకు మినిట్స్‌ కాపీలో ఎక్కడా ‘మీటరు’ అనే మాటే లేదు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి తీరాలని కేంద్రం ఆదేశించలేదు... సూచనా చేయలేదు.


అయినా సరే... సంస్కరణల పేరిట రాష్ట్రంలోని దాదాపు 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించి తీరతామని జగన్‌ సర్కారు తేల్చి చెబుతోంది! దీని ఉద్దేశమేమిటో, మతలబు ఏమిటో అర్థం కావడంలేదు. విద్యుత్‌ మంత్రుల సమావేశం మినిట్స్‌ కాపీలోని 7.5 పేరాగ్రా్‌ఫలో సబ్సిడీ/నగదు బదిలీ గురించి వివరంగా చెప్పారు. అందులో ఏముందంటే... ‘‘రాయితీని నగదు బదిలీ విధానంలో అమలు చేయడంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, రికవరీలో సవాళ్లు  ఎదురవుతాయని, ఈ ప్రక్రియ వల్ల ఖర్చు కూడా పెరుగుతుందని కొన్ని రాష్ట్రాలు అభిప్రాయపడుతున్నాయి. అందువల్ల సబ్సిడీని నేరుగా రైతు ఖాతాకు బదిలీ చేయవచ్చు. లేదా... డిస్కమ్‌కు చెల్లించవచ్చు. డిస్కమ్‌లకు సరైన సమయంలో ప్రభుత్వాలు సబ్సిడీ మొత్తాన్ని చెల్లించకపోవడమే అసలు సమస్య. దీనివల్ల... డిస్కమ్‌లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఇది మొత్తం విద్యుత్‌ పంపిణీ ప్రక్రియపైనే ప్రభావం చూపుతోంది. విద్యుత్‌ రంగంలో నగదు బదిలీ వల్ల ఎనర్జీ ఆడిటింగ్‌ మెరుగవుతుంది. డిస్కమ్‌లకు సకాలంలో చెల్లింపులు జరుగుతాయి.’’ దీనిని బట్టి చూస్తే... కచ్చితంగా రైతు ఖాతాకే డబ్బులు జమ చేయాలని కేంద్రం చెప్పలేదు.


దీనిని ‘ఒక ఆప్షన్‌’గా మాత్రమే సూచించింది. రాయితీ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం నేరుగా డిస్కమ్‌లకే చెల్లించవచ్చు. అయినప్పటికీ, రైతుల ఖాతాలో డబ్బులు వేసి, అది ఆ తర్వాత రైతుల ప్రమేయం లేకుండానే డిస్కమ్‌లకు నగదు బదిలీ అయ్యేలా చూస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సకాలంలో సబ్సిడీ బిల్లులు అందక డిస్కమ్‌లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయని... ఆ పరిస్థితి రాకుండా నెలనెలా విద్యుత్‌ సబ్సిడీ బిల్లులను డిస్కమ్‌లకు చెల్లించేందుకే ఈ విధానం అమలు చేయాలని మినిట్స్‌లో ఉంది.  


మరో మార్గం లేదా?

‘ఏట్లో వేసినా... ఎంచి వేయాలి’ అనేది పెద్దలు చెప్పే సామెత. అందువల్ల... వ్యవసాయానికి ఎంత విద్యుత్తు ఖర్చవుతుందనే స్పష్టత కోసమే పంపుసెట్లకు మీటర్లు పెడుతున్నామని సర్కారు వారు చెబుతున్నారు.  ఇందులో ఎంత నిజముందో తెలుసుకుందాం! వ్యవసాయ విద్యుత్‌ వినియోగం తెలుసుకునేందుకు సంబంధిత ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద మీటర్‌ రీడింగ్‌ నమోదు చేయాలని... గ్రామాల వారీగా సాధ్యంకాకపోతే మండలాల స్థాయిలోనైనా ఈ పని చేయాలని విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ రాష్ట్ర పభ్రుత్వానికి ఎప్పుడో సూచించింది. దీనిని పట్టించుకోకుండా... ఇప్పుడు ప్రతి వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌కు మీటర్లు పెడతామంటుండటం గమనార్హం! ‘‘నగదు బదిలీ రూపంలో రైతుల ఖాతా నుంచి డిస్కమ్‌లకు డబ్బులు వెళతాయి. బిల్లులు చెల్లిస్తున్నందున విద్యుత్‌ నాణ్యతపై రైతులకు అధికారులను నిలదీసే హక్కు ఉంటుంది. అధికారులు కూడా మరింత బాధ్యతగా వ్యవహరిస్తారు’’ అని సర్కారు పెద్దలు మరో కొత్త మాట చెప్పారు. ఇది మరీ చిత్రంగా ఉందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే... రైతు ఖాతాలో జమ అయిన సొమ్ము... వారి ప్రమేయం లేకుండా క్షణాల్లోనే డిస్కమ్‌లకు వెళ్లిపోతుంది.


అంటే... ఆ డబ్బులపై రైతుకు ఎలాంటి నియంత్రణ ఉండదు. విద్యుత్‌ సరఫరాలో లోపం తలెత్తి, ఈ విషయం తేలేదాకా  బిల్లు చెల్లించకూడదని రైతు నిర్ణయించుకున్నా ఫలితం ఉండదు. అలాంటప్పుడు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం విద్యుత్‌ అధికారులను నిలదీసే హక్కు రైతుకు ఎక్కడి నుంచి, ఎలా వస్తుంది?  ప్రభుత్వ పెద్దల మాట నమ్మి తమకు హక్కు ఉందని రైతులు ప్రశ్నిస్తే...విధి నిర్వహణలో ఉన్న అధికారిపై దౌర్జన్యం చేశారంటూ కేసులు పెడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2020-09-05T08:47:17+05:30 IST