వృద్ధురాలికి అర్ధరాత్రి భారీ షాక్.. ప్రశాంతంగా నిద్రపోతుంటే.. ఇంటిపైకప్పును చీల్చుకుంటూ ఒక్కసారిగా..

ABN , First Publish Date - 2021-10-15T02:05:21+05:30 IST

కెనడాలో నివసించే ఓ వృద్ధురాలికి ఇటీవల తృటిలో ప్రాణాపాయం తప్పింది. అర్ధరాత్రి ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో ఊహించని విధంగా ఆకాశంపై నుంచి ఓ ఉల్క రాలి ఆమె మంచంపై పడింది.

వృద్ధురాలికి అర్ధరాత్రి భారీ షాక్.. ప్రశాంతంగా నిద్రపోతుంటే.. ఇంటిపైకప్పును చీల్చుకుంటూ ఒక్కసారిగా..

ఇంటర్నెట్ డెస్క్: కెనడాలో నివసించే ఓ వృద్ధురాలికి ఇటీవల తృటిలో ప్రాణాపాయం తప్పింది. అర్ధరాత్రి ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో ఊహించని విధంగా ఆకాశం నుంచి ఓ ఉల్క రాలి ఆమె మంచంపై పడింది. పెద్ద శబ్దంతో ఇంటి పైకప్పు చీల్చుకుని ఆమె పక్కన ఉన్న దిండుపై పడింది. అయితే..అదృష్టవశాత్తూ ఆమెకు ఈ ఘటనలో ఎటువంటి అపాయం కలుగలేదు. బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలో నివసించే రూత్ హామిల్టన్ అక్టోబర్ 3న ఎదుర్కొన్న దారుణ అనుభవం ఇది. 


‘‘ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించడంతో నాకు మెలకువ వచ్చింది. అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఇల్లంతా చీకటిగా ఉండటంతో లైట్ వేశాను. అప్పుడు నాకు మంచంపై ఉన్న రాయి కనిపించింది. తలపైకెత్తి చూస్తే పైకప్పుకు చిల్లు కనిపించింది. మొదట నాకు అసలేమీ అర్ధం కాలేదు’’ అని రూత్ స్థానిక మీడియాతో తెలిపింది. దీంతో.. ఆమె పోలీసులకు సమాచారం  అందించింది. అయితే.. వారు కూడా ఇంట్లో రాయి పడిందేమోనని భావించారు. ఆమె ఇంటికి కొద్ది దూరంలో భవన నిర్మాణపనులు జరుగుతుండటంతో అక్కడి నుంచి రాయి ఎగిరి ఇలా పడి ఉంటుందని అనుమానించారు. 


అయితే..వారు చేపట్టిన విచారణలో అటువంటిదేమీ జరగలేదని తేలింది. దీంతో.. అది ఉల్క అయి ఉంటుందని చివరికి వారు నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటన కారణంగా మొదట్లో బెదిరిపోయిన రూత్.. ఆ తరువాత మాత్రం తేరుకుంది. అంతరిక్షం నుంచి వచ్చిన ఈ బహుమతిని జీవితాంతం తన దగ్గరే పెట్టుకుంటానని తెలిపింది. ఈ ఘటన ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. 

Updated Date - 2021-10-15T02:05:21+05:30 IST