దేవదాయ శాఖలో గలీజు

ABN , First Publish Date - 2022-06-30T06:02:52+05:30 IST

దేవదాయ శాఖ ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా దీర్ఘకాలిక లీజుకు అప్పగిస్తున్నారు. కొంతమంది అధికారులు విశాఖపట్నం నుంచి మరో ప్రాంతానికి బదిలీ అయ్యేలోపు అన్నీ చక్కబెట్టేసుకోవాలని ఆత్రం ప్రదర్శిస్తున్నారు. ఫైళ్లు పట్టుకుని విజయవాడలోని కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లి దగ్గరుండి సంతకాలు చేయించి తీసుకువస్తున్నారు. అసలు బహిరంగ వేలం వేయకుండా 11 ఏళ్లకు దీర్ఘకాలిక లీజుకు ఆస్తులు ఎలా ఇస్తున్నారంటే...చట్టంలో అవకాశం ఉందంటున్నారే తప్ప..వేలం వేయకపోవడానికి గల కారణాలు వెల్లడించడం లేదు. ఇదిగో ఇలా...

దేవదాయ శాఖలో గలీజు
పాయకరావు పేట లో పాండురంగ స్వామి ఆలయం షాపులు

 వేలం వేయకుండానే భూములు, దుకాణాలు అప్పగింత

పదకొండేళ్ల దీర్ఘకాలిక లీజుకు ధారాదత్తం

స్వయంగా ఫైళ్లు తీసుకువెళ్లి సంతకాలు చేయించుకుని మరీ తీసుకువస్తున్న

కింది స్థాయి నుంచి పైవరకూ వాటాలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

దేవదాయ శాఖ ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా దీర్ఘకాలిక లీజుకు అప్పగిస్తున్నారు. కొంతమంది అధికారులు విశాఖపట్నం నుంచి మరో ప్రాంతానికి బదిలీ అయ్యేలోపు అన్నీ చక్కబెట్టేసుకోవాలని ఆత్రం ప్రదర్శిస్తున్నారు. ఫైళ్లు పట్టుకుని విజయవాడలోని కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లి దగ్గరుండి సంతకాలు చేయించి తీసుకువస్తున్నారు. అసలు బహిరంగ వేలం వేయకుండా 11 ఏళ్లకు దీర్ఘకాలిక లీజుకు ఆస్తులు ఎలా ఇస్తున్నారంటే...చట్టంలో అవకాశం ఉందంటున్నారే తప్ప..వేలం వేయకపోవడానికి గల కారణాలు వెల్లడించడం లేదు. ఇదిగో ఇలా...


- లంకెలపాలెంలో పరదేశమ్మ ఆలయానికి సర్వే నంబర్‌ 189లో 10.13 ఎకరాలు ఉంది. అందులో ఎకరా స్థలంలో ఐస్‌క్రీమ్‌ ఫ్యాక్టరీ పెట్టుకున్న వారిని లీజు తక్కువ ఇస్తున్నారని, జరిమానా వేసి భయపెట్టారు. ఆ తరువాత అడ్డగోలు ఒప్పందం చేసుకొని 11 ఏళ్లకు లీజుకు ఇచ్చేశారు. ఆ పక్కనే మరో వ్యక్తి ఇంకో మూడు ఎకరాలు ఆక్రమించాడు. అతను కూడా దీర్ఘకాలిక లీజుకు యత్నిస్తున్నాడు. ఆ ఫైల్‌ విజయవాడ కమిషనర్‌ కార్యాలయానికి చేరింది.

- చోడవరంలో స్వయంభూవిఘ్నేశ్వర ఆలయానికి మెయిన్‌రోడ్డులోనే షాపులు ఉన్నాయి. వారిని కూడా ముందు అద్దెలు పెంచాలని, ఖాళీ చేసేయాలని బెదరగొట్టారు. వారు కాళావేళ్లా పడి నజరానాలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకోవడంతో గత నెలలో వారికి కూడా 11 ఏళ్ల లీజుకు ఆ షాపులను ఇచ్చేశారు. వేలం వేయకుండా ఎలా ఇస్తున్నారని కమిషనరేట్‌ అధికారులు ప్రశ్నించలేదు.

- పాయకరావుపేటలో పాండురంగస్వామి ఆలయానికి 17 షాపులు ఉన్నాయి. వారిని కూడా అనేకసార్లు బెదిరించారు. లొంగకపోవడంతో పోలీసులతో వెళ్లి దుకాణాలను స్వాధీనం చేసుకున్నారు. వారు గత్యంతరం లేక న్యాయస్థానాన్ని ఆక్రమించి స్టే తెచ్చుకున్నారు. ఎన్నాళ్లు అలా ఉంటారో చూస్తామని హెచ్చరించారు. 11 ఏళ్ల లీజుకు తీసుకుంటే...ఈ కష్టాలు ఏమీ ఉండవు కదా? అని రాయబేరాలు నడపడంతో వారిలో కొందరు రాజీకి వచ్చారు. ప్రస్తుతం వారి ఫైల్‌ విజయవాడ కమిషనరేట్‌కు చేరింది. వారం, పది రోజుల్లో వారికి కూడా వేలం లేకుండా దీర్ఘకాలిక లీజు వచ్చేస్తుందని తెలిసింది.


- ఎలమంచిలిలో మెయిన్‌రోడ్డును ఆనుకొని దేవదాయ శాఖకు దాతలు ఇచ్చిన ఎకరా స్థలంలో ఎల్లపు చౌలీ్ట్ర ఉంది. దానిపై స్థానిక అధికార పార్టీ నేతలు కన్నేశారు. ప్రస్తుతం దానిని దేవదాయ శాఖ అధికారులే శుభకార్యాలకు అద్దెకు ఇస్తున్నారు. దానిని తమకు ఇస్తే కొత్త ఏసీ కల్యాణ మండపం నిర్మించి, అక్కడ వ్యాపారం చేసుకుంటామని నేతలు అడిగారు. అక్కడ కూడా అధికారులు ముందు రూల్స్‌ మాట్లాడారు. ఆ కల్యాణ మండపానికి డిమాండ్‌ ఎక్కువ ఉందని, ఇంకా చాలామంది అడుగుతున్నారని చర్చలు జరిపారు. చివరకు డీల్‌ కుదుర్చుకొని వేలం లేకుండా 11 ఏళ్లకు ఇచ్చేయడానికి ఫైల్‌ సిద్ధం చేశారు. విశాఖ జిల్లా నుంచి బదిలీపై వెళ్లిపోయే లోపు వీటన్నింటినీ దీర్ఘకాలిక లీజులు ఇప్పించాలని పెద్దస్థాయిలో యత్నిస్తున్నారు. ఈ వ్యవహారాలకు కమిషనరేట్‌లోని కొందరు ఉన్నతాధికారులు కూడా సహకరిస్తున్నారు. వారికి కూడా కొంత మొత్తం ముట్టజెబుతున్నామని లీజుకు దరఖాస్తు చేసిన పలువురు దుకాణదారులు చెబుతున్నారు. నచ్చినవారికి ఒకలా, నచ్చని వారికి మరొకలా నిబంధనలు అమలు చేయడం దారుణమని, దేవదాయ శాఖ ఏ ఆస్తి అయినా వేలం ద్వారానే లీజుకు ఇవ్వాలని మిగిలిన దుకాణదారులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2022-06-30T06:02:52+05:30 IST