Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇంకా 9 రోజులే!

- విలీనం, పదోన్నతులు, సర్దుబాట్లతో ఉక్కిరిబిక్కిరి

- ఉన్నత పాఠశాలల్లోకి 3, 4, 5 తరగతుల విద్యార్థులు

- సౌకర్యాలు కల్పించకుండానే విలీనం

- విద్యాశాఖలో గజిబిజి వాతావరణం

(ఇచ్ఛాపురం రూరల్‌)

విద్యాశాఖలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు ఉన్నత పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విలీనం. మరోవైపు సీనియార్టీ ప్రకారం ఉపాధ్యాయుల పదోన్నతులు. ఇంకోవైపు ఎయిడెడ్‌ పాఠశాలల పిల్లలు, ఉపాధ్యాయుల సర్దుబాటుకు విద్యాశాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియలన్నీ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. తక్కువ సమయం ఉండడంతో ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. నవంబరు 1 నుంచి నూతన విద్యావిధానం అమలుకానుంది. దీనిలో భాగంగా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు 250 మీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను విలీనం  చేయాలి. ఈ లెక్కన జిల్లాలో 145 ప్రాథమిక పాఠశాలలకు చెందిన 3, 4, 5 తరగతులు ఉన్నత పాఠశాలల పరిధిలోకి వెళ్లనున్నాయి. ఆ పాఠశాలల్లోని సెకండరీ గ్రేడ్‌ టీచర్ల(ఎస్జీటీ)లో జూనియర్లను గుర్తించి వారిని కూడా మూడు నుంచి ఐదు తరగతుల బోధనకు సర్దుబాటు చేయనున్నారు. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ప్రభుత్వం చెబుతోంది. విద్యార్థుల విలీనం గురించే ఆలోచిస్తున్నారు తప్ప ఉపాధ్యాయుల కొరతపై దృష్టి సారించడం లేదని ఉపాధ్యాయ సంఘాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


241 పాఠశాలల విలీనం

జిల్లాలో 241 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు.. ఉన్నత పాఠశాలల్లో విలీనం కానున్నాయి. ఉన్నత పాఠశాలల్లో గదుల సమస్య ఉంటే విలీనమయ్యే పాఠశాలలను అక్కడే కొనసాగిస్తారు. ఉపాధ్యాయులూ విద్యార్థులతో పాటే బదిలీ అవుతారు. బదిలీ అయ్యే వారితో పాటు స్థానికంగా కొనసాగే ఉపాధ్యాయుల సంఖ్యపై కసరత్తు జరుగుతోంది. నెలాఖరుకు స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉపాధ్యాయుల సర్దుబాటులో తేడాలేకుండా కసరత్తు కొనసాగుతోంది. 3, 4, 5 తరగతుల విద్యార్థులు ఉన్నత పాఠశాలల్లోకి వెళ్తే ప్రాథమిక పాఠశాలల్లో కేవలం 1, 2 తరగతులకు చెందిన విద్యార్థులే ఉంటారు.  ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు చొప్పున 1, 2 తరగతులను అప్పగించనున్నారు. 3 నుంచి 10 తరగతులు బోధించే వారికి వారానికి 32 బోధన కాలాంశాలు మించకుండా ప్రధానోపాధ్యాయులు చూడాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలల్లో అదనపు సౌకర్యాలు కల్పించకుండానే విలీన ప్రక్రియ ప్రారంభించారు. ఇది ఇబ్బందికరమని ఉపాధ్యాయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. 


పదోన్నతులు ఇలా.. 

ఇదివరకు సీనియార్టీ ప్రకారం ప్రతినెలా అర్హులైన వారికి గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సహాయకులుగా పదోన్నతులు కల్పించేవారు. రెండేళ్లు కొవిడ్‌తో గడిచిపోవడంతో ఈ పదోన్నతులు నిలిచిపోయాయి. ఈ నెలాఖరులోగా అడ్‌హాక్‌ పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ సీనియార్టీ జాబితా విడుదల చేసింది. ఈ నెల 25న గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. 29, 30వ తేదీల్లో పాఠశాల సహాయకులకు కౌన్సిలింగ్‌ ఉంటుంది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.


నెలాఖరుకు కసరత్తు పూర్తి 

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 3, 4, 5 తరగతులు ఉన్నత పాఠశాలల్లో విలీనం, ఉపాధ్యాయుల పదోన్నతులు, సర్దుబాటు, సౌకర్యాల కల్పన వంటివి ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు కృషిచేస్తున్నాం. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రక్రియ పూర్తిచేస్తాం.

- జి.పగడాలమ్మ, ఇన్‌చార్జి డీఈవో, శ్రీకాకుళం. 

Advertisement
Advertisement