నంగునూర్‌లో మెసొపొటేమియా ఆనవాళ్లు!

ABN , First Publish Date - 2021-03-06T08:47:07+05:30 IST

చారిత్రక ఆనవాళ్లకు ఆలవాలంగా నిలుస్తున్న సిద్దిపేట జిల్లా నంగునూరులో..

నంగునూర్‌లో మెసొపొటేమియా ఆనవాళ్లు!

టెర్రాకోట ఎద్దుతల, పెండెంట్‌ గుర్తింపు

హైదరాబాద్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): చారిత్రక ఆనవాళ్లకు ఆలవాలంగా నిలుస్తున్న సిద్దిపేట జిల్లా నంగునూరులో.. తాజాగా మధ్య ఆసియాకు చెందిన మెసొపొటేమియా నాగరికత కాలం నాటి ఒక టెర్రకోట బొమ్మ శిథిలం బయల్పడింది. ట్రెరకోటతో చేసిన ఎద్దు తల.. ఆ ఎద్దు మెడలో ఓ పెండెంట్‌ లభించినట్లు ‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ గుర్తించింది. అవి క్రీ.పూ 3000-1000 మధ్యకాలం నాటివని ఆ బృందానికి చెందిన హరగోపాల్‌ వివరించారు. 9 అంగుళాల పొడువైన ఆ ఎద్దు తల గ్రీకు కళాశైలిని పోలిఉంది. బొద్దుగా కనిపించే కొమ్ములు, పెద్ద ముక్కు పుటాలు, బలమైన ముక్కు ఎముక, చక్కటి కళ్లు ఉన్నాయి. ఆ ఎద్దు మెడలో ఉన్న పెండెంట్‌ను కూడా ఎర్రమట్టితో తయారు చేశారని, దానిపైన దారంతో మెడలో కట్టుకోవడానికి రంధ్రం ఉందని చెప్పారు. ఇది రోమన్‌ శైలిలో ఉందని, మెరిసే రంగురాయితో అలంకరించుకునేందుకు ఈ టెర్రకోట వస్తువుకు గుంట ఉన్నట్లు వివరించారు. ఈ బొమ్మ శిథిలం చాలా విలువైందని అన్నారు. ఇది శాతవాహనుల కాలం నాటి టెర్రకోట బొమ్మలను పోలి ఉందని చెప్పారు. మధ్యఆసియాకు చెందిన వారు నంగునూరు ప్రాంతానికి వచ్చి, వెళ్లారనే ఆధారాలు గతంలో లభించాయని, దీంతో.. తాజాగా లభించిన శిథిలాలు మెసొపొటోమియా కాలం నాటివేనని ప్రాథమికంగా నిర్ధారించామన్నారు. ఇక్కడ మరుకుక్కు గ్రామంలో ఇంతకు ముందు బయల్పడ్డ మెగాలిథిక్‌ సమాధులకు.. ఇరాక్‌లోని ఇర్కుక్‌ సమాధులకు పోలికలున్నాయని చరిత్రకారులు గుర్తించారని చెప్పారు.


చారిత్రక ఆధారాలెన్నెన్నో..

నంగునూరులోని పాటిగడ్డమీద వేల ఏళ్లనాటి చారిత్రక ఆధారాలు లభిస్తున్నాయి. కొత్త తెలంగాణ చరిత్ర బృందం క్షేత్రపరిశీలనలో.. రాతియుగం నాటి గొడ్డళ్లు, లోహయుగం నాటి బాణం ములికి, టెర్రకోట పూసలు, బొమ్మలు, పెండెంట్లతోపాటు శాతవాహనుల కాలానికి చెందిన గోటినొక్కుడు డిజైన్లు, ఎరుపు, నలుపు, నీలిరంగు కుండ పెంకులు, చిత్తడు బిల్లలు, ఇటుకలు, రాతి, ఇనప పనిముట్లు, గవ్వలు, తూనిక రాళ్లు బయటపడ్డాయి. దేవాలయాల శిథిలాలు, జైనులు, తీర్థంకరుల కాలం నాటి ఆనవాళ్ళు, వీరగల్లులను గుర్తించారు.

Updated Date - 2021-03-06T08:47:07+05:30 IST