కరుణించని వరుణుడు

ABN , First Publish Date - 2022-07-30T05:13:17+05:30 IST

వరుణుడు మొహం చాటేశాడు.. గత వారం రోజులుగా చినుకు జాడ లేదు. భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. దీంతో తడిలేక జిల్లాలో చాలాచోట్ల వరినారు మడులు ఎండిపోతున్నాయి.

కరుణించని వరుణుడు

  వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు

 ఎండుతున్న నారుమడులు

 బీటలు వారుతున్న పొలాలు 

  ఆందోళనలో రైతులు

 (గరుగుబిల్లి/భామిని)

వరుణుడు మొహం చాటేశాడు.. గత వారం రోజులుగా చినుకు జాడ లేదు. భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. దీంతో తడిలేక జిల్లాలో చాలాచోట్ల వరినారు మడులు ఎండిపోతున్నాయి.   ఉరుములు, మెరుపులే తప్ప వరుణుడు కరుణించకపోవడంతో అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు. నారుమడులను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. భామిని మండలంలో రైతులు ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా నీటిని తెచ్చుకుని పైపులతో పొలాల్లో నారుమడులను  తడుపుతున్నారు.  మండలంలోని  10 వేల ఎకరాల్లో వరి సాగు అవుతోంది. మూడు వేల ఎకరాల వరకు వరి ఎదలు వేశారు. మరో 500 ఎకరాల వరకు వ్యవసాయ బోర్లు ద్వారా నీరందుతుంది. అయితే చెరువులు, గెడ్డల్లో చుక్కనీరు లేకపోవడంతో 9,500 ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. మరో నాలుగైదు రోజుల్లో వర్షం పడకపోతే తీవ్రంగా నష్టపోనున్నట్లు రైతులు చెబుతున్నారు. మరోవైపు గరుగుబిల్లి మండలంలో తోటపల్లి పాత రెగ్యులేటర్‌ పరిధిలోని  భూములకూ సాగునీరందడం లేదు. దీంతో పంట పొలాలు ఎండుతున్నాయి.   కొద్ది రోజుల కిందట కురిసిన వర్షాలకు రైతులు ఉబాళ్లు చేసుకున్నారు. ప్రస్తుతం వర్షాలు కురవకపోవడం, సాగునీరు సరఫరా కాకపోవడంతో వరి నారుమడులు ఎండుతున్న పరిస్థితి ఉంది. ఉబాళ్లు చేసిన పొలాలు బీటలు వారుతున్నాయి.  బ్యారేజీ పరిధిలోని కుడి, ఎడమ కాల్వలకు ఈ నెల 21న సాగునీరు విడుదల చేశారు. అయితే కుడి కాలువకు సంబంధించి శివారు ప్రాంత భూములకు నీరు చేరక ముందే  24న సుంకి ప్రాంతంలో కాలువకు భారీ గండి పడింది.  ఒకవైపు సాగునీరు విడుదలలో ఆలస్యం, మరోవైపు గండ్లు కారణంగా రైతులు ఆందోళనకు లోనవుతున్నారు. మొత్తంగా 13 వేల ఎకరాలకు సాగునీరు అందని పరిస్థితి ఉంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు. 


  

Updated Date - 2022-07-30T05:13:17+05:30 IST