పొలంలోనే పంట రైతుకు చింత!

ABN , First Publish Date - 2020-03-29T11:44:13+05:30 IST

పొలంలో కర్భూజ పంటను చూపిస్తున్న రైతు పేరు పోలాకి కాళిదాసు. ఈయన స్వగ్రామం మెళియాపుట్టి

పొలంలోనే పంట రైతుకు చింత!

కుళ్లిపోతున్న కూరగాయలు, పండ్లు

లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన మార్కెట్లు, వాహనాలు

కొనుగోలుకు ముందుకు రాని వ్యాపారులు

అన్నదాత కుదేలు


(సోంపేట రూరల్‌/మెళియాపుట్టి/ఎల్‌ఎన్‌పేట): పొలంలో  కర్భూజ పంటను చూపిస్తున్న రైతు పేరు పోలాకి కాళిదాసు. ఈయన స్వగ్రామం మెళియాపుట్టి మండలం టకోయి. తనకున్న ఆరు ఎకరాల మెట్ట భూమిలో వ్యయప్రయాసలకోర్చి పంటను సాగుచేశాడు. ప్రస్తుతం పంట చేతికందుతుందనగా ‘లాక్‌ డౌన్‌’తో గ్రామానికి వాహనాలు రాని దుస్థితి. దీంతో పంట కుళ్లిపోతోందని కాళిదాసు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అప్పుచేసి పెట్టుబడి పెట్టానని..ఇప్పుడు ఏంచేయాలో తెలియడం లేదని కన్నీరుమున్నీరవుతున్నాడు. 


ఇలా రబీలో భాగంగా కూరగాయలు, పండ్ల రకాల పంటలు సాగుచేస్తున్న రైతులు కుదేలయ్యారు. సరిగ్గా పంట చేతికందుతుందనగా కరోనా ‘లాక్‌డౌన్‌’’ నిలువునా ముంచింది. రవాణా సౌకర్యం లేక పంట పొలంలోనే నిల్వ ఉండి కుళ్లిపోతోంది. ఖరీఫ్‌లో నష్టాన్ని రబీలో గట్టెక్కుదామన్న అన్నదాతల ఆశలు అడియాశలయ్యాయి.


ఇలా రబీలో భాగంగా కూరగాయలు, పండ్ల రకాల పంటలు సాగుచేస్తున్న రైతులు కుదేలయ్యారు. సరిగ్గా పంట చేతికందుతుందనగా కరోనా ‘లాక్‌డౌన్‌’’ నిలువునా ముంచింది. రవాణా సౌకర్యం లేక పంట పొలంలోనే నిల్వ ఉండి కుళ్లిపోతోంది. ఖరీఫ్‌లో నష్టాన్ని రబీలో గట్టెక్కుదామన్న అన్నదాతల ఆశలు అడియాశలయ్యాయి. 


ఈయన పేరు గార రాము. సోంపేట మండలం పలాసపురం ఈయన స్వగ్రామం. తనకున్న కొద్దిపాటి పొలంలో టమాట సాగుచేశాడు. పంట ఆశాజనకంగా ఉండడంతో ఆనందించాడు. కానీ లాక్‌డౌన్‌ పుణ్యమా అని పంట అమ్ముడుకాని పరిస్థితి. దీంతో పంట పొలంలోనే నిల్వ ఉండి కుళ్లిపోతోంది. పెట్టుబడులు పెట్టి సాగుచేశామని..ఇప్పుడు కళ్లెదుటే పంట నాశనమవుతున్నా ఏంచేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వస్తోందని రాము ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.


జిల్లాలో నదీ పరివాహక ప్రాంతాలు, కాలువలు, బోర్లు, బావులు అందుబాటులో ఉన్నచోట రబీలో భాగంగా  రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా కర్భూజ, బొప్పాయి, జామి వంటి పండ్ల రకాలను సైతం సాగుచేసి జీవనోపాధి పొందుతున్నారు. సంక్రాంతి తరువాత విత్తనాలు చల్లుకున్నారు. ప్రస్తుతం పంట చేతికందుతోంది. సాధారణంగా వ్యాపారులు గ్రామాలకు వచ్చి కొనుగోలు చేసి సమీప పట్టణాలు, నగరానికి తరలిస్తుంటారు. ఒడిశా సరిహద్దు పట్టణాలు వారు సైతం వచ్చి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. దీంతో మార్కెట్‌ కష్టాలు లేకుండా రైతులకు గడిచిపోయేది. అయితే ఈ ఏడాది పంట ఆశాజనకంగా ఉండడంతో రైతులు సంబరపడిపోయారు. కానీ ఇటీవల కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ప్రకటించిన ‘లాక్‌ డౌన్‌’ వారి ఆశలను నీరుగార్చింది. చేతిలో పంట ఉన్నా విక్రయించలేని దుస్థితి నెలకొంది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో సమీప పట్టణాలకు, మండల కేంద్రాలకు రైతులే తీసుకెళ్లి విక్రయించాల్సి వస్తోంది.


టమాట రైతుకు అపార నష్టం

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సోంపేట, కంచిలి మండలాల్లో రబీలో భాగంగా కూరగాయల సాగు అధికం. సోంపేట మండల కేంద్రంతో పాటు జింకిభద్ర, బెంకిలి, పలాసపురం, లక్కవరం, బారువ, కొర్లాం, పొత్రఖండ, తాళ్లభద్ర తదితర గ్రామాల్లో, కంచిలి మండల గోకర్నపురం, మధుపురం, శాసనం, జలంత్రకోట తదితర గ్రామాల్లో కూరగాయలు విస్తారంగా పండిస్తారు. చిన్నసన్నకారు రైతులు తమకున్న కొద్దిపాటి పొలంలో కూరగాయలు సాగుచేస్తుంటారు. ముఖ్యంగా టమాట సాగుకు ఈ ప్రాంతాలు పెట్టింది పేరు. ప్రతిరోజూ సేకరించే టమాట పంటను వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు కొనుగోలు చేసి తరలిస్తుంటారు. 28 కిలోల ట్రేలు (ప్టాస్టిక్‌) రైతులకు ముందుగానే అందిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం సేకరించిన పండ్లను ట్రేలో వేస్తారు. వ్యాపారులు వాహనాల్లో వచ్చి తీసుకెళ్తుంటారు. కానీ లాక్‌డౌన్‌ నేపథ్యంలో వాహనాలు రాని పరిస్థితి. దీంతో పొలాల్లోనే పంట కుళ్లిపోతోంది. కంచిలి, సోంపేట మండలాల్లో ప్రతిరోజూ వందలాది టన్నుల పంట నేలపాలవుతోంది. రూ.లక్షల్లో రైతులకు నష్టం కలుగుతోంది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.



Updated Date - 2020-03-29T11:44:13+05:30 IST