Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

బెల్లం బెంబేలు

twitter-iconwatsapp-iconfb-icon
బెల్లం బెంబేలు

పేరు చెబితేనే వ్యాపారుల హడల్‌

అమ్ముకొమన్నది వారే.. అరెస్టులు చేసేది వారే..

సారాను వదిలి మాపై ప్రతాపమా..?

హైకోర్టు ఉత్తర్వులున్నా ఇదేంటి..?

వర్తక సంఘాలు, ఆర్య వైశ్యుల మండిపాటు

బెల్లం అమ్ముతున్నాడని వ్యాపారి అరెస్ట్‌ 

రెండు రోజుల తర్వాత రైలు పట్టాలపై మృతదేహం

కొయ్యలగూడెం స్టేషన్‌ వద్ద వ్యాపారుల ధర్నా

పోస్టుమార్టం పూర్తి.. ఆదరాబాదరగా సెబ్‌ సీఐ ఆధ్వర్యంలో 

మృతదేహం పొంగుటూరు తరలింపు

తన భర్త చావుకు ఎక్సైజ్‌ అధికారులే 

కారణమంటూ భార్య ఫిర్యాదు(కొయ్యలగూడెం/జంగారెడ్డిగూడెం/భీమవరం క్రైం/ఏలూరు క్రైం/ ఆకివీడు/టి.నరసాపురం/ పోలవరం): శ్రావణమాసంలో పిండి వంటలకు, ఆహార పదార్థాలతో కలిసి ఎంతో తియ్యదనాన్ని ఇచ్చే బెల్లం పేరు చెబితే ప్రస్తుతం వ్యాపారులు హడలెత్తిపోతున్నారు. ఏ సమయంలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌) అధికారులు వచ్చి అరెస్టు చేసి తీసుకుపోతారోనన్న ఆందోళన వారిని కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఇటీవల నాటు సారా విక్రయాలు, తయారీ కేంద్రాలు భారీగా పెరగడంతో సెబ్‌ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆ కోణంలోనే బెల్లం విక్రయించే వారిపైనా దాడులు చేశారు. అరెస్టులు చేశారు. భీమవరం లాంచీల రేవు రెస్ట్‌హౌస్‌ రోడ్‌, కొన్ని ప్రాంతాలలో అధికారులు కేసులు నమోదు చేసిన ఘటనలు ఉన్నాయి. అర కేజీ, కేజీ బెల్లం విక్రయించే వ్యాపారులపై దాడులు చేయడం వివాదాస్పదమైంది. ఈ క్రమంలో నెల క్రితం దుకాణాలు ముందు ‘బెల్లం అమ్మబడదు’ అంటూ బోర్డులు కూడా పెట్టారంటే వారు ఎంత నలిగిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత సెబ్‌ అధికారులు వ్యాపారులతో సమావేశాలు పెట్టి బెల్లం విక్రయించుకోవచ్చని దాడులు జరగవని పశ్చిమ గోదావరి జిల్లా అడిషనల్‌ ఎస్పీ రవికుమార్‌ హామీ ఇవ్వడంతో అప్పట్లో గొడవ సద్దుమణిగింది. అయితే కిరాణా దుకాణాల్లో బెల్లం విక్రయించవచ్చని హైకోర్టు ఆదేశాలున్నా ఎస్‌ఈబీ అధికారుల వేధింపులపై ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కిరాణా వర్తక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నెల రోజుల క్రితం జంగారెడ్డిగూడెంలో బెల్లం విక్రయించే ఒక కిరాణా చిరు వ్యాపారిని స్టేషన్‌కు తీసుకువచ్చి ఎటూ వెళ్లకుండా ఉదయం నుంచి ముద్దాయిలా కూర్చోపెట్టిన విషయాన్ని తెలుసుకున్న చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సభ్యులందరూ ఎస్‌ఈబీ స్టేషన్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. నేరుగా సారాను అరికట్టలేని ఎస్‌ఈబీ అధికారులు ఇలా కిరాణా దుకాణాలపై పడి బెల్లం విక్రయించే వారిని వేధించడంపై అసహనం వ్యక్తం చేశారు. సారా తయారీదారులకు పెద్ద మొత్తంలో బెల్లం అమ్మితే కేసులు పెట్టాలని,అర కేజీ, కేజీ బెల్లం  అమ్మే చిరు వ్యాపారుల జోలికొస్తే ఊరుకునేది లేదని ఎస్‌ఈబీపై మండిపడ్డారు. 


చిరు వ్యాపారి మృతి.. బంధువుల ఆందోళన

తాజాగా కొయ్యలగూడెం మండలం పొంగుటూరుకు చెందిన కిరాణా వ్యాపారి కొల్లూరు దుర్గారావు(60)ను ఈ నెల 5న సెబ్‌ అధికారులు బెల్లం అమ్ముతున్నాడని స్టేషన్‌కు తీసుకువెళ్ళారు. బంధువులు స్టేషన్‌ బెయిల్‌ ఇప్పించాలని కోరినా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా మంగళవారం ఏలూరు పవర్‌పేట రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు పట్టాలపై అతని మృతదేహం కనిపించింది. అతని వద్ద వున్న వివరాలు ప్రకారం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎక్సైజ్‌ అధికారుల వేధింపుల వల్లే దుర్గారావు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కొయ్యలగూడెం ఎక్సైజ్‌ పోలీసు స్టేషన్‌ వద్ద కుటుంబ సభ్యులు, ఆర్య వైశ్య సంఘాల నాయకులు ఆందోళన నిర్వహించారు. సెబ్‌ అధికారులపై చర్యలు తీసుకునే వరకూ పోస్టుమార్టానికి సహకరించేది లేదంటూ తేల్చి చెప్పడంతో మంగళవారం రాత్రి వరకూ ఏలూరు ప్రభుత్వాసుపత్రి వద్ద మృతదేహానికి పోస్టుమార్టం జరగలేదని రైల్వే ఎస్‌ఐ తెలిపారు. అయితే రాత్రి తొమ్మిది గంటల సమయంలో పోస్టుమార్టం పూర్తయ్యింది. మృత దేహాన్ని ఇక్కడ ఉంచడం కుదరదని, వెంటనే తరలించాలని ఆదరాబాదరాగా భీమడోలు ఎస్‌ఈబీ సీఐ ఆధ్వర్యంలో మృతదేహాన్ని పొంగుటూరు తరలించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. 


పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు

‘నా భర్తను సెబ్‌ అధికారులు బెల్లం అమ్మారని కేసు నమోదు చేసి తీసుకువెళ్లారు. ఇప్పుడు ఏలూరు రైల్వే స్టేషన్‌ పట్టాలపై చనిపోయాడని చెబుతున్నారు. అరెస్టు చేసి జంగారెడ్డిగూడెం ఎక్సైజ్‌ స్టేషన్‌లో వున్న నా భర్త ఏలూరు ఎలా వెళ్లాడు ? ఎలా మృతి చెందాడు’  అంటూ అతని భార్య సీతామహాలక్ష్మి కొయ్యలగూడెం పోలీసుస్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. 


సమాధానం చెప్పే వారేరీ ? 

దీనిపై జంగారెడ్డిగూడెం ఎస్‌ఈబీ అధికారుల వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఎవరూ అందుబాటులో లేరు. సీఐ సెలవులో ఉంటే, ఒక ఎస్‌ఐ మెడికల్‌ లీవ్‌లోను, మరో ఎస్‌ఐ స్టేషన్‌కు దూరంగా ఉన్నారు. ముగ్గురు హెడ్‌ కానిస్టేబుల్స్‌ ఉండగా వారిలో ఒకరు కోర్టు వ్యవహారాలు, మరొకరు చెక్‌ పోస్టులు చూస్తుండగా మూడో వ్యక్తి స్టేషన్‌ వద్ద లేకపో వడంతో దుర్గారావును ఎప్పుడు అరెస్టు చేశారు ? ఎందుకు అరెస్టు చేశారు ? మీ దగ్గర నుంచి ఎలా ఏలూరు వెళ్లాడనే విషయాలు తెలియరాలేదు.


టి.నరసాపురంలో పది కేసులు

బెల్లం విక్రయిస్తే చర్యలా... అసలు బెల్లం తయారు చేసి మా వరకు తెచ్చే వారిపై కేసులు పెడితే మేము కూడా అమ్మము కదా. ఇప్పటి వరకు బెల్లం విక్రయాలు, రవాణా చేసే వారిపై టి.నరసాపురం మండలంలో 10 కేసులు నమోదు చేశారు. ఇలా చిన్నపాటి కిరాణా దుకాణాదారులు బెల్లం అమ్మాలంటే భయాందోళన చెందుతున్నారు. సారాను అరికట్టడానికి చిరు వ్యాపారులపై పడటంపై పలువురు కిరాణా దుకాణాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


బెల్లం బెంబేలు కొయ్యలగూడెం పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళన తెలుపుతున్న మృతుని బంధువులు, గ్రామస్థులు


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.