Abn logo
Sep 26 2021 @ 10:47AM

మానసిక గోడలను కూలగొట్టాలి : రామ్ మాధవ్

న్యూఢిల్లీ : దేశంలో వేర్పాటువాద మానసిక గోడలను కూలగొట్టాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నేత రామ్ మాధవ్ అన్నారు. వేర్పాటువాదాన్ని, మతపరమైన విభజనను సమర్థించే శక్తులను నిరుత్సాహపరచాలన్నారు. ఏకైక సమైక్య భారతీయ సమాజ నిర్మాణానికి, మరో విభజన గాయాన్ని నివారించడానికి ఇది చాలా అవసరమని చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో శనివారం జరిగిన వెబినార్లో ఆయన మాట్లాడారు. 


‘‘భారత దేశం, విభజన, దాని ఫలితం : చరిత్ర భయాలను గుర్తు చేసుకోవడం’’ అనే అంశంపై ఈ వెబినార్ జరిగింది. దేశ విభజనను మహా ఉత్పాతంగా రామ్ మాధవ్ అభివర్ణించారు. అంతిమ నిర్ణయంలో తప్పుల వల్ల ఈ ఉత్పాతం జరిగిందన్నారు. పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నాను దేశ విభజన సంఘర్షణ సమయంలో మహా దుష్టుడిగా ఎదగడానికి అవకాశం ఇచ్చారన్నారు. 


భారత దేశ విభజన జరిగిన సమయంలో ఇతర దేశాల్లో కూడా విభజనలు జరిగాయని గుర్తు చేశారు. అయితే భారత దేశ విభజన మిగిలిన దేశాల విభజన వంటిది కాదన్నారు. విభజన అంటే కేవలం సరిహద్దులను గీసుకోవడం కాదన్నారు. హిందువులు, ముస్లింలకు వేర్వేరు దేశాలనే తప్పుడు వాగ్దానంతో దేశ విభజన జరిగిందన్నారు. హిందూ, ముస్లింలు వేర్వేరు ఆచారాలను పాటిస్తున్నప్పటికీ, కలిసి జీవిస్తున్నప్పటికీ ఈ విధంగా జరిగిందన్నారు. దేశ విభజన వెనుక ఉన్న శక్తి ముస్లిం లీగ్ అని అందరికీ తెలుసునని చెప్పారు. యావత్తు ముస్లిం సమాజానికి ముస్లిం లీగ్ ఎన్నడూ ప్రాతినిధ్యం వహించలేదనేది కూడా వాస్తవమని చెప్పారు. 


గత కాలపు తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం ఉందన్నారు. వారధుల నిర్మాణానికి ప్రయత్నం జరగాలన్నారు. భారత దేశ విభజన కేవలం ప్రాదేశిక విభజన కాదని, మనసుల విభజన అని తెలిపారు. మనం సమైక్య భారతీయ సమాజాన్ని నిర్మించాలన్నారు. వేర్పాటువాదం, మతపరమైన విభజనను విశ్వసించే శక్తులను నిరుత్సాహపరచినపుడు, ఒకే దేశం అనే భావనను ప్రోత్సహించినపుడు ఇది సాధ్యమవుతుందన్నారు. 


ఇవి కూడా చదవండిImage Caption

జాతీయంమరిన్ని...