Abn logo
Apr 11 2021 @ 06:28AM

ఊపిరికి.. ఉరి..!

మానసిక వత్తిడి.. క్షణికావేశంతో నూరేళ్ల జీవితం బలి

కలవరపెడుతున్న బలవన్మరణాలు  

జిల్లాలో పెరుగుతున్న ఆత్మహత్యలు

మూడు నెలల్లో 103 మందికి పైగా మృత్యు ఒడిలోకి

కడప(క్రైం), ఏప్రిల్‌10: మానసిక వత్తిడి, క్షణికావేశానికి లోనై నూరేళ్ల ఆయుష్షుకు కొందరు అర్ధంతరంగా ముగింపు పలుకుతున్నారు. ఆర్థిక కారణాలు, కుటుంబ సమస్యలు, ప్రేమ వ్యవహారాలు, చదువు వత్తిళ్లతో కొందరు, పెళ్లి కాలేదని మరికొందరు.. అనారోగ్య కారణంగా, భార్యాభర్తల మధ్య అవగాహన లోపం, వివాహేతర సంబంధాలు తదితర వాటి వల్ల బలవంతపు మరణాలకు పాల్పడుతున్నారు. 12 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసు మధ్యవారు, 65 నుంచి 70 ఏళ్లలోపు వారు ఎక్కువగా ప్రాణాలు తీసుకుంటున్నారు. జిల్లాలో జనవరి నుంచి ఈ మూడు నెలల వ్యవధిలో 103 మందికి పైగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత ఏడాది మొత్తం 412 మంది ఆత్మహత్యకు పాల్పడగా వీరిలో 276 మంది పురుషులు, 138 మంది మహిళలు ఉన్నారు. చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు వాటిని కుటుంబ సభ్యులతో కానీ, బంధువర్గంతో కానీ కూర్చుని చర్చిస్తే ఇలాంటి బలవన్మరణాలు ఉండవంటూ అటు పోలీసుశాఖ, ఇటు మానసిక వైద్యులు అంటున్నారు. మానసిక కృంగుబాటుకు గురవువుతున్న వారిని గుర్తించి కౌన్సెలింగ్‌ ఇస్తే ఆత్మహత్యలను చాలా వరకు నివారించవచ్చు.


మూడు నెలల వ్యవధిలో ఆత్మహత్యలు..

- జనవరి 8న కడప మారుతీనగర్‌కు చెందిన 50 సంవత్సరాల మహిళ మానసిక పరిస్థితి సక్రమంగా లేకపోవడం, ఆమెకు వివాహం జరగకపోవడంతో ఇంట్లోనే ఫ్యానుకు ఉరి వేసుకుంది. 

- ఫిబ్రవరి 2న కడప ఎస్‌బీఐ కాలనీకి చెందిన ఓ వ్యక్తి కొంతమంది వద్ద అప్పులు చేసి మరికొందరికి వడ్డీలకు ఇ చ్చాడు. అప్పు తీసుకున్న వారు తిరిగి ఇవ్వకపోవడం, తాను తెచ్చిన చోట అప్పులు పెరగడంతో ఆత్మహత్యక పాల్పడ్డాడు.

- కడప ఏఎ్‌సఆర్‌ నగర్‌కు చెందిన ఓ ట్రాన్సజెండర్‌, అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు కొన్ని నెలలుగా ప్రేమించుకున్నారు. అయితే ఆ యువకుడు పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ట్రాన్సజెండర్‌ ఫిబ్రవరి 4న విషద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

- కడప శంకరాపురానికి చెందిన ఓ యువతికి నందలూరుకు చెందిన యువకుడితో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో వారు వేర్వేరుగా ఉంటున్నారు. ఆమె తన 8 సంవత్సరాల కుమార్తెతో కలిసి శంకరాపురంలోని తల్లి వద్ద ఉంటోంది. ఆమెకు ఏ సమస్య వచ్చిందో తెలియదు కానీ ఫిబ్రవరి 4న తన బిడ్డతో కలిసి ఇంట్లో ఉరి వేసుకుంది.

- గత నెల మార్చి 18న పెండ్లిమర్రి మండలానికి భార్యాభర్తల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగి మనస్తాపానికి గురైన భార్య తన ముగ్గురు బిడ్డలను గొంతు నులిమి హత్య చేసి ఆపై ఆమె కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె బంధువులు హుటాహుటిన వైద్య పరీక్షల నిమిత్తం రిమ్స్‌కు తరలించగా ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ నూరేళ్లు జీవించాల్సిన పుట్టిన బిడ్డల జీవితం మాత్రం ఆమె తీసుకున్న క్షణికావేశ నిర్ణయానికి అర్ధాంతరంగా ముగిసిపోయింది.

- పెండ్లిమర్రి మండలానికి చెందిన ఓ యువకుడు ఆరు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నాడు. అయితే ఆ కుటుంబ సభ్యులు ఇతనికి ఒక కారు కొనివ్వడంతో బాడుగలకు ఇచ్చుకుంటూ జీవనం చేస్తుండేవాడు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇటీవల వారిరువురూ కలిసి హైదరాబాదు వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె తిరిగి వెనక్కి రావడంతో ఈ నెల 6న హైదరాబాదు నుంచి కడపకు వచ్చి పాతబస్టాండు సమీపంలోని ఓ లాడ్జిలో విష ద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

- కడప రైల్వేస్టేషన రోడ్డు సమీపంలో బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్న ఓ విద్యార్థి సెల్‌ఫోనలో ఎప్పుడూ గేమ్స్‌ ఆడుతున్నాడని అతని పెద్దమ్మ మందలించడంతో ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకున్నాడు. ఇటీవల విజయదుర్గాకాలనీకి చెందిన ఓ ఇంటర్‌ విద్యార్థిని ఆడుకుంటుండడంతో తల్లి చదువుకోవాలని మందలించింది. దీంతో ఆ విద్యార్థిని అపార్ట్‌మెంటు పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.


ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది..

- సునీల్‌, కడప డీఎస్పీ 

ప్రతి సమస్యకు పరిష్కార మార్గం ఉంటుంది. సమస్యల గురించి తీవ్రంగా ఆలోచిస్తూ అన్ని వయసులవారూ ఆత్మహత్యలకు పాల్పడడం బాధాకరం. మనుషుల మధ్య సంబంధాలు తగ్గి మొబైల్స్‌కు దగ్గరయ్యారు. దీంతో తమ సాదక బాధకాలు చెప్పుకునే మార్గం లేకుండా పోయింది. సరైన కౌన్సెలింగ్‌ లేకపోవడం, సెల్ఫ్‌ కంట్రోల్‌, సరైన ఓదార్పు లేకపోవడం, ఒంటరిగా ఫీల్‌ అవడం, తమ సమస్య పరిష్కారం కాదని వారే భావించుకుంటూ తాము చనిపోతేనే మంచిదని ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. మానసికంగా  ఒత్తిడికి గురయ్యే వారిని సన్నిహితులు గుర్తించి పోలీసు అధికారులకు కానీ మానసిక వైద్యుల దృష్టికి కానీ తీసుకెళితే సమస్యను పరిష్కారం అవుతుంది. త్వరలో ఆత్మహత్యల నివారణకై అవగాహన సదస్సులు నిర్వహించనున్నాం.

Advertisement
Advertisement
Advertisement