థీమ్‌.. తొలిసారిగా

ABN , First Publish Date - 2020-09-11T09:20:16+05:30 IST

ప్రతిష్ఠాత్మక యూఎస్‌ ఓపెన్‌లో పురుషుల, మహిళల విభాగం సెమీఫైనల్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. వరల్డ్‌ నెంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌...

థీమ్‌.. తొలిసారిగా

సెమీ్‌సలో ప్రవేశం 

అదే దారిలో మెద్వెదేవ్‌, అజరెంకా


సెమీ్‌సలో ఎవరితో ఎవరు ?

బ్రాడీ (అమెరికా) వర్సెస్ ఒసాక (జపాన్‌)

సెరెనా (అమెరికా) వర్సెస్ అజరెంకా (బెలారస్‌)

(భారత కాలమానం ప్రకారం శుక్రవారం 

తెల్లవారుజాము 4.30 నుంచి, స్టార్‌స్పోర్ట్స్‌ సెలెక్ట్‌-1లో..)


 (శనివారం)

పురుషులు..మెద్వెదేవ్‌ (రష్యా) వర్సెస్  థీమ్‌ (ఆస్ట్రియా)

పాబ్లో (స్పెయిన్‌) వర్సెస్ జ్వెరెవ్‌ (జర్మనీ)


న్యూయార్క్‌: ప్రతిష్ఠాత్మక యూఎస్‌ ఓపెన్‌లో పురుషుల, మహిళల విభాగం సెమీఫైనల్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. వరల్డ్‌ నెంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ అనూహ్య నిష్క్రమణతో హాట్‌ ఫేవరెట్‌గా మారిన రెండో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తూ తొలిసారి ఈ టోర్నీలో సెమీ్‌సకు చేరాడు. అంతేకాకుండా ఆస్ట్రియా దేశం నుంచి యూఎస్‌ ఓపెన్‌ సెమీ్‌సకు చేరిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అయితే ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లోనూ ఫైనల్‌కు చేరినప్పటికీ థీమ్‌ ఇంకా గ్రాండ్‌స్లామ్‌ ఖాతా తెరవలేదు. శనివారం జరిగే సెమీ్‌సలో గతేడాది ఫైనలిస్ట్‌, రష్యా స్టార్‌ డానిల్‌ మెద్వెదేవ్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు. అలాగే మహిళల సింగిల్స్‌లో మాజీ నెంబర్‌వన్‌ విక్టోరియా అజరెంకా (బెలారస్‌) మరో గ్రాండ్‌స్లామ్‌ దిశగా వడివడిగా అడుగులు వేస్తూ సెమీ్‌సకు చేరింది. ఈ కీలక పోరులో ఆమె వెటరన్‌ సెరెనా విలియమ్స్‌ను ఢీ కొనేందుకు సిద్ధమైంది. 

భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్స్‌ పోరులో థీమ్‌ 6-1, 6-2, 6-4 తేడాతో అలెక్స్‌ డి మినార్‌ (ఆస్ట్రేలియా)ను వరుస సెట్లలో సునాయాసంగా ఓడించాడు. రెండు గంటల నాలుగు నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో థీమ్‌ 11 ఏస్‌లతో విరుచుకుపడి ప్రత్యర్థిని ఏ దశలోనూ కోలుకోనీయలేదు. అలాగే ఏడు సార్లు ప్రత్యర్థి సర్వీ్‌సను బ్రేక్‌ చేశాడు. అయితే తొలి సెట్‌ సుదీర్ఘ ర్యాలీలతో ఉత్కంఠగా సాగినా.. మ్యాచ్‌ ఆద్యంతం భారీ సర్వీసులతో, బేస్‌లైన్‌ ఆటతీరుతో 21 ఏళ్ల మినార్‌ను బెంబేలెత్తించాడు. 

మెద్వెదేవ్‌ కష్టంగా..

పురుషుల సింగిల్స్‌లోని మరో క్వార్టర్స్‌లో మూడో సీడ్‌ మెద్వెదేవ్‌ విజయం కోసం తీవ్రంగా శ్రమించాడు. తన చిన్ననాటి స్నేహితుడు ఆండ్రీ రుబ్లేవ్‌ (రష్యా)తో జరిగిన ఈ మ్యాచ్‌లో చివరకు 7-6 (8-6), 6-3, 7-6 (7-5) తేడాతో గట్టెక్కాడు. రసవత్తరంగా సాగిన ఈ పోరులో ఇద్దరు ఆటగాళ్లు హోరాహోరీగా తలపడ్డారు. ఫేవరెట్‌ మెద్వెదేవ్‌ 16 ఏస్‌లతో, రుబ్లేవ్‌ 10 ఏస్‌లతో చెలరేగారు. మెద్వెదేవ్‌కు తొలి సెట్‌లోనే తీవ్ర ప్రతిఘటన ఎదురై 1-5తో వెనకబడినప్పటికీ టైబ్రేక్‌ వరకు తీసుకెళ్లాడు. చివరకు చక్కటి ఏస్‌తో సెట్‌ను గెలిచాడు. ఇక రెండో సెట్‌ను తేలిగ్గానే వశం చేసుకున్నా చివరి సెట్‌లో రుబ్లేవ్‌ గట్టిగానే పోరాడాడు. దీంతో ఈ సెట్‌ ఫలితం కూడా టైబ్రేక్‌లోనే తేలింది. 

సెరెనాతో పోరుకు సై..

 ఏడేళ్ల క్రితం ఓ గ్రాండ్‌స్లామ్‌ గెలిచిన అజరెంకా ఈసారి అదిరిపోయే ఆటతీరును ప్రదర్శిస్తోంది. మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ఆమె 6-1, 6-0తో ఎలిసే మెర్టెన్స్‌ (బెల్జియం)పై అవలీలగా నెగ్గింది. అయితే ఇప్పటిదాకా ఆమె ప్రస్థానం సులువుగానే సాగినా సెమీ్‌సలో సెరెనా ఎదురుకావడంతో శక్తికి మించిన ప్రదర్శన కనబరచాల్సిందే. 2012, 2013లలో వరుసగా యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్స్‌కు చేరిన అజరెంకాను ఆ రెండుసార్లూ సెరెనానే ఓడించింది. దీంతో ఈ ఇద్దరు అమ్మల పోరాటం ఆసక్తికరంగా సాగనుంది. 2013లో అన్‌సీడెడ్‌ అజరెంకా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ రూపంలో చివరి గ్రాండ్‌స్లామ్‌ను సాధించింది.

Updated Date - 2020-09-11T09:20:16+05:30 IST