జగన్‌ సర్కారుకు చెంపపెట్టు

ABN , First Publish Date - 2020-05-23T09:53:43+05:30 IST

డాక్టర్‌ సుధాకర్‌ కేసును సీబీఐకి అప్పగించడం.. జగన్‌ సర్కారుకు చెంపపెట్టు అని టీడీపీ పొలిట్‌బ్యూరో

జగన్‌ సర్కారుకు చెంపపెట్టు

డాక్టర్‌ సుధాకర్‌ కేసును సీబీఐకి అప్పగించడం హర్షణీయం

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అచ్చెన్నాయుడు


శ్రీకాకుళం, మే 22 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ సుధాకర్‌ కేసును సీబీఐకి అప్పగించడం.. జగన్‌ సర్కారుకు చెంపపెట్టు అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. డాక్టర్‌ సుధాకర్‌కు అండగా నిలిచిన కోర్టు తీర్పు హర్షణీయమని తెలిపారు. శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన మాట్లాడుతూ..  ‘డాక్టర్‌ సుధాకర్‌ మాస్క్‌లు అడిగితే సస్పెండ్‌ చేశారు. ఆయనపై కక్ష గట్టారు. తాగుబోతు అని ఆరోపించారు. పోలీసులను ప్రయోగించి చిత్రహింసలకు గురిచేశారు. చివరకు హైకోర్టు కూడా ఏపీ సర్కారు, పోలీసులపై నమ్మకం లేక డాక్టర్‌ సుధాకర్‌ కేసును సీబీఐకి అప్పగించింది. ప్రభుత్వం కోసం ప్రజల్ని హింసించే పోలీసు బాసులకు ఇకనైనా కనువిప్పు కలగాలి’ అని అచ్చెన్న వ్యాఖ్యానించారు.


దళిత సమాజానికి అండగా న్యాయస్థానం : కూన రవికుమార్‌

డాక్టర్‌ సుధాకర్‌కు జరిగిన అన్యాయం విషయంలో హైకోర్టు నిర్ణయంతో యావత్‌ దళిత సమాజానికే అండగా నిలిచినట్లు అయిందని ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌ అన్నారు. శుక్రవారం ఆయన శ్రీకాకుళంలో ఈమేరకు ప్రకటన విడుదల చేశారు. డాక్టర్‌ సుధాకర్‌కు హైకోర్టు అండగా నిలిచి, జగన్‌ ప్రభుత్వానికి మొట్టికాయ వేసిందని ఎద్దేవా చేశారు. గతంలో సోషల్‌ మీడియాలో ఎవరైనా పోస్టింగ్‌లు చేస్తే, కేసులు పెడతారా? అంటూ చంద్రబాబుపై విమర్శలు చేసిన సీఎం జగన్‌.. ఇప్పుడు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానాలు 57 సార్లు మొట్టికాయలు వేసినా,  జగన్‌లో మార్పు రాలేదన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా, సీఎం పదవికి జగన్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-05-23T09:53:43+05:30 IST